ఆర్టీసీకి సొంతంగా నర్సింగ్‌ కళాశాల 

19 Apr, 2022 02:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ నర్సింగ్‌ కళాశాల ప్రారంభమైంది. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి అనుబంధంగా ఏర్పాటైన ఈ కళాశాలలో సోమవారం నుంచి తరగతులు మొదలయ్యాయి. ఈ కళాశాలకు ప్రభుత్వం 50 సీట్లను కేటాయించింది. ఇందులో 30 సీట్లను కన్వీనర్‌ కోటాగా ఉంచి, ఒక్కో సీటుకు రూ.27 వేల ఫీజు నిర్ధారించింది. ఇక మేనేజ్‌మెంట్‌ కోటాగా 17 సీట్లను కేటాయించి రూ.87 వేలు చొప్పున ఫీజును నిర్ధారించింది.

అడ్మిషన్‌ రుసుముగా రూ.10 వేలు, ఇతరాలకు రూ.3 వేలు కలిపి ఈ కోటా కింద ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ సిబ్బంది కోటాగా 3 సీట్లను రిజర్వ్‌ చేశారు. సిబ్బంది పిల్లలకు వీటిని కేటాయిస్తారు. ఒకవేళ సిబ్బంది పిల్లల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉంటే ఆ సంఖ్యను ఐదుకు పెంచనున్నారు. కన్వీనర్‌ కోటా సీట్లను రెండు కౌన్సెలింగ్‌ల ద్వారా ఇప్పటికే భర్తీ చేశారు. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. ఇంకా పూర్తిస్థాయిలో విద్యార్థుల భర్తీ జరగనప్పటికీ సోమవారం నుంచి తరగతులు ప్రారంభించారు.   

మరిన్ని వార్తలు