Hyderabad RTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సిటీ బస్సు ఇక చిటికలో

25 Oct, 2021 07:48 IST|Sakshi

విద్యార్థుల రద్దీ మేరకు సర్వీసులు

తెరుచుకున్న పాఠశాలలు, కళాశాలలు

శివార్లకు ట్రిప్పులు పెంచిన ఆర్టీసీ  

సాక్షి, హైదరాబాద్‌: సిటీ బస్సులను పూర్తిస్థాయిలో రోడ్డెక్కించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కోవిడ్‌ దృష్ట్యా నిలిచిపోయిన శివారు రూట్లలో బస్సులను పునరుద్ధరించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, వృత్తివిద్యా కళాశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో అదనపు ట్రిప్పులను పెంచినట్లు హైదరాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న తెలిపారు. 

ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర, చేవెళ్ల, మొయినాబాద్, గండిమైసమ్మ తదితర రూట్లలో విద్యార్థుల రద్దీకనుగుణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 వేల ట్రిప్పులకుపైగా బస్సులు నడుస్తాయి. కోవిడ్‌ దృష్ట్యా విద్యాసంస్థలు  మూసివేయడంతో బస్సుల రాకపోకలు కూడా తగ్గాయి. కోవిడ్‌ రెండో ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన అనంతరం అన్ని స్కూళ్లు, కాలేజీలు తదితర విద్యా సంస్థలను  పునరుద్ధరించేందుకు  ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ కొన్ని విద్యాసంస్థలు ఇటీవల వరకు ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహించాయి.
చదవండి:టీఎస్‌ఆర్టీసీ మరో ముందడుగు.. ప్రయాణికులకు సజ్జనార్‌ గుడ్‌న్యూస్‌

సెమిస్టర్‌ పరీక్షలను మాత్రమే ప్రత్యక్షంగా ఏర్పాటు చేశారు. కానీ.. దసరా అనంతరం అన్ని కాలేజీలు  ప్రత్యక్ష  బోధనకు చర్యలు చేపట్టాయి. దీంతో  విద్యార్థుల రద్దీకనుగుణంగా  బస్సులను పునరుద్ధరించేందుకు  ఏర్పాట్లు చేశారు. 

అన్ని వైపులా.. 
► సికింద్రాబాద్‌ రీజియన్‌ పరిధిలో ప్రతి రోజు సుమారు 1200 బస్సులు 3.5 లక్షల కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తాయి. కీసర, గండిమైసమ్మ, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు రాకపోకలు సాగించేందుకు సాధారణ రోజుల్లో ఉదయం, సాయంత్రం సుమారు 1000 ట్రిప్పుల వరకు నడుపుతారు. కోవిడ్‌ నేపథ్యంలో ఈ   ట్రిప్పుల సంఖ్య భారీగా తగ్గింది. తిరిగి ఈ రూట్లలో ట్రిప్పులను పెంచేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. 

► హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలో నిత్యం 1,551 బస్సులు సుమారు 4.15 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి. ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కళాశాలలకు రాకపోకలు సాగించే విద్యార్థుల  కోసం ఉప్పల్, నాగోల్, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతాల నుంచి అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్‌ఎం వెంకన్న చెప్పారు.  

ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు..  
మరోవైపు బస్సుల రాకపోకలు, ఇతరత్రా సమాచారంకోసం హైదరాబాద్‌ రీజియన్‌లో ప్రత్యేక  కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులు 99592 26160ను సంప్రదించి బస్సుల వివరాలు తెలుసుకోవచ్చు. సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు.    

మరిన్ని వార్తలు