అరకోటి ఆదాయంపై నజర్‌

8 Aug, 2020 08:07 IST|Sakshi

టికెట్టేతర ఆదాయంపై ఆర్టీసీ దృష్టి 

బస్సుల సంఖ్య తగ్గడంతో సిబ్బందికి అదనపు విధులు  

10 పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు ప్రణాళికలు 

ఇప్పటికే మియాపూర్, హకీంపేట్‌లో బంకులు   

సాక్షి, హైదరాబాద్‌: టిక్కెట్టేతర ఆదాయంపై తెలంగాణ ఆర్టీసీ దృష్టి సారించింది. వరుస నష్టాలతో కుదేలైన సంస్థకు చికిత్స అందజేసేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుతం హకీంపేట్, మియాపూర్‌లలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో రెండు బంకులు పనిచేస్తుండగా మరో 8 బంకులను నగరంలోని వివిధ ప్రాంతాల్లో సొంత స్థలాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టారు. రాష్ట్రంలోని పలుచోట్ల ఆర్టీసీ సొంత బంకులను వినియోగంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జిల్లాలతో పాటు వాహనాల రద్దీ అధికంగా ఉండే హైదరాబాద్‌లో బంకులను ఏర్పాటు చేయడం వల్ల అత్యధిక ఆదాయం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

చమురు సంస్థల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ బంకులు అందుబాటులోకి వస్తే ఆర్టీసీకి ప్రతినెలా రూ.అరకోటికి పైగా ఆదాయం లభించగలదని అంచనా. పైగా వినియోగదారులకు నాణ్యమైన, కల్తీ లేని పెట్రోల్,డీజిల్‌ లభిస్తుంది. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న పెట్రోల్‌ బంకులకు వాహనదారుల నుంచి అనూహ్య ఆదరణ ఉంది. ప్రైవేట్‌ బంకుల్లో సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించడం, నాణ్యతలోనూ లోపాలు ఉండటంతో వాహనదారులు జైళ్లశాఖ ఆధ్వర్యంలోనే బంకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే తరహాలో తమకు ఉన్న స్థలాల్లోనే బంకులను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది.  

ఎక్కడెక్కడ..? 
ప్రస్తుతం హకీంపేట్, మియాపూర్‌లలో ఆర్టీసీ స్థలాల్లో రెండు బంకులు పని చేస్తున్నాయి. కానీ ఇవి ప్రైవేట్‌ నిర్వహణలో ఉన్నాయి. ఈ బంకుల నుంచి ఆర్టీసీకి కొంతమేర కమీషన్‌ మాత్రమే లభిస్తోంది. కానీ భవిష్యత్‌లో ఏర్పాటు చేయనున్న వాటిని ఆర్టీసీయే నిర్వహిస్తుంది. ఇందుకోసం తమ సిబ్బందిని అక్కడ  నియమిస్తారు. నగరంలోని ఇబ్రహీంపట్నం బస్‌స్టేషన్, రాజేంద్రనగర్, ఉప్పల్, యాచారం, జీడిమెట్ల, కుషాయిగూడ, మేడ్చల్, గౌలిగూడలలో మిగతా 8 పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాల్లో  ఆర్టీసీకి 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. పైగా ప్రధాన రహదారులకు  అందుబాటులో ఉండటంతో వాహనదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఈ స్థలాల్లో బంకుల కోసం  ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, హిందూస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థలకు దరఖాస్తు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ సంస్థల నుంచి నిరభ్యంతర పత్రాలు లభించాల్సి ఉంది. అన్ని రకాల అనుమతులు వస్తే బంకుల నిర్మాణానికి, వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఎక్కువ కాలం పట్టకపోవచ్చని ఆర్టీసీ అధికారి ఒకరు చెప్పారు.  

కొద్దిగా ఊరట... 
ఆర్టీసీ బంకులను ఏర్పాటు చేస్తే చమురు సంస్థల నుంచి పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.80, డీజిల్‌పైన రూ.1.80 చొప్పున కమిషన్‌ లభిస్తుంది. ఈ లెక్కన గ్రేటర్‌లో 10 బంకులపైన నెలకు రూ.అరకోటికి పైగా ఆదాయం వస్తుందని అంచనా. ఒక్కో బంకు నుంచి సగటున నెలకు రూ.5.5 లక్షల వరకు ఆదాయం ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. పైగా వీటి నిర్వహణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాల్సిన అవసరం లేదు. సిటీలో సుమారు 1000 బస్సులను తగ్గించడం వల్ల చాలా డిపోల్లో సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అదనంగా ఉన్న కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బందిని బంకుల నిర్వహణ కోసం వినియోగించే అవకాశం ఉంది.

కరోనా కారణంగా 5 నెలలుగా సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అంతకు ముందు కార్మికుల సుదీర్ఘమైన సమ్మె కూడా ఆర్టీసీకి అపారమైన నష్టాలను తెచ్చిపెట్టింది. ఆ దెబ్బ నుంచి కోలుకోకుండానే కరోనా పిడుగుపాటుగా వచ్చి పడింది. మరోవైపు మెట్రో రైలు నుంచి ఎలాగూ పోటీ ఉండనే ఉంది. ఈ ఐదు నెలల కాలంలోనే కనీసం రూ.650 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయినట్లు అంచనా. ఇలాంటి ఎదురు దెబ్బలను తట్టుకొనేందుకు టిక్కెట్టేతర ఆదాయాన్ని ఒక ప్రత్యామ్నాయ మార్గంగా భావించి పెట్రోల్‌ బంకులపైన కార్యాచరణ చేపట్టారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా