ఆర్టీసీ.. రెండు బ్యాంకులు.. నడుమ ఉద్యోగులు 

16 May, 2022 01:41 IST|Sakshi

జీతాల ఖాతాలు మార్చడంతో తిప్పలు.. రుణాలు చెల్లించాలంటూ నోటీసులు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఉద్యోగుల్లో టెన్షన్‌కు దారితీసింది. బ్యాంకు నుంచి రుణం తీసుకున్నప్పుడు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటామంటూ బ్యాంకు తాఖీదులు పంపుతోంది. ఇది చట్టపరంగా ఇబ్బందులు తెచ్చి పెడుతుందేమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.  

ఇదీ సంగతి... 
ఆర్టీసీకి సంబంధించి స్టేట్‌ బ్యాంకులో ఖాతాలు ఉండేవి. ఉద్యోగుల జీతాల ఖాతాలు కూడా అదే బ్యాంకు శాఖల్లో ఉండేవి. ఆ ఖాతాల ఆధారంగా ఉద్యోగులకు బ్యాంకు రుణాలిచ్చింది. ప్రతినెలా ఈఎంఐలను ఆ ఖాతాల నుంచే బ్యాంకు మినహాయించుకుంటోంది. కొంతకాలంగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారి జీతాలనూ చెల్లించలేని పరిస్థితి నెలకొనడంతో, బ్యాంకు నుంచి ఓవర్‌డ్రాఫ్టు తీసుకుని జీతాలు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది.

కానీ, ఆర్టీసీ నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) స్థితికి చేరటంతో ఓడీ ఇచ్చేందుకు బ్యాంకు నిరాకరించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మరో బ్యాంకుతో సంప్రదింపులు జరిపారు. జీతాల ఖాతాలను తమ బ్యాంకులోకి మారిస్తే ఓవర్‌డ్రాఫ్ట్‌ ఇచ్చేందుకు సిద్ధమని యూనియన్‌ బ్యాంకు ముందుకొచ్చింది. దీంతో ఇటీవల సిబ్బంది జీతాల ఖాతాలను యూనియన్‌ బ్యాంకులోకి మార్పించారు.

ఇప్పుడు ఇదే స్టేట్‌ బ్యాంకు కోపానికి కారణమైంది. ప్రతినెలా కిస్తీల మొత్తాన్ని జీతం ఖాతా నుంచి మినహాయించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో రుణాలను తిరిగి చెల్లించమని స్టేట్‌ బ్యాంకు నోటీసులు పంపుతోంది. వ్యక్తిగత రుణం తీసుకున్న సమయంలో జీతాల ఖాతాలను స్టేట్‌బ్యాంకులోనే ఉంచుతామన్న విషయంలో ఆర్టీసీ ఉద్యోగులతో ఒప్పందం చేసుకుంది.

ఇప్పుడు ఖాతాలను మరో బ్యాంకుకి మార్చడంతో ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ బ్యాంకు నోటీసులు జారీ చేస్తోంది. రుణాలు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. దీంతో ఉద్యోగులు భయపడిపోయి డిపో మేనేజర్లను ఆశ్రయిస్తున్నారు. డిపో మేనేజర్లు ఏం చేయాలంటూ ఉన్నతాధికారులను అడుగుతున్నారు. ఇప్పుడు ఈ అంశం ఆర్టీసీలో పెద్ద చర్చకు దారితీసింది.   

మరిన్ని వార్తలు