Telangana: దసరా సెలవులు.. విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త

21 Sep, 2022 17:08 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్న టీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికులకు చేరువయ్యేందుకు పరుగులు పెడుతోంది. బస్సుల వద్దకే ప్రయాణికులు రావడం కాదు.. ప్రయాణికుల వద్దకే బస్సును పంపే కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాలలకు ఈ నెల 25 నుంచి బతుకమ్మ, దసరా పండుగ సెలవులు ఇస్తున్న క్రమంలో వారి వారి స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్‌ వద్దకు ఆర్టీసీ బస్సులు పంపే ఏర్పాట్లు చేశారు.

30మందికి పైగా విద్యార్థులు ఒకే రూట్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం కల్పించడం ద్వారా విద్యార్థులు లగేజీ బరువుతో బస్టాండ్‌కు చేరుకునే ఇబ్బందులు తప్పుతాయి. ఆటో, ఇతర రవాణా ఖర్చులు తగ్గుతాయి. విద్యార్థులు, హాస్టల్‌ నిర్వాహకులు సమీపంలోని బస్‌ డిపోకు సమాచారం అందించాల్సి ఉంటుంది. 

సమాచారం ఇస్తే బస్సు పంపుతాం
దసరా సెలవుల్లో స్వస్థలాలకు వెళ్ళే విద్యార్థుల సౌకర్యార్థం వారి వద్దకే బస్సులు పంపే ఏర్పాట్లు చేశాం. 30 మందికి పైగా విద్యార్థులుంటే సరిపోతుంది. బస్సు వారి ఆవాసం ఉంటున్న వసతి గృహం వద్దకు చేరుకుని విద్యార్థులను ఎక్కించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, హాస్టల్‌ నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 
– వంగాల మోహన్‌ రావు, వరంగల్‌–1 డిపో మేనేజర్‌   
చదవండి: తక్కువ ధరకే ఐఫోన్‌ వస్తుందని.. ఫోన్‌ పే ద్వారా రూ. లక్ష పంపించాడు.. చివరికి

మరిన్ని వార్తలు