Hyderabad: స్టూడెంట్స్‌పై ఆర్టీసీ దెబ్బ.. భారీగా పెరిగిన బస్‌ పాస్‌ చార్జీలు   

10 Jun, 2022 08:32 IST|Sakshi

గ్రేటర్‌లో 5 లక్షల మంది విద్యార్థులు

ప్రతినెలా రూ.15 కోట్ల అదనపు భారం

ఆందోళనకు సిద్ధమవుతున్న విద్యార్థి సంఘాలు 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఉరుము ఉరిమి మంగళం మీడ పడ్డట్టు’ చమురు ధరలు విపరీతంగా పెరగడంతో విద్యార్థుల బస్‌పాస్‌లపై పెను ప్రభావం చూపింది. ఆర్టీసీ పిడుగుపాటులా పెంచిన చార్జీలతో విద్యార్థి లోకంపై అశనిపాతమే అయింది. కోవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఆఫ్‌లైన్‌ చదువులతో ఢక్కామొక్కీలు తిన్న విద్యార్థులు.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పరిస్థితులతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్‌పాస్‌ చార్జీలు గ్రేటర్‌లోని లక్షలాది మంది విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి.

ఇప్పటి వరకు కేవలం రూ.165 తో నెల రోజుల పాటు  ప్రయాణం చేసినవారు.. ఇక నుంచి ఏకంగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా బస్‌పాస్‌ చార్జీలను పెంచడంతో పాటు రెండు దశాబ్దాల క్రితం నాటి రాయితీలను కూడా సవరించడంతో భారం రెండింతలైంది. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులకు ఇప్పుడు ఆర్టీసీ చార్జీలే గుదిబండగా మారాయి. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్‌ రాయితీల నుంచి ఆర్టీసీ  క్రమంగా తప్పుకొనేందుకే  ఈ భారాన్ని మోపినట్లు ఆరోపణలు  వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం పట్ల  విద్యార్ధి సంఘాలు  ఆందోళన  వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.  

కొత్త చార్జీల ప్రకారమే.. 
సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు  నెలవారీ, మూడు నెలల సాధారణ బస్‌పాస్‌లతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పాస్‌లు,రూట్‌ పాస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లా బస్సుల్లో నగర శివార్ల వరకు అనుమతించే బస్‌పాస్‌లు కూడా ఉన్నాయి.  మూడు నెలల పాటు సిటీ బస్సుల్లో  ప్రయాణం చేసేందుకు తీసుకొనే క్వార్టర్లీ పాస్‌ ధర రూ.490 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.1200కు పెరిగింది. ప్రతి రోజు ఒకే మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీసుకొనే రూట్‌పాస్‌లు 8 కిలోమీటర్ల  వరకు రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.600కు పెంచారు. 
చదవండి: ఉప్పల్‌ కష్టాల్‌: అడుగడుగునా ట్రాఫికర్‌.. నలుదిక్కులా దిగ్బంధనం   

ప్రస్తుతం వివిధ రకాల విద్యార్థుల పాస్‌లపై ఆర్టీసీకి ప్రతి నెలా  రూ.8 కోట్ల వరకు ఆదాయం లభిస్తుండగా చార్జీల పెంపుతో మరో  రూ.15 కోట్లకుపైగా అదనంగా లభించనుంది. ప్రతి సంవత్సరం  విద్యార్థులపై రూ.180 కోట్లకుపైగా అదనపు  భారం పడనుంది. ఈ విద్యా సంవత్సరం కోసం విద్యార్థుల నుంచి ఆర్టీసీ బస్‌పాస్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 10 నుంచి దరఖాస్తులను స్వీకరించి 15 నుంచి జారీ చేయనుంది. కొత్త చార్జీల ప్రకారమే ఈ పాస్‌లను అందజేయనున్నారు.  

ఆందోళన ఉద్ధృతం చేస్తాం:  
ఇప్పటికే కోవిడ్‌ కారణంగా చదువులకు దూరమైన విద్యార్థులపై బస్‌పాస్‌ చార్జీల భారం మోపడం దారుణం. నిరుపేద పిల్లలు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది, బస్‌పాస్‌ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన ఉద్ధృతం చేస్తాం.
– రాథోడ్‌ సంతోష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు 

మోయలేని భారం  
బస్‌పాస్‌ చార్జీలు ఒక్కసారిగా  ఇలా పెంచడం అన్యాయం. సిటీబస్సులపై ఆధారపడి కాలేజీకి వెళ్లే నాలాంటి వారికిది  ఎంతో  భారం. పెంచిన బస్‌పాస్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. 
 – వంశీ, ఇంటర్‌ విద్యార్ధి

రూట్‌ పాస్‌లు

కిలోమీటర్లు ప్రస్తుతం పెంచిన చార్జీ 
         (రూ.లలో)
4 165 450
8 200 600
12 245 900
18 280 1150
22 330 1350
మరిన్ని వార్తలు