ఖాకీనా.. మరో రంగా?

23 May, 2022 01:56 IST|Sakshi

సిబ్బందికి కొత్త యూనిఫామ్‌పై ఆర్టీసీ కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త యూనిఫామ్‌ కోడ్‌ను అమలు చేయడంపై సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సాధారణ బస్సుల్లో డ్రైవర్, కండక్టర్లు ఖాకీ రంగు యూనిఫామ్‌ ధరిస్తుండగా ఏసీ బస్సుల్లో నీలిరంగు యూనిఫామ్‌ ధరిస్తున్నారు. అయితే ఇప్పుడు యూనిఫామ్‌ రంగును మార్చాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఎక్కువ మంది ఏ రంగు కోరుకుంటే దాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. యూనిఫామ్‌ వస్త్రాలకు వాడే బట్ట నాణ్యతపైనా దృష్టి సారించారు. తక్కువ బరువు, వేసవిలో చల్లదనాన్ని ఇచ్చేవస్త్రాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. 

గత కొన్నేళ్లుగా డుమ్మా.. 
ఆర్టీసీ ఉద్యోగులకు ఏటా రెండు జతల యూనిఫామ్‌ అందించాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా యాజమాన్యం కొన్నేళ్లుగా ఇవ్వడంలేదు. దీంతో సిబ్బందే సొంత ఖర్చులతో యూనిఫామ్‌ సమకూర్చుకుంటున్నారు. కొందరు పాత వాటినే వాడుతున్నారు. ఒకవేళ ఎవరైనా యూనిఫామ్‌ లేకుండా విధులకు హాజరైతే డిపో మేనేజర్లు షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారు.

దీంతో సిబ్బంది తమ జేబుకు భారమైనా తప్పని పరిస్థితుల్లో యూనిఫామ్‌ కుట్టించుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఇకపై ఏటా ఠంచన్‌గా రెండు జతల యూనిఫామ్‌ను సిబ్బందికి అందించాలని నిర్ణయించారు. అయితే యూనిఫామ్‌ రం గులు మారిస్తే ఎలా ఉంటుందన్న విషయంలో అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. 2019 సమ్మె తర్వాత ముఖ్యమంత్రితో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంలో మహిళా కండక్టర్లకు ప్రత్యేక యూనిఫామ్‌ విషయం చర్చకు వచ్చింది.

సీఎం ఆదేశంతో ఏర్పాటైన ఆర్టీసీ కమిటీ మెరూన్‌ రంగు యాప్రాన్‌ను మహిళా కండక్టర్లకు ఇవ్వాలని సిఫారసు చేసిం ది. ఆ మేరకు మహిళా సిబ్బందికి వాటిని పంపిణీ చేశారు. ఇప్పుడు మొత్తం సిబ్బందికి కొత్త వస్త్రాలు ఇవ్వడంతోపాటు రంగును కూడా ఎంపిక చేయబోతున్నారు. 

నేషనల్‌ పోలీసు అకాడమీ సిఫారసులకు తగ్గట్టుగా.. 
పోలీసు సిబ్బందికి ప్రత్యేక వస్త్రాన్ని యూనిఫామ్‌ కోసం అందిస్తారు. రెండు రకాల దారాలను కలిపి ఆ వస్త్రాన్ని రూపొందిస్తారు. అది తక్కువ బరువు ఉండటంతోపాటు వేసవిలో చల్లగా, ముడతలు పడని విధంగా ఉంటుంది. ఉతికిన తర్వాత త్వరగా ఆరిపోతుంది. రంగు కూడా తొందరగా వెలిసిపోదు. దీన్ని నేషనల్‌ పోలీసు అకాడమీ ప్రత్యేకంగా నిపుణులతో చర్చించి సిఫారసు చేసింది.

ఇప్పుడు అలాంటి వస్త్రాన్నే తమ సిబ్బందికి అందించాలని ఆర్టీసీ భావిస్తోంది. అలాంటి వస్త్రం సరఫరా కోసం రేమండ్స్‌ కంపెనీతో చర్చిస్తోంది. మరో 2–3 రోజుల్లో ఆ కంపెనీ ప్రతినిధులు ఆ తరహా వస్త్రానికి సంబంధించి 4–5 రంగులు అధికారులకు చూపించనున్నారు. అందులోంచి ఎక్కువ మంది సిబ్బంది ఏది కోరుకుంటే దాన్ని ఎంపిక చేసి యాజమాన్యం అందించనుంది. సిబ్బందికి ఏటా రెండు జతల యూనిఫామ్‌ ఇచ్చేందుకు ఆర్టీసీకి రూ. 8–10 కోట్ల వరకు ఖర్చు కానుంది.  

మరిన్ని వార్తలు