గట్టెక్కే ప్రా‘సెస్‌’ లో ఆర్టీసీ 

13 Jun, 2022 00:44 IST|Sakshi

భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న అదనపు డీజిల్‌ సెస్‌

రోజువారీ టికెట్‌ ఆదాయం రూ.15.50 కోట్లకు పెరుగుదల

ఒక్క పెంపుతో రూ.2.50 కోట్ల మేర అదనంగా రాబడి

విద్యార్థుల పాస్‌లతో రోజుకు అదనంగా రూ.50 లక్షలు వచ్చే చాన్స్‌

వెరసి భారీగా తగ్గిన ఆర్టీసీ నష్టాలు

సాక్షి, హైదరాబాద్‌: పెంచిన డీజిల్‌ సెస్‌తో ఆర్టీసీకి నష్టాల స్ట్రెస్‌ (ఒత్తిడి) తగ్గింది. క్రమంగా గాడిన పడుతోంది. జూన్‌ ఆరోతేదీ (సోమవారం)న టికెట్‌ రూపంలో రూ.15.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఆర్టీసీ చరిత్రలో (పండగలు కాని సమయం) ఆల్‌టైమ్‌ రికార్డు. సాధారణంగా ప్రతి సోమవారం ఆదాయం భారీగా ఉంటుంది. సాధారణరోజుల్లో ఆ మొత్తం రూ.12 కోట్లు– రూ.12.50 కోట్లుగానే ఉంటుంది.

కానీ, ఈ నెల 9, 10, 11 తేదీల్లో టికెట్‌ రూపంలో ఆదాయం వరసగా రూ.15.20 కోట్లు, రూ.15.51 కోట్లు, రూ.15.70 కోట్లు నమోదైంది. ఇది డీజిల్‌ అదనపు సెస్‌ మహిమ. 10, 11 తేదీ ల్లోని ఆదాయం జూన్‌ ఆరోతేదీ నాటి ఆల్‌టైమ్‌ రికార్డును కూడా బ్రేక్‌ చేయడం గమనార్హం. ఏప్రిల్‌ 9న ప్రతి టికెట్‌పై కేటగిరీలవారీగా రూ.2 నుంచి రూ. 10 వరకు విధించిన డీజిల్‌ సెస్‌ వల్ల సాధారణ రోజుల్లో పెద్దగా ఆదాయం పెరగలేదన్న ఉద్దేశంతో, దాన్ని అలాగే ఉంచి,

ఎక్కువ దూరం ప్రయాణిం చినవారిపై ఎక్కువ సెస్, తక్కువ దూరం ప్రయా ణిస్తే తక్కువ సెస్‌ పడేలా.. దూరం ఆధారంగా అద నపు డీజిల్‌ సెస్‌ విధించిన విషయం తెలిసిందే. ఇది భారీ ప్రభావమే చూపుతోంది. ఒక్క పెంపుతో రోజుకు రూ.2.50 కోట్ల మేర అదనంగా ఆదాయం నమో దైంది. ఇది ఇలాగే కొనసాగితే ఆర్టీసీ దశ తిరిగేలా  ఉంది. మరి కాస్త యత్నిస్తే.. ఏకంగా ఆర్టీ సీని బ్రేక్‌ ఈవెన్‌కు చేర్చేలా కనిపిస్తోంది. 

కొత్త సెస్‌తో నెలకు రూ.75 కోట్లు
ఆర్టీసీకి సగటున రోజువారీ అదాయం రూ.11 కోట్లు ఉండగా 3 నెలల క్రితం కొత్తగా సేఫ్టీ సెస్, ప్యాసింజర్‌ సెస్‌(పెంపు), టోల్‌గేట్‌ సెస్‌ విధించారు. ఆ తర్వాత డీజిల్‌ సెస్‌ చేర్చారు. దీంతో రోజువారీ ఆదాయం రూ.12,50 కోట్లకు చేరువైంది. అయితే, ఆదాయం పెంపుదలకు ఇంకా కొత్త మార్గాలు వెతికింది. దీంతో కొందరు అధికారులు, డీజిల్‌ సెస్‌ను టికెట్‌పై నిర్ధారిత మొత్తంలా కాకుండా, దూరాన్ని బట్టి వేర్వేరు మొత్తాలకు చార్జీలు వేయాలని సూచించారు.

దీంతో వెంటనే దాన్ని అమలులోకి తెచ్చిన ఆర్టీసీ, అదనపు డీజిల్‌ సెస్‌ పేరుతో చార్జీలను సవరించింది. అది భారీ ఆదాయాన్ని సమకూరుస్తోంది. కొత్త సెస్‌ నెలకు రూ.75 కోట్లు, సాలీనా రూ.900 కోట్ల మేర ఆర్టీసీకి అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఈ సెస్‌ విధించకముందు రోజువారీ నష్టాన్ని రూ.5 కోట్లుగా ఆర్టీసీ చూపింది. అందులో ఇప్పుడు దాదాపు రూ.3 కోట్ల లోటు పూడేటట్టుగా ఉంది. మరో రూ.2 కోట్ల లోటు కూడా పూడితే ఆర్టీసీ నష్టాలు ఆగిపోయినట్టే. 

బస్‌పాస్‌ ప్రభావం త్వరలో..
అదనపు డీజిల్‌ సెస్‌తోపాటే విద్యార్థుల బస్‌పాస్‌ ధరలను కూడా ఆర్టీసీ భారీగా పెంచింది. పాస్‌లపై రాయితీ మొత్తాన్ని తగ్గించుకోవటం ద్వారా కొన్ని రకాల పాస్‌ల ధరలను రెండు రెట్లు పెంచింది. ప్రస్తుతం వేసవి సెలవుల దృష్ట్యా విద్యార్థులు పాస్‌లను ఇంకా రెన్యూవల్‌ చేయించుకోలేదు. ఆ ప్రక్రియ మొదలైతే పెరిగిన బస్‌పాస్‌ల ఆదాయం కూడా ఆర్టీసీకి జమ అవుతుంది.

విద్యార్థుల బస్‌పాస్‌ ధరల  పెంపు ద్వారా వచ్చే ఆదాయం సగటున రోజుకు రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే రోజువారీ నష్టాల్లో మరో రూ.అరకోటి పూడినట్టే. ఆక్యుపెన్సీ రేషియో మరికాస్త పెంచుకోగలిగితే.. ఆర్టీసీ బ్రేక్‌ ఈవెన్‌ దశకు చేరుతుంది. అంటే లాభనష్టాలు లేనిస్థితికి వస్తుంది. కాగా, కరీంనగర్‌ జోన్‌ పరిధిలోని కొన్ని డిపోలు లాభాల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు