వెయ్యి కోట్ల రుణం చేజారింది! 

30 May, 2021 04:45 IST|Sakshi

ఆర్టీసీని బ్యాంకులు ఎన్పీఏ జాబితాలో చేర్చడం వల్లే...

ప్రభుత్వ పూచీకత్తుతో భారీ రుణానికి బ్యాంకు ఓకే

కానీ రూ.190 కోట్ల మొండి బకాయి చెల్లించాలని షరతు 

ఆ పాత బకాయి తీర్చేలా సాయం కోసం సర్కారుకు సంస్థ వినతి 

బ్యాంకు రుణం అందితేనే సిబ్బందికి జీతాలు, అద్దె బస్సుల నిర్వాహకులకు బిల్లులు 

సాక్షి, హైదరాబాద్‌: చేతికి అందివచ్చిన సాయం రూ.1,000 కోట్లు చివరి నిమిషంలో అడుగు దూరంలో ఆగిపోయింది. దీంతో ఆర్టీసీ దిక్కుతోచని పరిస్థితిలో చిక్కుకుపోయింది. ఇప్పుడా సాయం అందితేనే సిబ్బంది జీతాలు, తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన అద్దె బస్సు నిర్వాహకుల బకాయిలు చెల్లించేందుకు వీలవుతుంది. చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో అందివచ్చిన సాయం పొందాలంటే, ఇప్పటికిప్పుడు ఆర్టీసీకి రూ.190 కోట్లు కావాలి. అవి చెల్లిస్తేనే సాయం అందుతుంది. వాస్తవానికి రూ.1,000 కోట్లు్ల బ్యాంకు నుంచి రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. ఇప్పుడు ఆ రుణానికి అవసరమైన రూ.190 కోట్లు కూడా ప్రభుత్వం ఇస్తే తప్ప ఆర్టీసీ గట్టెక్కలేని పరిస్థితి నెలకొంది. 

అది ఎన్‌పీఏ మహిమ.. 
ఆర్టీసీ చాలాకాలంగా అప్పులపై నెట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండటం, సిబ్బంది జీతాల ఖర్చు బాగా పెరిగిపోవటంతో బ్యాంకు రుణాల ద్వారా సర్దుబాటు చేస్తోంది. అయితే అలా తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవటం తరచూ జరుగుతుండటంతో ఆర్టీసీని బ్యాంకులు మొండి బకాయిల జాబితాలోకి చేర్చాయి. తద్వారా సంస్థ నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) జాబితాలో చేరిపోయింది. ఒకసారి బ్యాంకులు మొండి బకాయిదారుగా నిర్ధారిస్తే కొత్తగా రుణం పుట్టదు. ఇప్పుడు ఆర్టీసీకి అదే పరిస్థితి ఎదురైంది. గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్లో ఇంకా రూ.190 కోట్ల మేర బకాయి ఉంది. చాలాకాలంగా ఈ మొత్తాన్ని తీర్చకపోవటంతో మొండిబకాయిగా ముద్రపడింది.  

సెకండ్‌ వేవ్‌తో పెరిగిన నష్టాలు 
అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థపై కోవిడ్‌ రెండో దశ మరింత నష్టాలకు గురిచేసింది. ప్రస్తుతం ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు అద్దె బస్సు నిర్వాహకులకు ఐదు నెలలుగా రూ.100 కోట్ల బిల్లులు చెల్లించలేదు. దీంతో బస్సుల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ సహకార పరపతి సంఘం బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడంతో బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలోంచి రూ.1,000 కోట్లను ప్రభుత్వ పూచీకత్తు రుణంగా ఇచ్చేందుకు అంగీకరించింది.

ఆ మేరకు పూచీకత్తు జారీ చేసింది. దానికి స్పందించిన ఓ బ్యాంకు రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కానీ రూ.190 కోట్ల అప్పు మరో బ్యాంకుకు బకాయిపడి చాలాకాలం కావ టంతో, అది చెల్లిస్తేగానీ రూ.1,000 కోట్ల కొత్త అప్పు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆ రూ.190 కోట్లు చెల్లించే మార్గం లేక ఆర్టీసీ మళ్లీ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. దీంతో ఆర్టీసీ అధికారులు ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 


మాకు చెల్లించకపోతే ఆత్మహత్యలే గతి 
గతంలో మా బకాయిలు తీర్చేందుకు తెచ్చిన నిధులను డీజిల్, ఇతర ఖర్చులకు వాడేసి మాకు పైసా ఇవ్వలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తే మాకు ఆత్మహత్యలే శరణ్యం. ఇప్పుడు మాలో చాలామందికి తిండికి కూడా కష్టంగా ఉంది. బ్యాంకులు మా బస్సుల్ని జప్తు చేస్తున్నాయి. డ్రైవర్లు జీతాల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. మాకే తిండికి కష్టంగా మారిన పరిస్థితిలో డ్రైవర్లకు జీతాలు ఎలా ఇవ్వగలం. ఇప్పటికే 12 మంది మా ప్రతినిధులు కోవిడ్‌తో చనిపోయారు. మరో 200 మంది పోరాడుతున్నారు. ఇప్పటికైనా వచ్చే రూ.1,000 కోట్ల నుంచి మా బకాయిలు చెల్లించి ఆదుకోవాలి. 
– జగదీశ్వర్‌రెడ్డి, అద్దె బస్సు యజమానుల సంఘం  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు