డీజిల్‌ మోత.. చార్జీల వాత!

10 Jun, 2022 02:11 IST|Sakshi

ఆర్టీసీపై భారీగా పెరిగిన డీజిల్‌ భారం

లీటర్‌కు 2019 డిసెంబర్‌లో రూ.66.. ఇప్పుడు రూ.98.50

రోజుకు అదనపు భారం రూ.1.80 కోట్లు

బల్క్‌ డీజిల్‌ కొనుగోళ్లతోనూ సమస్య

సంస్థ నిర్వహణ వ్యయంలో డీజిల్‌ వాటానే 30 శాతం

ఈ భారంలో కొంత ప్రయాణికులు భరించాల్సిందేనంటున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ రోజువారీగా డీజిల్‌పై చేసే వ్యయం రూ.3.63 కోట్ల నుంచి రూ.5.42 కోట్లకు పెరిగింది. అంటే 1.80 కోట్లు అదనపు భారం పడుతోంది. ఆర్టీసీ మొత్తం వ్యయంలో ఇప్పుడు డీజిల్‌ వాటా 30 శాతానికి చేరుకుంది. ఇటీవలి వరకు ఇలా డీజిల్‌ భారం పెరిగినా దాన్ని ఆర్టీసీ భరిస్తూ రావటమో, కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం పొందడమో జరిగింది. కానీ, డీజిల్‌ ధరలు వెనక్కి వచ్చే అవకాశం కనిపించక పోవ డంతో ఈ భారంలో కొంత మొత్తాన్ని జనంపై వేసేలా ఆర్టీసీ ‘సెస్‌’ల విధింపు మొదలుపెట్టింది.

నష్టాలు కొండలా పేరుకుపోయి..
రాష్ట్రం విడిపోయిన కొత్తలో తెలంగాణ ఆర్టీసీకి సాలీనా రూ.450 కోట్ల వరకు నష్టం ఉండేది. డీజిల్‌ ధరలు, ఇతర వ్యయాలు పెరగడంతో నష్టం రూ.2 వేల కోట్లకు చేరింది. కరోనా సమస్యలు కూడా దానికి తోడయ్యాయి. రూ.3 వేల కోట్లకుపైగా పేరుకున్న అప్పులు, వాటిపై వడ్డీని భరించలేకపోవడం, ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆర్ధికసాయం లేకపోవడం, బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో తగ్గిపోవడం వంటి సమస్యలతో ఆర్టీసీ విలవిల్లాడుతోంది. ఈ క్రమంలోనే చార్జీల పెంపు, సెస్‌ల విధింపుపై దృష్టి సారించింది.

ఇప్పటివరకు చార్జీల పెంపు తీరు
రాష్ట్ర విభజన తర్వాత 2016 జూన్‌లో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచింది. సాలీనా ప్రజలపై రూ.350 కోట్ల అదనపు భారం మోపింది. ఆ సమయంలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.58.

2019 డిసెంబర్‌లో టికెట్‌ చార్జీలను సవరిం చింది. సాలీనా జనంపై రూ.700 కోట్ల భారం పడింది. ఆ రోజు లీటర్‌ డీజిల్‌ ధర రూ.71.

2022 మార్చి–జూన్‌ మధ్య గతంలో ఎన్నడూ లేనట్టుగా ‘సెస్‌’ల విధింపును ఆర్టీసీ మొదలు పెట్టింది. కేవలం రెండున్నర నెలల వ్యవధిలో సెస్‌లు, టోల్‌ప్లాజాల రుసుము పేరుతో చార్జీలు పెంచి.. సాలీనా ప్రయాణికులపై రూ.250 కోట్ల మేర అదనపు భారం మోపింది.

ఇకముందు కూడా డీజిల్‌ ధరలు పెరిగినప్పుడల్లా ‘అదనపు సెస్‌’ను విధించే డైనమిక్‌ విధానాన్ని అమలు చేయనుంది.

కొత్త చార్జీలు అమల్లోకి..
డీజిల్‌ సెస్‌ను విధిస్తూ సవరించిన కొత్త చార్జీలు గురువారం తొలి సర్వీసు నుంచే అమల్లోకి వచ్చా యి. టికెట్‌ చార్జీలు ఉన్నట్టుండి పెరిగిపోవడంపై చాలా ప్రాంతాల్లో ప్రయాణికులు కండక్టర్లతో వాదనకు దిగారు.  ఇక కొత్త చార్జీల ప్రకారం..  ఎంజీబీఎస్‌ నుంచి విజయవాడ వెళ్లే సూపర్‌ లగ్జరీ టికెట్‌ ధర రూ.420 నుంచి రూ.470కి.. రాజధాని టికెట్‌ ధర రూ.550 నుంచి రూ.600కు పెరిగాయి.

ఎంజీబీఎస్‌ నుంచి భద్రాచలం వెళ్లే సూపర్‌ లగ్జరీ టికెట్‌ ధర రూ.470 నుంచి రూ.550కి.. ఎంజీబీఎస్‌ నుంచి తిరుపతి వెళ్లే సూపర్‌ లగ్జరీ టికెట్‌ ధర రూ.840 నుంచి 890కి పెరిగాయి. 

పల్లె వెలుగుల్లో రెండో స్టేజీ (10 కి.మీ.)కి రూ.5, నాలుగో స్టేజీకి మరో రూ.ఐదు, ఏడో స్టేజీకి మరో రూ.5.. ఇలా టికెట్లు జారీ అయ్యాయి. 

2019 డిసెంబర్‌లో చమురు కంపెనీల నుంచి ఆర్టీసీ బల్క్‌గా కొనే డీజిల్‌ ధర లీటరుకు రూ.66

ప్రస్తుతం రిటైల్‌గా బంకుల్లో ఆర్టీసీ కొంటున్న డీజిల్‌ ధర లీటరుకు రూ.98.50..

రెండున్నరేళ్ల సమయం.. ఒక్కో లీటర్‌పై అదనంగా పడ్డ భారం రూ.32.50. 

మరిన్ని వార్తలు