TSRTC: ‘అదనం’ లేదు

11 Oct, 2021 01:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆర్టీసీ బస్సులు గత 5 రోజుల్లో 1.30 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. ఆర్టీసీపై ప్రజల్లో అభిమానం ఉందనడానికి ఇదే నిదర్శనం. పండుగ వేళ మిగతా వాళ్లు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితంగా ప్రయాణించి సంస్థకు అండగా నిలవాలి. ప్రయాణికులు తమ భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుంది.

–ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌  

సాక్షి, హైదరాబాద్‌:  పండుగకు ఊరెళ్లాలంటే జేబులు గుల్లకావడం ఖాయం. ప్రైవేటు ట్రావెల్స్‌ రెండు మూడు రెట్లకుపైగా చార్జీలు వసూలు చేస్తే.. ఆర్టీసీ కూడా టికెట్‌ రేటుపై 50శాతం అదనంగా తీసుకునేది. దసరా సహా ప్రతి పండుగకూ మామూలు సర్వీసులను తగ్గించి పండుగ స్పెషల్‌ బస్సులు వేసేది. కానీ ఈసారి దసరాకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. సాధారణ బస్సులతోపాటు స్పెషల్‌ బస్సుల్లో కూడా సాధారణ టికెట్‌ ధరలనే వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. 

ఆదరణ పెంచుకునేందుకు
 కొన్నాళ్లుగా ఆర్టీసీ కునారిల్లుతూ వస్తోంది. సంస్థ నిర్వహణ లోపాల కారణంగా ప్రయాణికుల ఆదరణ తగ్గింది. పండుగల సమయంలోనే కాదు సాధారణ రోజుల్లోనూ.. ఆర్టీసీ కంటే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులకే గిరాకీ ఎక్కువగా ఉండటం పెరిగింది. ఈ పరిస్థితిని మార్చడంపై సంస్థ కొత్త ఎండీ సజ్జనార్‌ దృష్టిపెట్టారు. ఇందుకు దసరా పండుగ సమయాన్ని అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా పండుగల సమయంలో ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్‌తో నడిపే ప్రత్యేక బస్సుల్లో టికెట్‌ ధర 50 శాతం అదనంగా ఉంటుంది. ఈసారి కూడా అదనపు రుసుముతో స్పెషల్‌ బస్సులు తిప్పాలని అధికారులు భావించినా.. సజ్జనార్‌ దీనిని వ్యతిరేకించారు. పండుగల సమయంలో లక్షల మంది బస్సుల్లో సొంతూర్లకు వెళతారని, ఇలాంటి సమయంలో అదనపు వసూలును వదిలేయడం వల్ల ప్రజల్లో ఆర్టీసీపై ఆదరణ పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు నిత్యం ఆర్టీసీ బస్సులు ఎక్కితే.. ఆక్యుపెన్సీ రేషియో, ఆదాయం ఆటోమేటిక్‌గా పెరుగుతాయని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అదనపు చార్జీలేవీ లేకుండానే స్పెషల్‌ బస్సులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అదనపు రాబడి తక్కువ.. చెడ్డపేరు ఎక్కువ.. 
ఆర్టీసీకి రోజువారీ టికెట్‌ ఆదాయం గరిష్టంగా రూ.13 కోట్ల వరకు ఉంటుంది. కోవిడ్‌కు ముందు (సమ్మె కాలం కాకుండా) ఈస్థాయి ఆదాయం నమోదైంది. దసరా పండుగకు మూడు రోజుల ముందు, తర్వాత అదనపు బస్సుల వల్ల మరికొంత ఆదాయం పెరుగుతుంది. ఇందులో టికెట్‌ చార్జీలపై 50శాతం ఎక్కువ ధర తీసుకోవడం వల్ల.. ఆర్టీసీకి అదనంగా సమకూరేది రోజుకు రూ.40 లక్షలేనని అంచనా. ఈ మాత్రం ఆదాయం కోసం.. అదనపు చార్జీల బాదుడు అంటూ ప్రజల్లో చెడ్డపేరు వస్తోందని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. సజ్జనార్‌ ఈ అంశాలన్నింటినీ పరిశీలించి, అదనపు బాదుడు వద్దనే నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నాయి.  

అలా ప్రయాణికులను తరలించొద్దు 
పండుగ వేళ డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని కొందరు సాధారణ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు. తెలుపురంగు నంబర్‌ ప్లేట్‌ ఉన్న (నాన్‌ కమర్షియల్‌) వాహనాల్లో ప్రయాణికులను తరలించడం నేరమని.. అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడతామని ప్రకటించారు. ఇటీవల ఆర్టీసీ–రవాణా శాఖ అధికారుల సంయుక్త తనిఖీల్లో 20 వాహనాలను పట్టుకుని సీజ్‌ చేశారు. నాన్‌–కమర్షియల్‌ వాహనాల్లో ప్రయాణించేప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా కూడా రాదని అధికారులు పేర్కొంటున్నారు.   

మరిన్ని వార్తలు