Tsrtc Md Sajjanar: ట్వీట్‌ చేస్తే.. బస్సొచ్చె.. భలె భలె!

5 Dec, 2021 14:30 IST|Sakshi

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థలో ఒక్కో అంశంపై దృష్టి సారిస్తున్నారు. వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకునే విధానం సులభతరం చేశారు. డిపాజిట్‌ కూడా రద్దు చేశారు. పెళ్లికి బస్సు అద్దెకు తీసుకుంటే గిఫ్టులు ఇచ్చే విధానం ప్రవేశపెట్టారు. ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలో ప్రయాణికులు ఇటీవల ట్వీట్‌ చేసిన సమస్యలపై అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిష్కారమైన సమస్యలివీ... 

సమయానికి బస్సు రావడం లేదంటూ ఓ ప్రయాణికుడి ఫిర్యాదు..  మా ఊరికి బస్సు రాక ఏళ్లు అయితుంది.. మీరు బస్సు వేయిస్తారా?.. ఓ గ్రామ యువకుడి ప్రశ్న.. బస్సు సమయానికి రాక కాలేజీకి టైంకు చేరుకోలేకపోతున్నం.. పాఠ్యాంశాలు నష్టపోతున్నం.. ఓ విద్యార్థి వినతి.. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ట్విట్టర్‌ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ దృష్టికి తీసుకెళ్లారు.. మెస్సేజ్‌ రావడమే ఆలస్యం అన్నట్లు.. వెంటనే ఆయన స్పందించి రిప్లయ్‌ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. 

సాక్షి,నెన్నెల(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేటకు 30 ఏళ్లుగా బస్సు సౌకర్యం లేదు. గ్రామానికి చెందిన రాంటెంకి శ్రీనివాస్, చామనపల్లికి చెందిన జాజిమొగ్గ గణేశ్‌ కోనంపేటకు బస్సు సౌకర్యం కల్పించాలని నవంబర్‌ 12న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్‌ చేశారు. స్పందించిన ఎండీ మంచిర్యాల ఆర్టీసీ డీఎం మల్లేశయ్యను ఆదేశించడంతో నవంబర్‌ 16 నుంచి బస్సు ప్రారంభించారు.

30 ఏళ్ల తర్వాత ఆ ఊరికి బస్సు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ డీఎం, డ్రైవర్, కండక్టర్‌ను శాలువాలతో సత్కరించారు. కరోనా నేపథ్యంలో నెన్నెల, మైలారం, కుశ్నపల్లి గ్రామాలకు ఏడాదిగా బస్సు నిలిచిపోయింది. ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులు గమనించిన ప్రవాస భారతీయుడు వెంకట కృష్ణారెడ్డి అక్టోబర్‌ 21న ట్విట్టర్‌ ద్వారా ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. మరుసటి రోజు నుంచి ఆయా గ్రామాలకు బస్సు పునఃప్రారంభమైంది.

కష్టాలు దూరమయ్యాయి
మా ఊరికి 30ఏళ్ల కిందట సర్కార్‌ బస్సు వచ్చేది. అప్పట్లో రాకపోకలకు సౌలత్‌ ఉండేది. అధికారులు బస్సు బంద్‌ చేయడంతో ఇబ్బంది పడ్డాం. ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడక, ఎడ్లబండే దిక్కయ్యేది. ప్రస్తుతం మా ప్రయాణ కష్టాలు దూరమయ్యాయి.
– చాపిడి పెంటక్క, కోనంపేట 

చదువులు మానొద్దని..
తాంసి(బోథ్‌): ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు మండలంలోని వివిధ గ్రామాల నుంచే కాకుండా జిల్లా కేంద్రం నుంచి కూడా విద్యార్థులు వస్తుంటారు. జిల్లా కేంద్రం నుంచి తాంసి మండల కేంద్రానికి బస్సు సౌకర్యం లేక.. ప్రైవేటు వాహనాలు సమయానికి రాక విద్యార్థులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అనేక ఇక్కట్లకు గురయ్యేవారు. మండల కేంద్రానికి చెందిన దారవేణి రాఘవేంద్ర నవంబర్‌ 22న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్‌ చేశాడు.

జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాంసికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చదువు మధ్యలోనే మానేసే అవకాశం ఉందని, బస్సు ప్రారంభించాలని కోరాడు. రెండు గంటల వ్యవధిలోనే స్పందించిన ఎండీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత నెల 25 నుంచి తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామానికి వెళ్లే బస్సును తాంసి మండల కేంద్రం మీదుగా ఉదయం, సాయంత్రం నడిపిస్తున్నారు. మండల కేంద్రానికి ప్రత్యేకంగా బస్సు నడిపితే బాగుంటుందని మండల వాసులు, విద్యార్థులు కోరుతున్నారు.

తిర్యాణి(ఆసిఫాబాద్‌): కుమురంభీం జిల్లా తిర్యాణి మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో చుట్టూ దట్టమైన అడవి, కొండల మధ్య ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మంగి గ్రామానికి 26 ఏళ్లకు ఆర్టీసీ బస్సు వచ్చింది. ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా ఎస్సై రామారావు మూడు కిలోమీటర్ల మేర కంకర తేలిన రహదారిపై గ్రామస్తుల సహకారంతో దాదాపు 400 ట్రిప్పుల మొరం పోయించి వాహనాల రాకపోకలకు అనువుగా మార్చారు. సమస్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి బస్సు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల క్రితం ఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర బస్సు ప్రారంభించారు. దీంతో 30 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.

సంతోషంగా ఉంది
దాదాపు 26 ఏళ్ల తర్వాత మా ఊరికి ఆర్టీసీ బస్సు రావడం సంతోషంగా ఉంది. ఘాట్‌ రోడ్డు బాగాలేక ఇంతకాలం తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు 108 వాహనం కూడా వస్తోంది. పోలీసులకు రుణపడి ఉంటాం. 
– బోజ్జిరావు, ఉప సర్పంచ్, మంగి

రెండ్రోజుల్లోనే..
సిరికొండ(బోథ్‌): మండల కేంద్రంతోపా టు చుట్టుపక్కల దాదాపు 40 గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే అనేక ఇక్కట్లకు గురయ్యేవాళ్లం. మండల కేంద్రం నుంచి నిత్యం దాదాపు 200 మంది విద్యార్థులు జిల్లా కేంద్రానికి ఉన్నత చదువులకోసం వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సులేక పడుతున్న ఇబ్బందులను గమనించిన ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన సామాజిక కర్యకర్త రాథోడ్‌ మౌనిక సమస్యను ఆర్టీసీ ఎండీకి ట్వీట్‌ చేసింది. సజ్జనార్‌ రెండు రోజుల్లో బస్సు సౌకర్యం కల్పించారు.

నిర్మల్‌ నుంచి బోథ్‌కు లింక్‌బస్సు
బోథ్‌: హైదరాబాద్‌ నుంచి బోథ్‌కు రాత్రి సమయంలో నడిచే బస్సును లాభాలు రావడం లేదని గతంలో ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ప్రజల ఇబ్బందులు గమనించిన మండల కేంద్రానికి చెందిన బోనగిరి కిరణ్‌కుమార్‌ బస్సు పునరుద్ధరించాలని అక్టోబర్‌ 29న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్వీట్‌ చేశారు. స్పందించిన సజ్జనార్‌ నిర్మల్‌ నుంచి బోథ్‌కు ఉదయం 5 గంటలకు లింక్‌ బస్సును ఏర్పాటు చేశారు.

గిరి గ్రామాలకు ఆర్టీసీ బస్సు
పెంచికల్‌పేట్‌: మండలంలోని గుండెపల్లి, కమ్మర్‌గాం, నందిగామ, మురళీగూడ గ్రామాలకు గతేడాది మే నుంచి ఆర్టీసీ బస్సు నిలిపివేశారు. ఆయా గ్రామాల ప్రజలు ఆర్టీసీ సేవలు లేక పడుతున్న ఇబ్బందులపై నవంబరు 16న ‘సాక్షి’లో ‘అందని ఆర్టీసీ సేవలు’ పేరుతో కథనం ప్రచురితమైంది. మండల కేంద్రానికి చెందిన యువకులు కథనాన్ని ఎండీ సజ్జనా ర్‌కు ట్వీట్‌ చేశారు. ఆయన ఆదేశాలతో సంబంధిత అధికారులు నవంబరు 19 నుంచి గిరి గ్రామాలకు బస్సు పునరుద్ధరించారు. 

హైదరాబాద్‌ బస్సు పునరుద్ధరణ
ఖానాపూర్‌: ప్రతీరోజు ఉదయం 5 గంటలకు కడెం, ఖానాపూర్‌ మీదుగా హైదరాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సు కొంతకాలంగా నిలిచిపోయింది. బస్సు సేవలు పునరుద్ధరించాలని గత నెల 19న ఖానాపూర్‌కు చెందిన బీసీ యువజన సంఘం నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు తోట సుమీత్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్విట్‌ చేశాడు. స్పందించిన ఆర్టీసీ అధికారులు ఈ నెల 22 నుంచి బస్సు పునరుద్ధరించారు.

చదవండి: డ్రైవింగ్‌ చేసేందుకు డోర్‌ వద్దకు వెళ్లి నిల్చున్నాడు.. బస్సు తలుపు ఊడి..

మరిన్ని వార్తలు