Sajjanar: ఓ ట్విటర్‌ పోస్టు.. ఆర్టీసీ చార్జీలు తగ్గించింది

11 Nov, 2021 13:54 IST|Sakshi

రౌండ్‌ ఆఫ్‌ పేరుతో అదనపు వసూలుపై ఓ ప్రయాణికుడి ట్వీట్‌

ఇదేమిటని ఆరా తీసిన కొత్త ఎండీ సజ్జనార్‌

అదనపు వసూలు రద్దుకు ఆదేశం

లక్షల్లో ఆదాయం తగ్గినా సంస్థ ప్రతిష్ట కోసం నిర్ణయం! 

సాక్షి, హైదరాబాద్‌: అసలే నష్టాలు.. అప్పులు, కోవిడ్‌ సమస్యతో అతలాకుతలం.. ఇలాంటి పరిస్థితిలో ప్రతి రూపాయి ఆర్టీసీకి కీలకమే. కానీ ఓ ప్రయాణికుడు ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుకు స్పందించిన ఆర్టీసీ.. రోజూ లక్షల్లో ఆదాయాన్ని కోల్పోయేందుకు సిద్ధమైంది. గతంలో రౌండ్‌ ఆఫ్‌ పేరిట పెంచిన అదనపు వసూళ్లను తగ్గించుకుంది. ఇప్పుడు నష్టం ఎదురైనా.. ఆర్టీసీ ప్రతిష్ట మెరుగుపడి భవిష్యత్తులో సంస్థ వైపు ప్రయాణికులు మొగ్గుచూపుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. 

చిల్లర సమస్య పేరిట.. 
ఇటీవల ఓ ప్రయాణికుడు బెంగుళూరు బస్సు ఎక్కాడు. టికెట్‌పై వివరాలు చూసి కంగుతిన్నాడు. టికెట్‌ అసలు ధర రూ.841 అని.. కానీ చెల్లించాల్సిన మొత్తం రూ.850 అని ఉండటంతో కండక్టర్‌ను నిలదీశారు. అసలు ధరను మించి రూ.9 వసూలు చేయడం ఏమిటని, ఆ మొత్తం ఎటు పోతోందని ప్రశ్నిస్తూ.. ట్విటర్‌లో పోస్టు పెట్టారు. ఇది ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వరకు వెళ్లింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆయన దీనిపై స్పష్టత లేక.. అధికారులను వాకబు చేశారు. టికెట్‌ ధరలు సవరించినప్పుడు చిల్లర సమస్య రాకుండా రౌండ్‌ ఆఫ్‌ చేసే విధానం ఉందని, దాని ప్రకారమే ఆ రూ.9 వసూలు చేశామని పేర్కొన్నారు. ఇలా అదనంగా వసూలు చేయటం వల్ల ఆర్టీసీ ప్రతిష్ట తగ్గుతుందని భావించిన ఆయన.. వెంటనే ఈ రేట్లను సవరించాలని అధికారులను ఆదేశించారు. 

ఆ మేరకు అధికారులు.. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో రౌండ్‌ ఆఫ్‌ సొమ్మును సవరించారు. దీని ప్రకారం.. గతంలో రూ.841 నుంచి రూ.850కి పెంచిన బెంగుళూరు టికెట్‌ ధరను.. ఇప్పుడు రూ.840కి మార్చారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కనీస చార్జీ రూ.15, దీనికి సెస్‌ రూపాయి కలిపితే రూ.16 అవుతుంది. దీనిని చిల్లర ఇబ్బందిపేరిట రూ.20గా రౌండ్‌ ఆఫ్‌ చేసి, వసూలు చేస్తూ వచ్చా రు. తాజాగా దీనిని రూ.15కు తగ్గించారు. ఇలా అన్నిస్థాయిల్లో మార్చారు. దీనివల్ల రోజూ సగటున రూ.10 లక్షల వరకు టికెట్‌ ఆదాయం తగ్గిపోవడానికి కారణమైనట్టు అధికారులు చెప్తున్నారు. 

లక్ష్యాన్ని మించి వసూళ్లు: కొద్దిరోజులుగా ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా టికెట్‌ ఆదాయం సమకూరుతోంది. గత సోమవారం ఆర్టీసీ రూ.12.89 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.13.99 కోట్లు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు.  

మరిన్ని వార్తలు