TSRTC: జర్నలిస్టులకు సజ్జనార్‌ గుడ్‌న్యూస్‌

12 Nov, 2021 16:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీసీ సజ్జనార్‌ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పరిగెత్తించేందుకు కృషిచేస్తూనే.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. అంతేగాక ట్విట్టర్‌లోనూ యాక్టివ్‌గా ఉంటూ ప్రయాణికులు, నెటిజన్ల నుంచి వస్తున్న అభ్యర్థనలపై స్పందిస్తూ.. పరిష్కార మార్గాలను చూపుతున్నారు.
చదవండి: నూతన వధూవరులకు టీఎస్ఆ‌ర్టీసీ ఎండీ సజ్జనార్‌ సర్‌ప్రైజ్‌..

ఈ క్రమంలో తాజాగా జర్నలిస్టులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ శుభవార్త అందించారు. జర్నలిస్ట్‌ బస్‌ పాస్‌ కలిగి ఉన్న జర్నలిస్టులు తెలంగాణ టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకుంటే తమకు లభించాల్సిన తగ్గింపు (కన్సెషన్‌) పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో గుడ్‌న్యూస్‌ ఫర్‌ న్యూస్‌ ఫ్రెండ్స్‌ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సూచనలు చేసిన ఇద్దరు నెటిజన్లకు ఆయన కృతజ్జతలు తెలియజేశారు. కాగా సజ్జనార్‌ నిర్ణయంపై జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది సజ్జనార్‌కు థాంక్స్ చెబుతూ ట్వీట్లు చేశారు. 
చదవండి: ‘ఎమ్మెల్యే కారుకే సైడ్‌ ఇవ్వవా’.. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్‌  

అయితే మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్ కార్డుతో ఆర్టీసీ నుంచి బస్‌ పాస్‌ తీసుకుంటారు. ఈ పాస్‌ ఉన్నవారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే కన్సెషన్‌ పొందుతుంటారు. ఇప్పటి వరకు నేరుగా బ‌స్ కండక్ట‌ర్ నుంచి మాత్ర‌మే రాయితీ టికెట్ తీసుకునే అవ‌కాశం ఉండేది. అయితే ఆన్‌లైన్‌లో ముందుగా టికెట్ బుక్‌ చేసుకుంటే మాత్రం ఈ మినహాయింపులు వర్తించేవి కావు. ఈ క్రమంలో తాజాగా టీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ముందస్తుగా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు జర్నలిస్టులు తమ కన్సెషన్ పొందవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

మరిన్ని వార్తలు