ఒకే సాఫ్ట్‌వేర్‌లో ఆర్టీసీ సమస్త సమాచారం

31 Jan, 2023 02:46 IST|Sakshi
ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఆర్టీసీ  ఎండీ సజ్జనార్, నల్సాఫ్ట్‌ సీఈఓ వెంకట నల్లూరి  

నల్సాఫ్ట్‌ సంస్థతో టీఎస్‌ఆర్టీసీ అవగాహన ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో ఓ బోల్టు కొనాలన్నా, దానికి బిల్లు చెల్లించాలన్నా.. బస్సుల నిర్వహణ, రూట్‌ మ్యాప్, తిరిగిన కి.మీ.లు, వచ్చిన ఆదాయం, బ్యాంకులో జమ, సిబ్బంది హాజరు, పనితీరుపై జాబితా తయారీ, కొత్త బస్సుల కొనుగోలు, సొంత వర్క్‌షాప్‌లో బస్‌ బాడీల తయారీ.. ఇలా ఆర్టీసీకి సంబంధించిన సమస్త సమాచారం ఓ మీట నొక్కగానే ప్రత్యక్షమయ్యేలా యాజమాన్యం ఓ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకోనుంది.

ఒరాకిల్‌ ఆధారిత ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాంతో ఇది సాధ్యం కానుంది. ఈ తరహా ప్రోగ్రామ్స్‌ తయారీ, సేవలు అందించడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నల్‌సాఫ్ట్‌ అనే సంస్థతో ఆర్టీసీ సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బస్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, నల్సాఫ్ట్‌ సీఈఓ వెంకట నల్లూరిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వినోద్, చీఫ్‌ మేనేజర్‌ (ఎఫ్‌ అండ్‌ ఏ)విజయ పుష్ప, ఐటీ సీఓ రాజశేఖర్, నల్‌సాఫ్ట్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. తొమ్మిది నెలల్లో ప్రోగ్రాంను సిద్ధం చేసి ఆ సంస్థ ఆర్టీసీకి అందించనుంది. 

మరిన్ని వార్తలు