తెలంగాణ: నష్టాల ఆర్టీసీలో దుబారా..!

25 Sep, 2021 02:39 IST|Sakshi

అవసరం లేని డిపోలు.. జనం లేని ట్రిప్పులు

కరెంటు బిల్లులు, ఇతర అవసరాల పేర రూ.లక్షల్లో వ్యయం

వందల మంది పనిలేని సిబ్బంది.. వేరే చోట కొరత

చిన్న డిపోల నుంచి ప్రధాన బస్టాండ్ల వరకు బస్సులు రావాల్సి ఉండటంతో డీజిల్‌ దుబారా

సాక్షి, హైదరాబాద్‌: దుబారాను నియంత్రించటంలో ఆర్టీసీ బరాబర్‌ అశ్రద్ధ వహిస్తోంది. ఫలితంగా అప్పులకుప్పగా మారిన రుణాలపై ఏడాదికి రూ.250 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. మూడు నాలుగు నెలల్లో ఆర్టీసీ లాభాల్లోకి రాని పక్షంలో ప్రైవేటీకరించటానికి వెనకాడనని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారంటూ రెండు రోజుల కింద ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ దుబారా అంశం చర్చకు వచ్చింది. డీజిల్‌ ఖర్చు, జీతాలు, విడిభాగాల వ్యయం తప్పనిసరిగా భరించాల్సినవే. కానీ, దుబారాను అరికట్టడం అధికారుల చేతుల్లో పని.

దుబారా ఇలా..
హైదరాబాద్‌–3 డిపోలో 27 గరుడ బస్సులున్నాయి. వీటి కోసం డ్రైవర్లు, కండక్టర్లు పోను 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. డిపో కరెంటు బిల్లు నెలకు రూ.70 వేల వరకు వస్తోంది. ఈ డిపోలో ఉన్నవన్నీ దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులే. ఇవి డిపోల వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవు. 15 కి.మీ. నుంచి 30 కి.మీ.మేర ఖాళీగా ప్రయాణించి బీహెచ్‌ఈఎల్, మియాపూర్, ఇమ్లీబన్‌ బస్‌స్టేషన్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. నిత్యం బస్‌స్టేషన్ల వరకు ఖాళీగా వెళ్లటం, అక్కడి నుంచి ఖాళీగా తిరిగి రావటంతో ఒక్కో బస్సు అనవసరంగా రూ.2 వేలకుపైచిలుకు డీజిల్‌ను కాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బస్సులను మియాపూర్, బీహెచ్‌ఈఎల్‌ లాంటి డిపోలకే కేటాయిస్తే  వృథా వ్యయాన్ని అరికట్టవచ్చు.

సికింద్రాబాద్‌ జూబ్లీబస్టాండ్‌ పక్కనే పికెట్‌ డిపో ఉంటుంది. ఈ డిపోలో ఆర్టీసీ సొంత బస్సులు 30, అద్దె బస్సులు 40 ఉన్నాయి. అద్దె బస్సుల నిర్వహణ వాటి యజమానులదే అయినందున డిపోలోకి అవి రావు. సొంతంగా ఉన్న 30 బస్సుల కోసం ఓ పెద్ద భవనం, డిపో మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్, ఇలా డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా 50 మంది సిబ్బంది పని చేస్తున్నారు. భవనానికి కరెంటు బిల్లు నెలకు రూ.80 వేల వరకు వస్తోంది.

హైదరాబాద్‌–2 డిపోలో సొంత బస్సులు 39 ఉంటే 42 అద్దె బస్సులు న్నాయి. ఈ బస్సులకు డ్రైవర్లు, కండ క్టర్లు పోను 50 మంది సిబ్బంది ఉన్నారు. కరెంటు బిల్లు రూ.80 వేలు వస్తోంది. ఇలాంటి చిన్న డిపోలను ఎత్తేసి ఆ బస్సులను వేరే డిపో ల్లో కలిపేస్తే ఈ వృథా వ్యయం ఉండదు. ఈ డిపోలు లేకపోతే వాటిల్లోని పెద్ద పోస్టులు రద్దవుతాయి. జీతాలు, కరెంటు బిల్లు వంటి భారాలు ఉండవు. డిపో భవనాలను ప్రైవేటు సంస్థలకు అద్దెకిస్తే ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరుతుంది.

అనవసరపు ట్రిప్పులతో..
రాష్ట్రంలోని కొన్ని చిన్న పట్టణాల నుంచి హైదరా బాద్‌కు 45 నిమిషాలకో బస్సు తిప్పు తున్నారు. కానీ, ఆయా బస్సులు సిటీ చేరేటప్పటికీ 90% మేర ఖాళీగా ఉంటున్నాయి. అలాంటప్పుడు సిటీ ట్రిప్పులను గంటన్నరకు ఒకటి చొప్పున పెడితే ఈ ఖాళీ ట్రిప్పుల దుబారా ఉండదు. కరీం నగర్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, కొత్త గూడెం, నిజామాబాద్, మెదక్, మహ బూబ్‌నగర్, కల్వకుర్తి, నల్లగొండ, సూర్యాపేట లాంటి పట్టణాల్లో ఈ సమస్య ఉంది.

హైదరాబాద్‌కు వెళ్లేందుకు కరీంనగర్, వరంగల్‌ లాంటి బస్టాండ్లలో ఒకేసారి పలు డిపోల బస్సులు వచ్చి ప్లాట్‌ఫారమ్‌లలో నిలబడుతున్నాయి. ఇవన్నీ 70 శాతం లోపు ఆక్యుపెన్సీ రేషియోతోనే నడుస్తున్నాయి. నాన్‌స్టాప్‌ బస్సుల్లో అయితే ఇక సిటీకి వచ్చే వరకు మధ్యలో ఎక్కడా ప్రయాణికులు ఎక్కే వీలు ఉండటం లేదు. ఇది ప్రస్తుతం ఆర్టీసీలో పెద్ద దుబారాగా మారింది. పండగలు లాంటి ప్రత్యేక సందర్భాలు, వారాంతాల్లో తప్ప మిగతారోజుల్లో ఈ ట్రిప్పులకు డిమాండ్‌ ఉండటం లేదు. అయినా అనవసరంగా తిప్పుతున్నారు.

మరిన్ని వార్తలు