TSRTC: ఆర్టీసీకి కొత్త బస్సులు

18 Sep, 2021 00:59 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

రూ.100 కోట్లతో 280 బస్సులు కొనాలని అధికారుల నిర్ణయం

దూర ప్రాంతాలకు నడిచే సూపర్‌లగ్జరీ, డీలక్స్‌లకు ప్రాధాన్యం

ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్నింటి కొనుగోలుకే పరిమితం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీకి త్వరలో కొత్త బస్సులు రాబోతున్నాయి. ఇప్పటికే చాలా బస్సులు పాతబడి ప్రయాణాలకు ఇబ్బందిగా మారడంతో.. వెంటనే కొన్ని కొత్త బస్సులు కొనాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధులతో సుమారు 280 బస్సులు వస్తాయని అంచనా. ఆర్టీసీ ఆదాయం పెరగాలంటే.. దూరప్రాంత బస్సుల సంఖ్య పెంచాలని ఇటీవల ఆర్టీసీ సమీక్షలో సీఎం కేసీఆర్‌ సూచించారని అధికారవర్గాలు తెలిపాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసులతో భారీగా నష్టాలు వస్తున్న నేపథ్యంలో.. దూరప్రాంతాలకు నడిచే బస్సులపై దృష్టి సారించాలని ఆదేశించారని పేర్కొన్నాయి.

ఈ మేరకు కొత్త బస్సులు కొనాలని నిర్ణయించినట్టు వెల్లడించాయి. బ్యాంకుల నుంచి ఆర్టీసీ రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పూచీకత్తు ఇచ్చింది. అందులో ఇప్పటికే రూ.500 కోట్లు ఆర్టీసీకి అందాయి. వాటిని వివిధ అవసరాలకు కేటాయించారు. మరో రూ.500 కోట్లు రానున్నాయి. అందులో రూ.400 కోట్లను ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి బకాయిల కింద చెల్లించాలని.. మిగతా రూ.100 కోట్లతో కొత్త బస్సులు కొనాలని నిర్ణయించారు.
(చదవండి: లొంగుబాటలో అన్నలు)

సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ బస్సులే..
ఆర్టీసీలో దూర ప్రాంతాల మధ్య నడిచే సూపర్‌ లగ్జరీ బస్సులకు డిమాండ్‌ ఎక్కువ. గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర వంటి ఏసీ కేటగిరీ బస్సుల్లో చార్జీలు ఎక్కువ. నాన్‌ ఏసీ కేటగిరీలో సౌకర్యవంతంగా ఉండే సూపర్‌ లగ్జరీ బస్సు చార్జీలు వాటితో పోలిస్తే బాగా తక్కువ. దీనితో వాటికి ప్రయాణికుల తాకిడి ఎక్కువ. కొత్తగా కొననున్న బస్సుల్లో ఈ కేటగిరీవే వందకుపైగా తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

మరో 80 వరకు డీలక్స్‌ బస్సులు కొననున్నారు. ప్రస్తుతమున్న డీలక్స్‌ బస్సుల్లో 80 బస్సులను సూపర్‌ లగ్జరీ సర్వీసులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని భావిస్తున్నారు. దీనితో సూపర్‌ లగ్జరీ బస్సులు మరిన్ని పెరుగుతాయి. ఒక్కో కొత్త బస్సు ధర సగటున రూ.35 లక్షల వరకు ఉంటుందని.. రూ.100 కోట్లతో 280 నుంచి 285 వరకు కొత్త బస్సులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

అవసరం భారీగా.. కొనేవి తక్కువ..
ప్రస్తుతం ఆర్టీసీ 9 వేల బస్సులను తిప్పుతుండగా.. అందులో ఆర్టీసీ సొంత బస్సులు ఆరు వేలే. మిగతావి అద్దె బస్సులు. ఆర్టీసీలో అవసరానికి, డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త బస్సులు కొనడం లేదు. ఏటా 250 వరకు బస్సుల కాలపరిమితి తీరిపోతుంది. వాటి స్థానంలో కొత్తవి తేవడంతోపాటు పెరిగే డిమాండ్‌కు తగినట్టుగా సర్వీసులు పెంచాల్సి ఉంటుంది. అంటే.. కాలం తీరే బస్సుల కంటే ఎక్కువగా అవసరం అవుతాయి.

కానీ గత మూడేళ్లలో ఆర్టీసీలో కొత్తగా వచ్చిన బస్సులు కేవలం 270 మాత్రమే. ఇదే సమయంలో వెయ్యికిపైగా బస్సులు తుక్కు కిందికి వెళ్లిపోయాయి. ఇప్పుడు కేవలం 280 బస్సులు కొననున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆర్టీసీ ఆదాయం పెరుగుతోందని, టికెట్‌ ధరలను కూడా సవరించే యోచనలో ఉన్నందున.. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో కొత్త బస్సులు కొనే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.  

మరిన్ని వార్తలు