‘సామాజిక బాధ్యత’తో కార్పొరేట్‌ లుక్‌

5 Sep, 2021 04:44 IST|Sakshi
శనివారం తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడుతున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

ఆర్టీసీ ఆసుపత్రికి తక్షణ చికిత్స.. కొత్త ఎండీ సజ్జనార్‌ నిర్ణయం

బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే ఆకస్మిక తనిఖీ

అసంపూర్తి పనులు పూర్తి చేయాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి సూచన

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎంత సేపు ప్రభుత్వంపై ఆధారపడటమేనా.. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలేవీ చేయరా’పలు సందర్బాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ అధికారులను ఉద్దేశించి అన్న మాటలివి. ప్రతినెలా జీతాలు మొదలు ఇతర అవసరాలకు ఆర్టీసీ కొంతకాలంగా ప్రభుత్వంపైనే ఆధారపడుతుండటమే దీనికి కారణం. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని ఆర్టీసీ కొత్త ఎండీ నిర్ణయించారు. తాను బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ మేరకు ప్రకటన చేసిన ఆయన రెండో రోజు దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం ప్రారంభిం చారు.

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఆర్టీసీ దివాలా దశకు చేరడంతో.. దాని అనుబంధ విభాగాలు కూడా అదే బాట పట్టాయి. ఇందులో ఆర్టీసీ ఆసుపత్రి కూడా ఉండటం విశేషం. 49 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్యానికి పెద్దదిక్కయిన ఈ ఆసుపత్రి కొన్ని రోజులుగా కునారిల్లుతూ వస్తోంది. కరోనా రెండు దశలో ఈ ఆసుపత్రిని కోవిడ్‌ సెంటర్‌గా మార్చాలన్న డిమాం డ్‌ వచ్చింది. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించినా.. ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ వరకు నిర్మించి గాలికొదిలేశారు. ఇప్పుడు దీన్ని అభివృద్ధి చేయాలని ఎండీ సజ్జనార్‌ నిర్ణయించారు.  

సామాజిక బాధ్యతతో.. 
తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని శనివారం ఉదయం సజ్జనార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు గంటలపాటు ఆసుపత్రి అంతా కలియదిరిగి అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిని కార్పొరేట్‌ తరహాలో అభివృద్ధి చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తొలుత తమ స్థాయిలో ఎంత అభివృద్ధి చేయగలమో చూసి.. తర్వాతే అవసరమైతే ప్రభుత్వ సాయం తీసుకోవాలని నిర్ణయించారు.

దీనికోసం ఆయన కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్‌)æని అనుసరించాలని భావిస్తున్నారు. త్వరలో ఈ పద్ధతిలో రెండు అంబులెన్సులు సమకూర్చేందుకు ఆయన ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులతో మాట్లాడి, కోవిడ్‌ సెంటర్‌ పనులు పూర్తి చేయాలని కోరారు. వెంటనే పనులు పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో అత్యాధునిక వసతులతో కూడిన ఇన్సెంటివ్‌ కేర్‌ యూనిట్‌ ఏర్పాటుకు నిర్ణయించారు.

దీనికి కావాల్సిన పరికరాల జాబితా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మందుల విభాగాన్ని పరిశీలించి, కొరత లేకుండా ప్రత్యేక ఏర్పాటు అవసరమని తేల్చారు. దీన్ని కూడా కార్పొరేట్‌ సామాజిక బాధ్యతతో అనుసంధానించాలని ఆయన నిర్ణయించారు. అలాగే ల్యాబ్‌ ఖాళీగా ఉండే సమయంలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో బయటి వ్యక్తుల నమూనాల పరీక్షలు చేయించి ఆదాయ సేకరణకు అనువుగా మార్చే అంశాన్ని తెరపైకి తెచ్చారు.

ఇలా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ద్వారా వీలైనంత తొందరలో ఆసుపత్రి ముఖచిత్రం మార్చి రోగులను రిఫరల్‌ ఆసుపత్రులకు పంపాల్సిన అవసరం లేకుండా చూడాలని ఆయన నిర్ణయించారు. సిబ్బంది అందరికి కోవిడ్‌ టీకాలు ఇప్పించాలని పేర్కొన్న ఆయన, రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. కావాల్సినంత మంది వైద్యుల నియామకం వెంటనే చేపట్టనున్నట్లు వెల్లడించారు.అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట ఈడీలు పురుషోత్తం, వినోద్, వెంకటేశ్వర్లు, మునిశేఖర్, యా దగిరి, సూపరింటెండెంట్‌ వెంకటరమణ ఉన్నారు. 

మరిన్ని వార్తలు