TSRTC New Buses: ప్యానిక్‌ బటన్‌.. సీసీ కెమెరాలు.. అందుబాటులోకి ఆధునిక బస్సులు!

24 Dec, 2022 16:06 IST|Sakshi
రివర్స్‌ కెమెరా.. డ్రైవర్‌ కేబిన్‌లో సీసీ కెమెరా, ప్యానిక్‌ బటన్‌

రివర్స్‌ కెమెరా, ట్రాకింగ్‌ వ్యవస్థ కూడా...

ఆర్టీసీకి అందుబాటులోకి ఆధునిక బస్సులు

రోడ్డెక్కనున్న 50 కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు

రోజుకు కొన్ని చొప్పున అందుబాటులోకి రానున్న వెయ్యి బస్సులు

సాక్షి, హైదరాబాద్‌: ప్యానిక్‌ బటన్‌.. ప్రయాణ సమయాల్లో మహిళలు తాము ప్రమాదంలో ఉన్నామని.. తమను కాపాడాలని పోలీసులకు తెలిపేందుకు వినియోగించే సాంకేతిక సాధనం. అలాగే రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వర­దల వంటి ప్రకృతి విపత్తుల్లో వాహనాలు చిక్కు­కు­న్నప్పుడు సహాయం కోరేందుకు దోహదపడే పరికరం. కేవలం ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా వాహన లైవ్‌ లొకేషన్‌ను నేరుగా పోలీసులు లేదా సహాయ బృందాలకు తెలియజేయగలగడం దీని ప్రత్యేకత. ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన ఈ సాధనం ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో కూడా అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్భయ పథకంలో భాగంగా మహిళా భద్రత కోసం అన్ని ప్రజారవాణా వాహనాల్లో ప్యానిక్‌ బటన్‌లు, వాహన లొకేషన్‌ ట్రాకింగ్‌ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇప్పుడు కొత్తగా కొంటున్న బస్సుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

తాజాగా ఆర్టీసీకి చేరిన 50 కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను సంస్థ శనివారం వినియోగంలోకి తెస్తోంది. ఈ బస్సులను అశోక్‌ లేలాండ్‌ కంపెనీ రూపొందించింది. మొత్తం 630 సూపర్‌ లగ్జరీ బస్సుల ఆర్డర్‌ పొందిన ఆ కంపెనీ తాజాగా 50 బస్సులను అందించింది. మిగతావి రోజుకు కొన్ని చొప్పున జనవరి నాటికి పూర్తిగా సరఫరా చేయనుంది. ఈ బటన్‌ నొక్కడం ద్వారా సమాచారాన్ని పొందే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ బస్‌భవన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే అది ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటు­లోకి రాగానే బస్సుల్లోని ప్యానిక్‌ బటన్‌తో ఆ వ్యవ­స్థ అనుసంధానమై పనిచేయడం ప్రారంభిస్తుంది.

ప్రతి బస్సులో రెండు వీడియో కెమెరాలు..
బస్సుల్లో అవాంఛిత ఘటనలు చోటుచేసు­కున్నప్పుడు కారణాలను గుర్తించే వీలు ప్రస్తుతం లేదు. కొత్తగా వచ్చే బస్సుల్లో సెక్యూరిటీ కెమెరా­లు ఏర్పాటు చేస్తున్నారు. డ్రైవర్‌ కేబిన్‌ వద్ద ఉండే ఓ సీసీ కెమెరా.. బస్సులోకి ఎక్కే ప్రయాణికులను గుర్తిస్తుంది. డ్రైవర్‌ వెనుక భాగంలో ఉండే మరో కెమెరా బస్సు చివరి వరకు లోపలి భాగాన్ని చిత్రిస్తుంది. ఈ రెండు కెమెరాలు చిత్రించిన వీడియో ఫీడ్‌ 15 రోజుల వరకు నిక్షిప్తమవుతుంది. ఇక బస్సును రివర్స్‌ చేసేటప్పుడు డ్రైవర్‌కు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతుంటాయి.

కొత్త బస్సుల్లో రివర్స్‌ కెమెరాలను బిగించారు. బస్సు వెనుకవైపు ఉండే కెమెరా రివర్స్‌ చేసేటప్పుడు డ్రైవర్‌కు వెనుక ప్రాంతాన్ని చూపుతుంది. త్వరలో బస్సు ట్రాకింగ్‌ వ్యవస్థ కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బస్సులో ఉండనున్నాయి. ఫైర్‌ డిటెక్షన్‌ అండ్‌ అలారం సిస్టం కూడా ఏర్పాటు చేశారు. మోతాదుకు మించి వేడి ఉత్పన్నమైనా లేక పొగ వచ్చినా ఈ వ్యవస్థ గుర్తించి అలారం మోగిస్తుంది. దీంతో డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును ఆపేసి ప్రయాణికులను కిందకు దించేందుకు వీలవుతుంది. షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల తరచూ బస్సుల్లో చోటు చేసుకొనే అగ్రిప్రమాదాలను ముందే గుర్తించి ప్రయాణికులకు ప్రాణాపాయాన్ని తప్పించేందుకు ఈ అలారంతో అవకాశం కలుగుతుంది. అలాగే ఈ బస్సుల్లో సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ కోసం ఏర్పాట్లు చేయడంతోపాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు.

50 కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శనివారం ట్యాంక్‌బండ్‌పై ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని రెండ్రోజుల క్రితం ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి ప్రకటించినప్పటికీ సీఎం ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో రవాణాశాఖ మంత్రి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మొత్తం 1,016 కొత్త బస్సులకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో 630 సూపర్‌ లగ్జరీ బస్సులు, 370 డీలక్స్‌/ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, 16 ఏసీ స్లీపర్‌ బస్సులున్నాయి. త్వరలో 130 డీలక్స్‌ బస్సులు కూడా అందనున్నాయి.

శబరిమల.. సంక్రాంతి స్పెషల్‌గా సేవలు..
ప్రస్తుతం శబరిమల అయ్యప్ప భక్తుల కోసం దాదాపు 200 బస్సులు బుక్‌ అయ్యాయి. మరిన్ని బుక్‌ కానున్నాయి. శబరిమల దూర ప్రాంతమైనందున వీలైనంత వరకు కొత్త బస్సులు కేటాయించనున్నారు. ఇప్పుడు అందుతున్న సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని అందుకు వినియోగించనున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా దూర ప్రాంతాలకు స్పెషల్‌ బస్సులు నడుపుతున్నారు. కొత్త బస్సుల్లో కొన్నింటిని అందుకు కేటాయించనున్నారు. (క్లిక్ చేయండి: తెలంగాణ భవన్‌ ముందు ట్రాఫిక్‌ నరకం)

మరిన్ని వార్తలు