మేం మారం.. మార్చం!

18 Dec, 2020 08:55 IST|Sakshi

పాత బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మారుస్తామన్న ఢిల్లీ సంస్థ 

హైబ్రిడ్‌ పరిజ్ఞానంతో మార్పు చేసే వీలు

కార్బన్‌ ఉద్గారాలకు కళ్లెం.. వందల కోట్ల రూపాయలు ఆదా 

తక్కువ వ్యయంతోనే పాత బస్సుల మార్పు  

అయినా పట్టించుకోని అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచమంతా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు చూస్తోంది. దీంతో రాష్ట్రాల్లోని ఆర్టీసీల్లో ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగం పెంచేందుకు ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చర్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఫేమ్‌)’పథకం కింద బ్యాటరీ బస్సులను కేంద్రం రాయితీకి అందిస్తోంది. రాష్ట్రంలో కూడా ఇటీవల ప్రభుత్వం కొత్తగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే రాష్ట్రంలో ఆరీ్టసీలో సాధారణ ప్రయాణికుల కోసం ఇప్పటివరకు ఒక్క బ్యాటరీ బస్సు కూడా వినియోగంలో లేదు. విమానాశ్రయానికి వినియోగిస్తున్న 40 బస్సులు మినహా ఆరీ్టసీలో ఒక్క ఎలక్ట్రిక్‌ బస్సు కూడా లేదు. దీంతో సాధారణ బస్సుల నుంచి విపరీతమైన కాలుష్యం వెలువడుతుండటమే కాకుండా, ఇంధన రూపంలో భారీగా ఖర్చు అవుతోంది. జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న ఆరీ్టసీకి.. ఇంధన ఖర్చు చాలా భారంగా మారింది. ఆర్టీసీ చేస్తున్న మొత్తం వ్యయంలో దాదాపు 30 శాతం ఇంధనానికే ఖర్చవుతోందంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థమవుతోంది. ఇలాంటి తరుణంలో కూడా ఎలక్ట్రిక్‌ బస్సుల వాడకంవైపు ఆర్టీసీ దృష్టి సారించట్లేదు. 

మారుస్తామని ముందుకొచ్చినా.. 
కొత్తగా ఓ బ్యాటరీ బస్సు కొనాలంటే రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్లు అవుతుంది. అంత ఖర్చు భరించే స్థాయిలో ఆర్టీసీ లేదు. కానీ ఇప్పటికే ఉన్న డీజిల్‌ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చే పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశముంది. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ ఇటీవల బస్సులను మారుస్తామని ముందుకొచి్చనా ఆర్టీసీ దాన్ని పట్టించుకోలేదు. కాగా, ఆరీ్టసీలో ప్రస్తుతం దాదాపు 7 వేల బస్సులున్నాయి. అన్నింటినీ కాకున్నా.. హైదరాబాద్‌ సిటీలో తిరిగే బస్సులనే కన్వర్ట్‌ చేస్తే ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.. 

ఇంధన పొదుపుతో భారీ లాభం..
డీజిల్‌ వినియోగం ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతోంది. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో పర్యావరణం కూడా దెబ్బతింటోంది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం బాగా పెరిగింది. మన దేశంలో సమీప భవిష్యత్తులో ఇవి పెద్ద సమస్యలు కానున్నాయి. వాటికి ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని పెంచటమే విరుగుడు. దేశంలో హైబ్రిడ్‌ నమూనా పక్కాగా జరుగుతోంది. కొత్తగా ఎలక్ట్రిక్‌ బస్సు కొనటం భారీ వ్యయంతో కూడుకున్న పని. అందులో 10 శాతంలోపు ఖర్చుతో సాధారణ బస్సును ఎలక్ట్రిక్‌ వాహనంగా మార్చేయవచ్చు. ఇది విజయవంతంగా అమలవుతున్న కొత్త పరిజ్ఞానం. ఎక్కువ బస్సులు వినియోగించే ఆర్టీసీ దీనిపై దృష్టి సారిస్తే సంస్థకు, ప్రజలకు ఎంతో ఉపయోగం. బస్సును పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనంగా మారిస్తే అయ్యే ఖర్చు కంటే హైబ్రిడ్‌ నమూనాలోకి మార్చటం చాలా తక్కువ.’ – శుభం గుప్తా, ఎలక్ట్రిక్‌ వాహనరంగ నిపుణులు  

ఏడాది పొదుపుతో కన్వర్షన్‌.. 
ప్రస్తుతం మన దేశంలో సాధారణ బస్సులను ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లోకి కన్వర్ట్‌ చేసే పరిజ్ఞానం ఉంది. ఒక బస్సును కన్వర్ట్‌ చేయటానికి అయ్యే వ్యయం రూ.8 లక్షలు. సిటీలో 3 వేల బస్సులుంటే.. అన్నింటిని మారిస్తే అయ్యే వ్యయం రూ.240 కోట్లు. కన్వర్షన్‌ వల్ల సాలీనా పోగయ్యే ఇంధన పొదుపు (రూ.300 కోట్లు) కంటే ఇది తక్కువ. ఒకసారి పెట్టుబడి పెడితే ఏడాదిలోనే అంతకుమించి తిరిగి వస్తుందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్‌ మోడల్‌లోకి కాకుండా హైబ్రిడ్‌ పద్ధతిలో కన్వర్ట్‌ చేసే పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అంటే.. ఇటు డీజిల్, అటు కరెంటుతో నడిపే వెసులుబాటన్నమాట. ఎలక్ట్రిక్‌ నమూనాలోకి కన్వర్ట్‌ అయ్యాక ఏదైనా సమస్య ఉత్పన్నమైతే, దాన్ని పరిష్కరించేవరకు డీజిల్‌తో నడుపుకోవచ్చు. 

పర్యావరణానికి ఎంత మేలో.. 
ఒక సిటీ బస్సు సంవత్సరానికి దాదాపు 200 కిలోల కార్బన్‌ను విడుదల చేస్తోంది. ప్రస్తుతం నగరంలో 3 వేల వరకు సిటీ బస్సులున్నాయి. అటూఇటుగా చూస్తే దాదాపు 6 లక్షల కిలోల కార్బన్‌ను విడుదల చేస్తున్నాయి. అంటే నగర జనం ఆరోగ్యం అంతగా పదిలం కాదని ఇట్టే అర్థమవుతోంది. ఈ బస్సులన్నింటినీ ఎలక్ట్రిక్‌ బస్సులుగా మారిస్తే.. జీరో పొల్యూషన్‌. వాతావరణంలో కలిసే వాహన కాలుష్యాన్ని తగ్గించినట్లూ అవుతుంది. 

వార్షిక ఇంధన ఆదా.. రూ.300 కోట్లు.. 
ప్రస్తుతం నగరంలో ఉన్న సిటీ బస్సులు కాల్చే ఇంధన వ్యయం వార్షికంగా రూ.494 కోట్లు. ఇది ప్రస్తుతం ఉన్న డీజిల్‌ ధరల ప్రకారం. కొంతకాలంగా డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్‌ ధర పెరిగే కొద్దీ ఆర్టీసీ వార్షిక డీజిల్‌ భారం అంతగా పెరుగుతుంది. అదే సిటీ బస్సులన్నింటిని ఎలక్ట్రిక్‌లోకి కన్వర్ట్‌ చేస్తే.. వాటి వార్షిక ఇంధన వ్యయం రూ.200 కోట్లు. అంటే దాదాపు రూ.300 కోట్లు వార్షిక  ఇంధన పొదుపన్నమాట.   

మరిన్ని వార్తలు