TSRTC: ముహూర్తం ఖరారు.. కి.మీ.కు 15 నుంచి 30 పైసలు పెంపు!

6 Nov, 2021 13:47 IST|Sakshi

చార్జీల పెంపుపై ఆర్టీసీ కసరత్తు 

ప్రభుత్వానికి నాలుగు ప్రతిపాదనలు  

25 పైసలు పెంచేందుకు ఆర్టీసీ మొగ్గు 

దీంతో సాలీనా ప్రయాణికులపై పడే భారం రూ.750 కోట్లు

వారం పది రోజుల్లో ఖరారు భేటీకి అవకాశం 

డీజిల్‌ భారం నుంచి బయటపడాలంటే పెంపు అనివార్యమంటున్న అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. వారం పదిరోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెల రోజుల క్రితం ఆర్టీసీ అధికారుల తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలో బస్సు చార్జీల అంశం ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. డీజిల్‌ భారం తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో చార్జీలను పెంచాలని అధికారులు సీఎంను కోరారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో దీనిపై ని ర్ణయం తీసుకుంటామని, ఈలోపు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. దీం తో నాలుగు ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించారు.

పెంపునకు ప్రభుత్వం కూడా సాను కూలంగానే ఉందన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. కొన్ని రాజకీయ కారణాలతో నెల రోజులుగా ఈ కసరత్తు పెండింగులో పడింది. తాజాగా మరో సారి ఈ అంశంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి భేటీ పిలుపు కో సం ఎదురుచూస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. ఉన్నతాధికారులతో మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. వా రం పది రోజుల్లో సమావేశం నిర్వహించి, ఓ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
(చదవండి: హైదరాబాద్‌: సదర్‌ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు)

కి.మీ.కు 25 పైసల ప్రతిపాదనకు మొగ్గు 
రెండేళ్ల క్రితం ఆర్టీసీలో సమ్మె తర్వాత 2019 డిసెంబరులో ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను సవరించింది. అప్పట్లో కిలోమీటరుకు 20 పైసల మేర పెంచింది. దీనివల్ల ప్రజలపై ఏటా రూ.550 కోట్ల భారం పడుతోంది. చార్జీలు పెంచిన సమయంలో డీజిల్‌ ధర లీటరుకు రూ.68గా ఉంది. ఇప్పుడది రూ.105కు చేరుకుంది. తాజాగా కేంద్రం సుంకం తగ్గించటంతో రూ.90 దిగువకు (ఆర్టీసీకి రాయితీ ధర మేరకు) చేరింది. అయినా... గతంలో చార్జీలు పెంచినప్పటి నుంచి ప్రస్తుత ధరతో బేరీజు వేసుకుంటే లీటరుపై రూ.20కి పైనే ఎక్కువగా ఉంది. అప్పటితో పోలిస్తే నిత్యం అదనంగా రూ.1.22 కోట్ల కంటే ఎక్కువ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో చార్జీల పెంపు అనివార్యమేనన్నది ఆర్టీసీ అభిప్రాయం. 

ఇవీ ప్రతిపాదనలు 
ప్రభుత్వానికి ఆర్టీసీ ఇటీవల నాలుగు రకాల ప్రతిపాదనలు పంపింది. కి.మీ.కు 15 పైస లు, 20 పైసలు, 25 పైసలు, 30 పైసలు.. ఇలా దేని ప్రకారం ఎంత ఆదాయం పెరుగుతుందనే లెక్కలు అందించారు. 20 పైసలు పెంచితే రూ.625 కోట్ల ఆదాయం పెరుగుతుందని, 25 పైసలు పెంచితే దాదాపు రూ.750 కోట్లు పెరుగుతుందని, 30 పైసలైతే రూ.900 కోట్లకు పైగా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో కి.మీ.కు 25 పైసలు పెంచే ప్రతిపాదన అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. 30 పైసలైతే ఆర్టీసీకి మ రింత మెరుగ్గా ఉండనున్నా.. ప్రజలు భారం గా భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మధ్యేమార్గంగా 25 పైసల పెంపుపై సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.

తాజా తగ్గింపుతో రోజుకు రూ.90 లక్షలు ఆదా 
కేంద్రం తాజాగా ఎక్సైజ్‌ సుంకంపై తీసుకున్న నిర్ణయంతో చమురు ధరలు కొంతమేర తగ్గాయి. లీటరు డీజిల్‌పై రూ.10 తగ్గడంతో ఆర్టీసీకి పెద్ద ఊరటగానే మారింది. దీంతో రోజువారీ వినియోగిస్తున్న 6.50 లక్షల లీటర్ల డీజిల్‌పై లెక్కగడితే రూ.65 లక్షలు నేరుగా ఆదా అవుతుంది. ఆర్టీసీ వినియోగిస్తున్న అద్దె బస్సులపై వచ్చే ఆదాను కూడా జోడిస్తే అది రూ.90 లక్షల వరకు చేరుకుంటుంది. 
(చదవండి: TRS MPTC: గొర్రెల కాపరిగా టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ.. రోజూ కూలీ రూ.500)

మరిన్ని వార్తలు