రద్దీనిబట్టి చార్జీలు! 

25 Sep, 2020 03:29 IST|Sakshi

ఆర్టీసీలో ఫ్లెక్సీ ఫేర్‌ విధానం

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు మొదలవగానే అమలు!

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లకు మాత్రం మినహాయింపు

సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసుకున్న టీఎస్‌ఆర్టీసీ

సీఎం దృష్టికి తీసుకెళ్లి అమలు చేయాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: డిమాండ్‌ ఎక్కువగా ఉంటే ఎక్కువ చార్జీలు, రద్దీ లేకుంటే తక్కువ చార్జీలు.. ఇదీ ఫ్లెక్సీ ఫేర్‌ విధానం. విమాన టికెట్‌ ధరలు ఇలాగే ఖరారవుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఆర్టీసీలోనూ అమలు చేయనున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభమయ్యాక అన్ని దూరప్రాంత సర్వీసుల్లో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కొన్ని ఇతర సర్వీసుల్లో కూడా అమలు చేసే అవకాశాన్ని పరిశీలించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు. 

ప్రైవేటు ట్రావెల్స్‌ బాటలోనే.. 
కొన్ని ప్రధాన ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు ఫ్లెక్సీ ఫేర్‌ విధానాన్ని అమలు చేస్తుండటంతో వాటితో ఆర్టీసీ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. డిమాండ్‌ అంతగా లేని సందర్భాల్లో ప్రయాణికులను ఆయా ట్రావెల్స్‌ తన్నుకుపోతుండటంతో ఆర్టీసీ నష్టపోతోంది. ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్టీసీ తీవ్రంగా యత్నిస్తోంది. ఫ్లెక్సీ ఫేర్‌ విధానాన్ని ప్రారంభిస్తే ఆదాయం పెరుగుతుందని అంచనాకొచ్చిన ఆర్టీసీ ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసుకుంది. ఆన్‌లైన్‌ బుకింగ్‌తో దీన్ని అనుసంధానించనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు తిరగటం లేదు. ఆయా రాష్ట్రాలతో అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం చేసుకోగానే సర్వీసులు మొదలు కానున్నాయి. ఆ వెంటనే ఫ్లెక్సీ ఫేర్‌ విధానాన్ని అమలు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి తుది అనుమతి పొందాల్సి ఉంది. ప్రజలపై పెద్దగా భారం లేని విధానమే అయినందున దీనికి అనుమతి విషయంలో ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు.  

గంటగంటకూ ధరలు మారే అవకాశం
దసరా, సంక్రాంతి, దీపావళి లాంటి ప్రధాన పండుగలతోపాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ బస్సులకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ప్రత్యేక సర్వీసులు ప్రారంభించినా సీట్లు లభించనంత రద్దీ ఉంటుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ కూడా వందల సంఖ్యలో తిరిగినా రద్దీ తగ్గదు. అలాంటి సందర్భాల్లో ఫ్లెక్సీ ఫేర్‌ విధానంలో టికెట్‌ ధరలు నిలకడగా ఉండవు. ప్రస్తుతం ఆర్టీసీ ముందుగా నిర్ధారించిన ధరలే స్థిరంగా అమలవుతున్నాయి. స్పెషల్‌ సర్వీస్‌ చార్జీగా 50 శాతం అదనంగా ధర పెంచడం తప్ప బేసిక్‌ టికెట్‌ ధర స్థిరంగానే ఉంటోంది. కానీ ఫ్లెక్సీ ఫేర్‌లో ప్రతి గంటకూ పరిస్థితిని అంచనా వేసి ధరలను సవరిస్తారు. అలాగే అన్‌ సీజన్‌లో, ఖాళీగా ఉండే సమయంలో బేసిక్‌ ధర కంటే తగ్గిస్తారు.

గతంలో బెంగళూరు మార్గంలో నడిచే కొన్ని సర్వీసులకు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశారు. ఇప్పుడు బెంగళూరు, షిరిడీ, ముంబై, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి డిమాండ్‌ ఎక్కువున్న అన్ని దూరప్రాంతాల్లో దాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. తొలుత గరుడ లాంటి ఏసీ సర్వీసులకు దీన్ని ప్రారం భించి ఆ తర్వాత సూపర్‌ లగ్జరీ బస్సుల్లోనూ అమలు చేయాలనుకుంటున్నారు. పేదలు ఎక్కువగా ప్రయాణించే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ మినహా ఆపై అన్ని కేటగిరీల్లో దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్నారు.  సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. 

నిపుణుల సిఫార్సులు
ఆర్టీసీ నష్టాలను అధిగమించడంతోపాటు ప్రైవేటు ట్రావెల్స్‌ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొనేందుకు నిపుణులు గతంలో చేసిన సిఫారసుల్లో ఫ్లెక్సీ ఫేర్‌ విధానం కూడా ఉంది. దీన్ని అమలు చేయాలని చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో వెనకడుగు వేశారు. తీవ్ర నష్టాలు, కరోనా నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులతో ఆర్టీసీ తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. దీంతో ఇప్పుడు దాన్ని అమలు చేయాలని అధికారులు దాదాపుగా నిర్ణయానికి వచ్చారు.  

మరిన్ని వార్తలు