TSRTC: కి.మీ.కు 25 పైసలు పెంపు! 

23 Sep, 2021 01:48 IST|Sakshi

ఆర్టీసీ చార్జీలపై అధికారుల కసరత్తు 

మరో రెండు ప్రత్యామ్నాయ నివేదికలు కూడా.. 

పెరిగిన డీజిల్, టైర్ల ధరలతో పడుతున్న అదనపు భారానికి చెల్లు 

త్వరలో సీఎంవోకు ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ చార్జీల పెంపు దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి కిలోమీటరుకు 25 పైసల చొప్పున పెంచే దిశగా నివేదికను రూపొందిస్తున్నారు. దీనికితోడు కిలోమీటరుకు 20 పైసలు, కిలోమీటరుకు 28–30 పైసలుతో మరో రెండు ప్రత్యామ్నాయ నివేదికలను కూడా తయారు చేస్తున్నారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించేందుకు వీలుగా వీటిని సీఎం కార్యాలయానికి సమర్పించనున్నారు.

ముఖ్యమంత్రి సూచనతో.. 
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్టీసీని ఇప్పటికిప్పుడు గట్టెక్కించాలంటే టికెట్‌ చార్జీల పెంపు అనివార్యమంటూ మంగళవారం సీఎం నిర్వహించిన సమీక్షలో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపాదనలు సమర్పిస్తే.. మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొన్నట్టు మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో సీఎం కార్యాలయం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కసరత్తు ప్రారంభించి దాదాపు పూర్తి చేసినట్టు తెలిసింది.  

ప్రస్తుతానికి 25 పైసలైతే ఓకే.. 
పెరిగిన డీజిల్, టైర్లు, ఇతర పరికరాల ధరల కార ణంగా గత కొన్ని నెలల్లో ఆర్టీసీపై పడిన అదనపు భారం నుంచి గట్టెక్కాలంటే కిలోమీటరుకు 25 పైసలు చొప్పున చార్జీలు పెంచాలనే అభిప్రాయానికి అధికారులు వచ్చారు. 2019 డిసెంబర్‌లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచారు. ఆ సమయంలో డీజిల్‌ ధర లీటరుకు రూ.65 ఉంది. ఈ రెండేళ్లలో లీటరుపై గరిష్టంగా రూ.22 మేర పెరిగింది. దీంతో అదనంగా సాలీనా దాదాపు రూ.500 కోట్ల భారం పడిందని లెక్కలు తేల్చారు. ఇక టైర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఆ భారం కిలోమీటరుకు రూపాయి చొప్పున పడుతోంది. విడిభాగాల ధరలు భారీగా పెరగడం వల్ల పడిన అదనపు భారం కిలోమీటరుకు మరో రూపాయి చొప్పున పడుతోంది.

ఈ లెక్కన నిత్యం సగటున రూ.50 లక్షల అదనపు భారం ఉంటోంది. అంటే సాలీనా సుమారు రూ.180 కోట్ల భారం పడుతోంది. ఈ నేపథ్యంలోనే కి.మీ.కు 25 పైసలు చొప్పున చార్జీలు పెంచితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితుల వల్ల గతంలో లాగా బస్సులు తిరగటం లేదు. కోవిడ్‌ సమస్య తగ్గితే ఖర్చు కూడా పెరుగుతుంది. అప్పుడు కూడా కొంత అనుకూలంగా ఉండేలా కి.మీ.కు 28 పైసల నుంచి 30 పైసల వరకు పెంచాలనే ప్రత్యామ్నాయ నివేదికను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో మధ్యేమార్గంగా 20 పైసలతో మరో నివేదికను కూడా తయారు చేసే పనిలో ఉన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు పెంపు చోటు చేసుకునే అవకాశం ఉంది.    

మరిన్ని వార్తలు