డబ్బులు తెద్దాం.. బస్సులు కొందాం

6 Jan, 2022 02:03 IST|Sakshi

ప్రపంచ బ్యాంకు నిధులతో బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌: కొత్త బస్సులకు నిధుల్లేక దిక్కులు చూస్తున్న ఆర్టీసీ.. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. రోడ్లను మెరుగుపర్చడం, పర్యావరణహిత వాహనాలు, బస్సులు సమకూర్చుకోవటానికి ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయం అందిస్తుండటంతో వినియోగించుకోవాలని భావిస్తోంది.

ఈ మేరకు  800 కొత్త బస్సులు కొనాలని, ఇందుకు రూ. 270 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తూ ప్రతిపాదన రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆర్టీసీకి కేటాయించిన బడ్జెట్‌లో ఇంకా రూ.500 కోట్లకు పూచీకత్తు ఇచ్చే వీలుంది. దాన్ని కలుపుకొంటూ వరల్డ్‌ బ్యాంకుకు పూచీ ఇస్తే ఆ నిధులు చేతికందుతాయని భావిస్తోంది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం.  

సిటీకి నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు 
నగరంలో తిప్పేందుకు కొత్తగా 320 నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకునేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. కేంద్ర పథకం ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రీడ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌(ఫేమ్‌) లో భాగంగా వీటిని సమకూర్చుకోనుంది. ఈ పథకం రెండో విడతలో రాష్ట్రానికి 324 బస్సులు మంజూరయ్యాయి. అప్పట్లో ఏసీ బస్సులు తీసుకోవాల్సి వచ్చింది.

అంతకుముందు తీసుకున్న ఏసీ బస్సులు తెల్ల ఏనుగుల్లా మారి తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతుండటంతో ఆ మంజూరును వద్దనుకుంది. ఇప్పుడు అదే కేటాయింపులో భాగంగా ఏసీ బస్సులకు బదులు నాన్‌ ఏసీ బస్సులు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రపంచ బ్యాంకు నిధుల ప్రతిపాదన అలాగే ఉంచి అదనంగా అద్దె బస్సులు తీసుకోవాలా, లేక ప్రతిపాదన సంఖ్య తగ్గించి అద్దెవాటితో సర్దుబాటు చేయాలా అని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కొత్తగా కొనే బస్సులివే.. 
గరుడ ప్లస్‌ – 30, రాజధాని – 25, సూపర్‌ లగ్జరీ – 270, డీలక్స్‌ – 190, ఎక్స్‌ప్రెస్‌ – 30, సిటీబస్సులు – 210, పల్లెవెలుగు – 15  

>
మరిన్ని వార్తలు