ఆర్టీసీకి ‘మండే’.. ఆదాయం మెండే!

8 Jun, 2022 00:46 IST|Sakshi

ఒకే రోజు రూ.15.58 కోట్ల రాబడి

టికెట్‌ ఆదాయంలో ఆర్టీసీ రికార్డు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీకి సోమవారం అంటే పండుగే. అది ఎప్పుడూ కలిసొచ్చే రోజే. ఆరోజు ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆదాయం భారీగా ఉంటుంది. అందుకే దాన్ని లక్కీ మండేగా ఆర్టీసీ అధికారులు చెప్పుకుంటారు. సోమవారాల్లోనూ గత సోమవారం వేరు. ఆరో తేదీన(సోమవారం) ఆర్టీసీ ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ఆరోజు ఏకంగా టికెట్‌ ద్వారా రూ.15.58 కోట్లు ఆర్జించింది.

దసరా, సంక్రాంతి లాంటి పండగరోజులు కాకుండా ఓ సింగిల్‌ డే ఇంత ఆదాయం రావటం రికార్డే. గత ఏప్రిల్‌ 18న సమకూరిన రూ.15.01 కోట్లు ఇప్పటివరకు గరిష్ట ఆదాయం. దాన్ని గత సోమవారం అధిగ మించింది. 2019 డిసెంబర్‌లో ఆర్టీసీ చార్జీలు పెరిగిన వెంటనే, కోవిడ్‌ రావటంతో పూర్తిస్థాయిలో బస్సులు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. గత ఆరు నెలల నుంచే బస్సుల ఆపరేషన్లు ఊపందుకున్నాయి.

ఈ ఆరు నెలల్లో ఇంత ఆదాయం రావడం ఇదే తొలిసారి. సోమవారం రూ.13.64 కోట్లు టార్గెట్‌ పెట్టుకోగా దాన్ని మించి (114 శాతం) ఆదాయం రావటం విశేషం. కరీంనగర్‌ జోన్‌ పరిధిలో రూ.6.19 కోట్లు, హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 4.42 కోట్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో రూ.4.97 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక కిలోమీటరు ఆదాయం(ఈపీకే) రూ.44.93గా, ఆక్యుపెన్సీ రేషియో 85.10 శాతంగా నమోదయ్యాయి. 34.25 లక్షల కి.మీ. తిరగాలని లక్ష్యం పెట్టుకోగా ఆరోజు ఆర్టీసీ బస్సులు 34.69 లక్షల కి.మీ. మేర తిరిగాయి.

>
మరిన్ని వార్తలు