ఊళ్లకు బస్సులు బంద్‌! 

8 Aug, 2021 01:11 IST|Sakshi
ఆత్మకూరు నుంచి ములుగువైపు ఆటోలో కిక్కిరిసి వెళ్తున్న ప్రయాణికులు

గ్రామాలకు తగ్గిపోయిన పల్లె వెలుగు సర్వీసులు

కొన్ని వందల గ్రామాలకు పూర్తిగా నిలిపివేత

బిల్లులు చెల్లించక ఆగిపోయిన అద్దె బస్సులు

ఆర్టీసీ సొంత బస్సులన్నీ ప్రధాన రూట్లకు మళ్లింపు

తీవ్రంగా ఇబ్బంది పడుతున్న జనం

ఆటోలు, జీపుల్లో కిక్కిరిసి ప్రమాదకరంగా ప్రయాణం

ఇది మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ– మద్దూర రహదారి. ఈ రెండు మండలాల పరిధిలో 65 ఊళ్లున్నాయి. గతంలో ఆరు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు, మరో ఆరు అద్దె బస్సులు నడిచేవి. ఇప్పుడు కేవలం మూడే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. అవి కూడా పది, ఇరవై ఊళ్ల్లకే, కొన్ని సమయాల్లోనే నడుస్తున్నాయి. దీంతో జనం ఆటోలు, జీపుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండల కేంద్రం నుంచి చెన్నంపల్లికి కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న జీపు ఇది. ఊళ్లకు బస్సులు లేక ప్రయాణికులు జీపులో, టాప్‌పైన కూడా కూర్చుని వెళ్తున్న దుస్థితి ఉంది. నాగర్‌కర్నూల్‌ డిపో పరిధిలో 77 పల్లె వెలుగు బస్సులుండగా.. వాటిలో 47 అద్దె బస్సులే. ఇప్పుడవి నడవకపోతుండటం, ఆర్టీసీ బస్సులు ఎక్కువగా ప్రధాన రోడ్లకే పరిమితం కావటంతో పల్లెలకు బస్సులు సరిగా నడవడం లేదు. 

సాక్షి, హైదరాబాద్‌: ‘పల్లె బస్సు’మొహం చాటేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారవాణాకు కీలకమైన పల్లె వెలుగు బస్సు ఆగిపోయింది. ఒకటీ రెండు కాదు.. వేల ఊళ్లకు బస్సులు సరిగా నడవడం లేదు. ప్రధాన మార్గాల్లోని ఊర్లు, కొన్ని ముఖ్యమైన మండల కేంద్రాలు, గ్రామాలకు మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి. చిన్న గ్రామాలు, ప్రధాన రోడ్లకు దూరంగా ఉన్న ఊళ్లు, మారుమూల పల్లెలకు కొద్దినెలలుగా బస్సులు రావడం లేదు. దగ్గరిలోని పట్టణానికి వెళ్లాలన్నా, ఇతర ఊళ్లకు పోవాలన్నా ఆటోలు, జీపులే దిక్కు అవుతున్నాయి. క్రమంగా ఆ ఊళ్లు ప్రజా రవాణాకు పూర్తిగా దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్టీసీలో ఎక్స్‌ప్రెస్‌లు, డీలక్స్, సూపర్‌లగ్జరీ వంటి సర్వీసుల నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నా.. ఎక్కువ శాతం జనాభాకు పల్లె వెలుగు బస్సులే ఆధారమని, అవి లేకుంటే ఎలాగనే విమర్శలు వస్తున్నాయి. 

నష్టాలు, బకాయిలతో.. 
ఆర్టీసీలో ప్రస్తుతం 3,645 పల్లె వెలుగు బస్సులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలను అనుసంధానించి, ప్రజల రవాణా అవసరాలను తీర్చాల్సినవి అవే. ఆ బస్సులు సరిపోవడం లేదు. మరో రెండు వేల బస్సులు అదనంగా వస్తేనే ఊర్లకు ప్రజారవాణా సరిగా అందే పరిస్థితి. కానీ కొత్త బస్సులు రావడాన్ని పక్కనపెడ్తే.. ఉన్న బస్సులే ఆగిపోవడంతో జనం ఆగమాగం అవుతున్నారు. మొత్తం పల్లెవెలుగు బస్సు ల్లో ఆర్టీసీ సొంత బస్సులు 1,935 కాగా, మిగతావి ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దె రూపంలో తీసుకుని నడుపుతున్న బస్సులు. గతంలో అద్దె బస్సులు పరిమితంగా ఉండేవి. 2019లో జరిగిన ఆర్టీసీ సమ్మె తర్వాత వాటి సంఖ్య 3,300కు పెరిగింది. ఇందులో పల్లె వెలుగు సర్వీసుల కింద నడుస్తున్నవి 1,710 బస్సులు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో అద్దె బస్సులకు బిల్లుల చెల్లింపు కొంతకాలంగా నిలిచిపోయింది. దానికితోడు కరోనా లాక్‌డౌన్లు, జనం ప్రయాణాలు తగ్గిపోవడంతో ఆర్టీసీ పరిస్థితి మరింత దిగజారింది. అద్దె బస్సుల బకాయిలు రూ.100 కోట్లకు చేరుకున్నాయి. ఇటీవలే రూ.25 కోట్లు మాత్రం చెల్లించారు. అయితే అద్దె బస్సులు తిరిగితే ప్రతి నెలా బకాయిలు పెరుగుతూనే ఉంటాయన్న ఉద్దేశంతో కొన్నింటిని ఆపేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. అద్దె బస్సుల్లో ఎక్స్‌ప్రెస్, లగ్జరీ సర్వీసులను కొనసాగించి.. పల్లె వెలుగు బస్సులను నిలిపివేసింది. దీంతో కేవలం ఆర్టీసీ సొంత పల్లె వెలుగు బస్సులు మాత్రమే గ్రామాలకు తిరుగుతున్నాయి. 

ఉన్నవన్నీ ప్రధాన రూట్లకే పరిమితం
కొన్నేళ్లుగా ఆర్టీసీ సొంతంగా బస్సులు కొనటం లేదు. పాతవి మూలనపడిన కొద్దీ అద్దె బస్సులను తీసుకుంటూ తిప్పుతోంది. ఇప్పుడు అద్దె బస్సులు ఆగిపోవడంతో.. పల్లె వెలుగు బస్సుల్లో చాలా వాటిని ప్రధాన రూట్లకు మళ్లించింది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో రెండువేల జనా భా ఉన్న తాడూరు గ్రామానికి ఇటీవలి వర కు ఆరు పల్లె వెలుగు బస్సులు వచ్చేవి. సిద్దిపేట వెళ్లాలన్నా, మండల కేంద్రం చేర్యాలకు వెళ్లాలన్నా అవే ఆధారం. కానీ ఇప్పుడు ఒక్క బస్సు కూడా రావటం లేదు. ఇలాంటి ఊళ్లు ఇప్పుడు వందల సంఖ్యలో ఉన్నాయి. 


ఇది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అలుగామ–సిర్సా గ్రామాల మధ్య పరిస్థితి. గతంలో బస్సులు తిరిగిన ఈ రహదారిలో ఇప్పుడన్నీ ప్రైవేటు వాహనాలే కనిపిస్తున్నాయి.

బడులు లేవని చెప్తూ.. 
మొత్తం పల్లె వెలుగు బస్సుల్లో వెయ్యి సర్వీసుల వరకు పాఠశాల విద్యార్థుల కోసం కేటాయించారు. బడుల వేళలకు అనుగుణంగా వాటి సమయాలు నిర్ధారించి ఊళ్లకు తిప్పేవారు. ఇప్పుడు కోవిడ్‌ వల్ల బడులు మూసి ఉండటంతో ఆ ట్రిప్పులన్నింటినీ రద్దు చేశారు. బడి సమయాల కోసం ఒక్కో బస్సు కనీసం మూడు, నాలుగు ట్రిప్పులు తిరిగేవి. అంటే ఈ లెక్కనే మూడు, నాలుగు వేల ట్రిప్పులు రద్దయ్యాయి. విద్యార్థుల సౌకర్యం కోసం వేసినా.. వాటిలో సాధారణ ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రయాణించేవారు. వారికీ రవాణా వసతి దూరమైంది.

ప్రయాణం.. ప్రమాదం 
ఊళ్లలో ఇటీవల ఆటోలు, జీపుల సంఖ్య పెరిగింది. యువతకు ఉపాధి పేరుతో అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. చాలామంది యువకులు సరిగా డ్రైవింగ్‌ రాకున్నా ఆటోలు, జీపులు నడుపుతున్నారు. దానికితోడు పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకోవడం, రోడ్లు బాగోలేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతు న్నాయి. ఇప్పుడు పల్లె వెలుగు బస్సు ల్లేక జనం పూర్తిగా ఆటోలు, జీపులనే ఆశ్రయించాల్సి వస్తోంది. వాటిని నడిపేవారు అడ్డగోలుగా జనాన్ని ఎక్కిస్తున్నారు. ఇలాంటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగితే ఏమిటన్న ఆం దోళన వ్యక్తమవుతోంది. మరోవైపు వీటిని అడ్డుకుంటే రవాణా వసతి ఉండదన్న ఉద్దేశంతో అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

అన్నిచోట్లా అదే దుస్థితి
మంచిర్యాల జిల్లాలో ఏకైక బస్సు డిపో మంచిర్యాల. ఇక్కడ 141 బస్సులున్నాయి. అందులో 61 అద్దెబస్సులు కాగా.. 80 ఆర్టీసీ సొంత బస్సులు. నిత్యం 25 వేల మంది ప్రయాణిస్తుంటారు. రోజుకు సగటున 23 లక్షల ఆదాయం వచ్చేది. కరోనా రెండో వేవ్‌ నాటి నుంచి అంటే నాలుగు నెలలుగా అద్దె బస్సులు నడవటం లేదు. మొత్తం 323 గ్రామాలకుగాను 120 రూట్లు ఉన్నా.. ప్రస్తుతం 58 రూట్లలోనే బస్సులు నడిపిస్తున్నారు. పల్లె ప్రాంతాలకు బస్సులు లేక ఇబ్బంది ఎదురవుతోంది. 
మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలంలోని కొండాపూర్‌ జనాభా 4 వేలకుపైనే. అయినా ఈ ఊరికి ఒక్క బస్సు కూడా రావటం లేదు. జనం ఊరుదాటాలంటే ప్రైవేటు వాహనం ఎక్కాల్సిందే. 
వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని 9 డిపోల పరిధిలో 239 పల్లె వెలుగు రూ ట్లు ఉన్నాయి. ప్రస్తుతంఅందులో 136 రూట్లకు సర్వీసులు నడవటం లేదు. 
యాదగిరిగుట్ట డిపో పరిధిలో పల్లె వెలుగు సర్వీసులకు సంబంధించి అద్దె బస్సులు 38కాగా, ఆర్టీసీ సొంత బస్సు లు 9 మాత్రమే. ఇప్పుడు అద్దె బస్సు లన్నీ నిలిచిపోవడంతో గ్రామాలకు ప్రజారవాణా ఆగిపోయింది. 
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 239 ఆర్టీసీ సొంత పల్లె వెలుగు బస్సులే తిరుగుతున్నాయి. 234 అద్దె బస్సులు నిలిచిపోయాయి.  
మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలో ఆర్టీసీ సొంత పల్లె వెలుగు బస్సులు 453 మాత్రమే తిరుగుతున్నాయి. 389 అద్దె బస్సులు ఊళ్లకు వెళ్లటం లేదు.

మరిన్ని వార్తలు