ఆర్టీసీ బస్సులు మళ్లీ కళకళ 

12 Aug, 2021 02:31 IST|Sakshi

కోవిడ్‌కు ముందు పరిస్థితికి ఆక్యుపెన్సీ రేషియో 

ప్రస్తుతం రోజువారీ టికెట్‌ ఆదాయం రూ.10 కోట్లకు చేరువ 

పల్లెవెలుగు, అంతర్రాష్ట్ర సర్వీసులు పూర్తిస్థాయిలో తిరక్కున్నా మెరుగుపడ్డ పరిస్థితి 

కోవిడ్‌ భయం వీడి బస్సు ప్రయాణాలకు ముందుకొస్తున్న జనం 

 సాక్షి, హైదరాబాద్‌:  కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నరపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. ప్రజలు కోవిడ్‌ భయం వీడి బస్సు ప్రయాణాలకు ముందుకొస్తున్నారు. ఫలితంగా ఆక్యుపెన్సీ రేషియో బాగా మెరుగుపడింది. ప్రస్తుతం రోజువారీ ఆదాయం సగటున రూ.తొమ్మిదిన్నర కోట్లను దాటింది. సాధారంగా రద్దీ ఎక్కువగా ఉండే సోమవారాల్లో మరో రూ.కోటి ఎక్కువగా ఉంటోంది. వెరసి కోవిడ్‌కు ముందున్న పరిస్థితి దాదాపు ఏర్పడినట్టయింది. కోవిడ్‌కు పూర్వం రోజువారీ ఆదాయం రూ.13 కోట్లుగా నమోదయ్యేది.

ప్రస్తుతం రాష్ట్రంలో పల్లెవెలుగు బస్సులు సరిపడా తిరగటం లేదు. బిల్లులు చెల్లించలేక అద్దె బస్సులను ఆర్టీసీ వినియోగించటం లేదు. దీంతో వాటి రూపంలో వచ్చే ఆదాయం సమకూరటం లేదు. అంతర్రాష్ట్ర సర్వీసులూ పూర్తిస్థాయిలో తిరగటం లేదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో ఎక్కువగా సూపర్‌ లగ్జరీ, గరుడ బస్సులే ఉంటాయి. వీటి వల్ల వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా తిరిగితే ప్రస్తుత ఆదాయం రూ.13 కోట్ల మార్కును చేరుకుని ఉండేదని అధికారులు పేర్కొంటున్నారు. 

హైదరాబాద్‌లోనూ మెరుగుదల.. 
తెలంగాణ ఆర్టీసీకి మంగళవారం టికెట్‌ రూపంలో రూ.9.31 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణంగా మంగళవారం అంత శుభం కాదన్న ఉద్దేశంతో చాలామంది ప్రయాణాలకు ఇష్టపడరు. అయినా ఈ మంగళవారం మంచి ఆదాయం నమోదవడం గమనార్హం. ఆరు రీజియన్ల సగటు ఆక్యుపెన్సీ రేషియో 70 శాతంగా నమోదైంది. కిలోమీటర్‌ ఆదాయం చాలా మెరుగ్గా 35.20గా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో కోవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కేవలం రూ.277 కోట్ల ఆదాయమే సమకూరింది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గినందున ప్రజలు ప్రయాణాలకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో టీకాలు తీసుకున్నవారి సంఖ్య మెరుగుపడటం కూడా కలిసివచ్చింది. గడ చిన సోమవారం రూ.10.31 కోట్ల ఆదాయం సమకూరింది. ఆక్యుపెన్సీ రేషియో సగటున 71 శాతం గా నమోదవటం విశేషం. కిలోమీటర్‌ ఆదాయం 37.37 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో ఆక్యుపెన్సీ రేషియో 67.61 శాతంగా నమోదు కాగా, రూ. 289.13 కోట్ల టికెట్‌ ఆదాయం సమకూరింది.  

అంతర్రాష్ట్ర సర్వీసులు పెరిగితే.. 
ప్రస్తుతం అంతర్రాష్ట్ర సర్వీసుల్లో కేవలం 60 శాతం మాత్రమే తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీకి రాత్రివేళ ఎక్కువగా బస్సులు వెళ్తుంటా యి. కానీ, కోవిడ్‌ నిబంధనల వల్ల ప్రస్తుతం ఏపీలోని పట్టణాలకు రాత్రివేళ బస్సులు తిరగం లేదు. రాత్రి సర్వీసులు ప్రారంభమైతే ఇదివరకటిలా ప్రయాణికుల సంఖ్య గరిష్టస్థాయిలో ఉం టుందని, అప్పుడు ఆదాయంలో కనీసం రూ. 2.5 కోట్లు అదనంగా వస్తాయని భావిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు, పల్లె వెలుగు బస్సులు పూర్తిస్థాయిలో తిరిగితే కనీసం కోటిన్నర ఆదాయం అదనంగా వస్తుందని అంచనా.    

మరిన్ని వార్తలు