సొమ్ము చెల్లించేదేలా?

5 Oct, 2020 05:01 IST|Sakshi

సహకార పొదుపు సంఘం నిధులు వాడుకున్న ఆర్టీసీ 

సకాలంలో చెల్లించలేక విలవిల.. హైకోర్టుకు చేరిన కథ 

ఇప్పటికే కోర్టు ఓ గడువు విధించినా చెల్లించని సంస్థ 

రేపు న్యాయస్థానానికి జవాబు చెప్పాల్సి రావటంతో హైరానా 

రూ.800 కోట్ల మేర సీసీఎస్‌కు బకాయి

 సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగులు దాచుకున్న పొదుపు మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకున్న ఆర్టీసీ ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి చెల్లించలేక హైకోర్టు బోనులో నిలబడాల్సి వచ్చింది. ఇప్పటికే ఓ సారి న్యాయస్థానం విధించిన గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించకపోవటంతో హైకోర్టు ఆర్టీసీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ నెల 6న కోర్టుకు వెళ్లి సమాధానం చెప్పాల్సి వస్తోంది. కోర్టు ధిక్కార కేసును ఎదుర్కొంటున్న రవాణా సంస్థ ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో పాలుపోక హైరానా పడుతోంది.  

ఇదీ సంగతి.. 
ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్‌). ఉద్యోగులు తమ జీతాల నుంచి ప్రతినెలా 7 శాతం మొత్తాన్ని కోత పెట్టుకుని దీంట్లో పొదుపు చేసుకుంటారు. అలా జమయ్యే వాటి నుంచి పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణం, వైద్య ఖర్చు.... ఇలా పలు అవసరాలకు రుణంగా తీసుకుంటారు. దీనికి వడ్డీ చెల్లిస్తారు. ఇలా పెద్ద ఎత్తున రుణాలు అందించే సంస్థగా ఆసియా ఖండంలోనే సీసీఎస్‌కు రికార్డు ఉంది. అయితే.. రానురాను ఆర్టీసీ పూర్తిగా కుదేలు కావడం.. అప్పు కూడా పుట్టని స్థితిలో ఈ సీసీఎస్‌ నిధిని వాడేసుకుంది. ఫలితంగా సిబ్బంది ఇంతకాలం దాచుకున్న డబ్బులు అవసరాలకు తీసుకోలేని దుస్థితి నెలకొంది.

గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఆర్టీసీ సమ్మె సందర్భంలో ఇది పెద్ద రభసగా మారింది. ఏడాదిపాటు ఆ డబ్బులు తిరిగి జమ చేయాలంటూ అడుగుతూ వచ్చిన సీసీఎస్‌ పాలక వర్గం.. సమ్మె సమయంలో హైకోర్టు తలుపుతట్టింది. ఆ సమయంలో సీసీఎస్‌కు ఆర్టీసీ దాదాపు రూ.400 కోట్లు బకాయిపడి ఉంది. దీంతో ఆరువారాల్లో అందులో కనీసం సగం.. అంటే రూ.200 కోట్లు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశించింది. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి ఇవ్వనున్నట్టు సీసీఎస్‌ పాలకవర్గానికి స్పష్టం చేసింది. అలా ఈ సంవత్సరం మార్చిలో బ్యాంకుల నుంచి ప్రభుత్వ పూచీకత్తుతో రూ.600 కోట్ల అప్పు తెచ్చుకుంది. అందులో నుంచి రూ.200 కోట్లు సీసీఎస్‌కు చెల్లించాల్సిన తరుణంలో కోవిడ్‌ లాక్‌డౌన్‌ మొదలైంది.

దీంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయి రోజువారీ టికెట్‌ ఆదాయం కూడా రాని పరిస్థితి ప్రారంభమైంది. సిబ్బందికి జీతాలు చెల్లించటం కూడా కష్టంగా మారటంతో అధికారులు ఆ రూ.600 కోట్ల అప్పు మొత్తాన్ని జీతాల ఖాతాకు బదలాయించటంతో అది కూడా వ్యయమైపోయింది. ఎన్నిసార్లు అడిగినా ఆర్టీసీ డబ్బులు చెల్లించకపోయేసరికి సీసీఎస్‌ పాలకవర్గం ఇటీవల హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. దాన్ని స్వీకరించిన కోర్టు.. ఆర్టీసీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ, సంస్థ ఫైనాన్‌ ్స అడ్వైజర్‌ (లేదా వారి న్యాయవాది) కోర్టుకు హాజరు కావాల్సిందిగా అందులో పేర్కొంది. ఆ మేరకు 6వ తేదీన వారు హాజరు కావాల్సి ఉంది.  

రెట్టింపు చెల్లించాలి.. 
గతేడాది సమ్మె సమయంలో ఆర్టీసీ రూ.200 కోట్లు సీసీఎస్‌కు చెల్లించాలని కోర్టు పేర్కొన్నప్పటికీ, ఇప్పుడా మొత్తాన్ని కనీసం రెట్టింపు చేయాలని సీసీఎస్‌ తాజాగా కోర్టును కోరింది. అప్పట్లో బకాయి మొత్తం రూ.400 కోట్లు ఉండగా, ఇప్పుడా మొత్తం రూ.800 కోట్లకు చేరింది. అందులో సగం మొత్తం అంటే రూ.400 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరింది. ఇంత పెద్ద మొత్తం ఇప్పటికిప్పుడు చెల్లించటం ఆర్టీసీకి పెద్ద సమస్య. సొంత భూములు తనఖా పెట్టి అప్పు తేవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. లేదా ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వెరసి అక్టోబర్‌ 6ను తలుచుకుంటూ ఆర్టీసీ హైరానా పడుతోంది. 

మరిన్ని వార్తలు