భక్తులకు గమనిక.. రథసప్తమికి టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. వివరాలు ఇవే..

26 Jan, 2023 19:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు 80 ప్రత్యేక బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌తో సహా జిల్లా కేంద్రాల నుంచి ప్రముఖ ఆలయాలు వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండ, గూడెం ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది.

కరీంనగర్‌ నుంచి వేములవాడకు 10, ధర్మపురికి 10, నల్లగొండ నుంచి యాదగిరిగుట్టకు 10, మహబుబ్‌నగర్‌ నుంచి మన్నెంకొండకు 10, ఆదిలాబాద్‌ నుంచి గూడెంకు 5, హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ నుంచి అనంతగిరికి 5 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అలాగే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి, చిలుకూరు బాలాజీ, సికింద్రాబాద్‌ మహంకాళి, హిమాయత్‌నగర్‌ బాలాజీ, తదితర ఆలయాలకు ప్రధాన ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

రథసప్తమి సందర్భంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వారు సురక్షితంగా ఆలయాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. భక్తుల రద్దీ మేరకు అవసరమైతే మరిన్నీ బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్టు వారు స్పష్టం చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. గురువారం వసంత పంచమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర, వర్గల్‌కు 108 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు