TSRTC: అన్నాచెల్లెళ్లకు వారధిగా ఆర్టీసీ

19 Aug, 2021 09:21 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రజలకు టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందించనుంది. సోదరులకు రాఖీలు, మిఠాయిలు పంపించే సోదరీమణులు కరోనా సమయంలో ఇబ్బంది పడకుండా ఖమ్మం బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. టీఎస్‌ ఆర్టీసీ పార్సిల్, కొరియర్, కార్గో సర్వీస్‌ ద్వారా రాఖీలను పంపించే సౌకర్యం కల్పించారు. అతితక్కువ ఖర్చుతో ఆత్మీయులకు రాఖీలు పంపుకోవచ్చునని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

ఇంటి వద్దే డెలివరీ
వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మం నగరానికి రాఖీలు పంపిస్తే, ఇక్కడ ఇంటి వద్దే డెలివరీ చేయనున్నారు. అలాగే, హైదరాబాద్, సికింద్రాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మిర్యాలగూడెం తదితర నగరాలకు పంపించినా ఇంటి వద్దే అందజేస్తామని అధికారులు తెలిపారు. 

తక్కువ చార్జీలతో..
టీఎస్‌ ఆర్టీసీ సర్వీసుల ద్వారా అతితక్కువ చార్జీతో రాఖీలు పంపుకోవచ్చు. తెలంగాణ పరిధిలో 250 గ్రాములలోపు రూ.30, 251 నుంచి 500 గ్రా. లోపు రూ.40, 501 నుంచి 1000 గ్రా. లోపు బరువైతే రూ.60 చెల్లిస్తే సరిపోతుంది. ఇతర రాష్ట్రాలకు 250 గ్రాముల లోపు రూ.75, 251 నుంచి 500 గ్రాములలోపు రూ.100, 501 నుంచి 1000 గ్రాముల లోపైతే రూ.125కు చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ప్రాంతాలకు రాఖీలను పంపించే వెసలుబాటు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఖమ్మం రీజనల్‌ మేనేజర్‌ సాల్మన్‌ తెలిపారు. కాగా, రాఖీలతో పాటు స్వీట్లు పార్సిల్, కొరియర్‌ ద్వారా పంపించే వారి కోసం ఖమ్మం బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటుచేశామని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు