కోవిడ్‌ వ్యాక్సిన్‌ రవాణాకు వజ్ర?

9 Nov, 2020 02:27 IST|Sakshi

గమ్యం చేర్చేందుకు వాడాలని నిర్ణయం

బస్సు ఏసీ సామర్థ్యంపై పరిశీలన

ఓకే అంటే టీకా సరఫరాకు సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తరలింపునకు ఆర్టీసీ మినీబస్సులు ‘వజ్ర’ను వినియోగించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వ్యాక్సిన్‌ ప్రయోగాలు మూడోదశలో ఉన్నందున, మరో రెండుమూడు నెలల్లో అది అందుబాటులోకి వస్తుందన్న మాట వినిపిస్తోంది. ప్రజలందరికీ టీకాలు ఇవ్వాల్సి ఉన్నందున పెద్దమొత్తంలో వ్యాక్సిన్‌ రాష్ట్రం నలుమూలలకు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా వేగంగా జరగాలి. ఇందుకోసం ఆర్టీసీ వజ్ర బస్సులు ఏమేరకు ఉపయోగపడతాయన్న విషయాన్ని ఆర్టీసీ పరిశీలిస్తోంది. నిపుణులకు బస్సులను చూపి నివేదిక తీసుకోనుంది. 

విమానాశ్రయంతో అనుసంధానం
రెండురోజుల క్రితం ఆర్టీసీ జీఎంఆర్‌ ఎయిర్‌కార్గోతో ఒప్పందం చేసుకుంది. విమానాల ద్వారా వచ్చే సరుకును సంబంధిత గమ్యానికి చేర్చేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలోని కార్గో బస్సులను వినియోగించటం దీని ఉద్దేశం. ఎయిర్‌కార్గోలో మందులు, వ్యాక్సిన్‌ తరలింపునకు ఏసీ బస్సుల అవసరం ఉంది. వజ్ర బస్సులన్నీ ఎయిర్‌ కండీషన్‌ సదుపాయంతో ఉన్నవే. దీంతో వాటిని వాడాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మందుల సరఫరా సాధారణంగానే ఉన్నా, కోవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత భారీగా వాహనాల అవసరం ఉంటుంది. అంత డిమాండును తట్టుకునేలా బస్సులు సిద్ధం చేయగల సామర్థ్యం ఉందా అని ఎయిర్‌కార్గో ప్రశ్నించింది. సాధారణ మందులకు 15– 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే సరిపోతుంది. కానీ వ్యాక్సిన్‌కు 4 డిగ్రీలలోపే ఉండాలి. దీంతో నిపుణుల ఆధ్వర్యంలో వజ్ర బస్సుల ఫిట్‌నెస్, ఏసీ పనితీరును పరిశీలింపచేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. వ్యాక్సిన్‌ విషయంలో ఈ బస్సుల ఏసీ సామర్ధ్యం సరిపోదని తేలితే.. ఇతర మందులు, పండ్ల సరఫరాకు వాడతారు. 

ప్రయాణికుల సేవల నుంచి ఔట్‌
హైదరాబాద్‌లోని కాలనీల నుంచి వరంగల్, నిజామాబాద్, రామగుండం లాంటి పట్టణాలకు మినీ ఏసీ బస్సులను నడిపితే బాగుంటుందనే సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఆర్టీసీ దశలవారీగా వంద వజ్ర బస్సులను సమకూర్చుకుంది. కానీ జనాదరణ లేకపోవడంతో ఈ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. (చదవండి: మౌత్‌వాష్‌తో కరోనా కంట్రోల్‌)

మరిన్ని వార్తలు