చాన్స్‌ మిస్‌.. ఆధార్‌ లేకపాయే.. ఆర్టీసీ ఆఫర్‌ ఆగమాయే..

9 Mar, 2022 20:16 IST|Sakshi
సత్తుపల్లి డిపో నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో మహిళలు

మహిళా దినోత్సవం సందర్భంగా అరవై ఏళ్లు పైబడిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మంగళవారం ఉచిత ప్రయాణం ఆఫర్‌ ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై పెద్దగా ప్రచారం చేయకపోవడంతో చాలా మందికి తెలియలేదు. దీనికి తోడు ఉదయం ఒకరిద్దరు ఈ విషయమై అడిగినా తమకేం ఆదేశాలు రాలేదని కండక్టర్లు చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆర్‌ఎం ఆదేశాలతో కండక్టర్లు అనుమతించినప్పటికీ.. అవగాహన లోపంతో చాలా మంది మహిళలు ఆధార్‌ కార్డులు వెంట తెచ్చుకోలేదు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలు

ఆధార్‌ కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణమని, లేకపోతే టికెట్‌ తీసుకోవాల్సిందేనని చెప్పడంతో ఆఫర్‌ మిస్‌ అయినట్లయింది. ఆర్భాటంగా ఆఫర్‌ ప్రకటించిన ఆర్టీసీ అధికారుల.. రెండు, మూడు రోజుల ముందు నుంచి ప్రచారం చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమైంది. కాగా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ‘సాక్షి’ జిల్లా కేంద్రంతో పాటు సత్తుపల్లి, మధిర, వైరాల్లో పరిశీలించగా.. ఎక్కువ మంది ఉపయోగించుకోలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
– ఖమ్మం మామిళ్లగూడెం / వైరా / సత్తుపల్లి టౌన్‌ / మధిర రూరల్‌

టికెట్‌ తీసుకోక తప్పలేదు..
నాకు ఫించన్‌ కూడా వస్తుంది. వయస్సు ఎప్పుడో 60 ఏళ్లు దాటింది. కానీ గుర్తింపు కార్డు తెచ్చుకోవటం మర్చిపోయాను. దీంతో కండక్టర్‌ కార్డు ఉంటేనే ఆఫర్‌ ఉంటుందన్నారు. ఇక టికెట్‌ తీసుకోక తప్పలేదు.            
– చింతలపాటి వరమ్మ, సత్తుపల్లి 

ముందే చెబితే బాగుండు..
వరంగల్‌ వెళ్దామని బస్సు ఎక్కా. ప్రయాణంలో ఆఫర్‌ ఉందని బస్సులోకి ఎక్కాక చెప్పారు. తీరా చూస్తే నా దగ్గర గుర్తింపు కార్డు లేదు. ప్రభుత్వం కల్పించిన ఆఫర్‌ వాడుకోలేకపోయా. ఇలాంటివి ముందే చెబితే బాగుండేది. 
– మాదాసి లక్ష్మమ్మ, సత్తుపల్లి


వైరా నుంచి మధిర..
అరవై ఏళ్లు నిండిన మహిళలకు మహిళా దినోత్సవ కానుకగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కానుక బాగుంది. నేను వైరా నుంచి మధిర వరకు ప్రయాణించా. ఇంకా ఎక్కువ మందికి తెలియజేస్తే ఆధార్‌ కార్డు తెచ్చుకునేవారు.
– గంగసాని అరుణ, బ్రాహ్మణపల్లి, మధిర 

ఆనందంగా ఉంది
మహిళా దినోత్సవం సందర్భంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉంది. ముందుగా తెలియడంతో ఆధార్‌కార్డు తెచ్చుకున్నా. కండక్టర్‌ను చూపించి మధిర నుంచి రాపల్లికి వెళ్లా.
– వాసిరెడ్డి రజిని, రాపల్లి 

అభినందనీయం
మహిళలను గౌరవించడం సంప్రదాయం. మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అభినందనీయం. వయోవృద్ధులైన మహిళలకు బస్సులు, బస్టాండ్లలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
– గరిక సరోజిని, గంపలగూడెం 

కార్డు తెచ్చుకోలే..
ఆర్టీసీ బస్సులో ఈరోజు ఉచితంగా వెళ్లొచ్చని నాకు తెలియదు. ఈ విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఆధార్‌కార్డు తెచ్చుకోలేదు. ఆధార్‌కార్డు ఉంటేనే టికెట్‌ లేకుండా ప్రయాణించొచ్చని కండక్టర్‌ చెప్పాడు. దీంతో టికెట్‌ కొన్నా.            
– కరి కమల, అనాసాగరం 

ఆధార్‌ అడగలేదు 
నేను బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కండక్టర్‌ టికెట్‌ కొట్టా రు. ఆధార్‌కార్డు ఉందా అని కానీ ఇతర గుర్తింపు కార్డులు ఉన్నాయా అని కానీ అడగలేదు. దీంతో టికెట్‌ తీసుకునే ప్రయాణం చేశాను. ఆ తర్వాత ఆఫర్‌ ఉందనే విషయం తెలిసింది.            
– స్వరూప, ప్రయాణికురాలు

ఆధారాలు లేకపోవడంతోనే...
అరవై ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇందుకోసం ఆధార్‌ కార్డు.. ఇతర గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఎక్కువ మంది కార్డులు లేకుండా రావడంతో టికెట్‌ తీసుకోవాల్సి వచ్చింది.                      
– సోలోమన్, రీజియన్‌ మేనేజర్‌ 
(ఇది చదవండి: వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే!)

మరిన్ని వార్తలు