ఆర్టీసీలో మళ్లీ కార్మిక సంఘాల ఉద్యమబాట

28 Feb, 2022 03:56 IST|Sakshi

జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ 

త్వరలో ధర్నాలు, డిపోల ముందు నిరసనలు 

బకాయిలు చెల్లించకపోవడంపై కార్మికుల ఆగ్రహం 

పని భారం పెంచి వేధిస్తున్నారని ఆరోపణలు

టీఎంయూ గూటికి అశ్వత్థామరెడ్డి.. గౌరవాధ్యక్షుడిగా ఎంపిక

సాక్షి, హైదరాబాద్‌: ‘దీర్ఘకాలంగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీ కార్మికులను ఆర్థికంగా కుంగదీస్తున్నారు. కార్మిక సంఘాల అస్థిత్వం ఆర్టీసీలో లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోంది. సంఘాలు లేవని కార్మికులపై పనిభారం పెంచి వేధిస్తున్నారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబీకులకు కారుణ్య నియామక వెసులుబాటు వర్తించకుండా చేస్తున్నారు. ఇక ఈ నిర్లక్ష్యాన్ని సహించం. రోడ్డెక్కి ఉద్యమిస్తాం’ అని ఆర్టీసీ సంఘాలు హెచ్చరించాయి.

దాదాపు రెండున్నరేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు మళ్లీ రోడ్డెక్కి ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ) పేరుతో ఉద్యమానికి సిద్ధమయ్యాయి. గతంలో గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఉండి సీఎం ఆగ్రహానికి గురై ఆర్టీసీకి దూరమైన అశ్వత్థామరెడ్డి మళ్లీ టీఎంయూ గూటికి చేరారు.

ఆదివారం టీఎంయూ కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన్ను సంఘం గౌరవాధ్యక్షుడిగా తిరిగి ఎంపిక చేశారు. ఆయన ఆధ్వర్యంలో సంఘం ఉద్యమబాట పట్టనుందని తెలుస్తోంది. ఉద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నట్టు అశ్వత్థామరెడ్డి తెలిపారు.

బాండ్ల తాలూకు చెల్లింపులేమాయె? 
గతంలో జరిగిన వేతన సవరణ బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించేందుకు జరిగిన ఒప్పందం అమలు కాలేదు. 2020 అక్టోబర్‌తో గడువు ముగిసి నా బాండ్ల తాలూకు చెల్లింపులు జరగకపోవటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒక్కొక్కరికి రూ. లక్షన్నరకు తగ్గకుండా లబ్ధి చేకూరాల్సి ఉన్నా అందకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

2019 నుంచి అందాల్సిన 6 డీఏలనుకూడా వర్తింప చేయ కపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. 1,200 కుటుంబాలకు కారుణ్య నియామకాల రూ పంలో ఉద్యోగావకాశాలు రావాల్సి ఉన్నా అమలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలను మనుగడలో లే కుండా చేసినందుకే ఉద్యోగులకు అన్యా యం జరుగుతోందని ఆరోపిస్తూ ఇప్పుడు అన్ని సంఘాలు సంయుక్తంగా ఉద్యమబా ట పడుతున్నాయి.

అన్ని ప్రధాన సంఘాల తో కూడిన జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఇప్పటికే దీక్ష జర గాల్సి ఉన్నా పోలీసు అనుమతి రాక వాయి దా పడింది. త్వరలో డిపోల ముందు నిరసన ప్రదర్శనలు, నల్లబ్యాడ్జీలతో నిరసనలు వరుసగా చేయాలని నిర్ణయించారు. ఇటీవల బల్క్‌ డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచడాన్నీ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మునుపటి ధరలకే డీజిల్‌ అందేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు