అర్ధరాత్రి కరెంట్‌ కట్‌ చేస్తాం..

20 Jul, 2022 02:43 IST|Sakshi

బిల్లు చెల్లించాలని సైబర్‌ మోసగాళ్ల ఫోన్లు/మెసేజ్‌లు

బ్యాంకు ఖాతాలు, కార్డుల వివరాల సేకరణ, నగదు డ్రా

నమ్మి మోసపోవద్దని కోరిన టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ‘విద్యుత్‌ బిల్లులు చెల్లించాలి, లేకుంటే రాత్రిపూట విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేస్తామని’ పేర్కొంటూ వినియోగదారులకు కొందరు వ్యక్తులు ఎస్‌ఎంఎస్‌లు/ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిని నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు, డిబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డుల సమాచారం, ఓటీపీలను తెలపవద్దని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో కోరారు.

ఎవరైనా ఈ సమాచారం అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సైబర్‌ మోసగాళ్లు వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను డ్రా చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. విద్యుత్‌ బిల్లుల వసూళ్లు/ చెల్లింపుల కోసం తమ సిబ్బంది వినియోగదారుల బ్యాంకు అకౌంట్, డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డుల వివరాలు అడగరని స్పష్టం చేశారు.

బిల్లు చెల్లించిన రసీదు మాత్రమే అడుగుతారని, బిల్లు చెల్లింపులు జరపడానికి ఎలాంటి వెబ్‌సైట్‌ లింకులను ఎస్‌ఎంఎస్‌ ద్వారా తాము పంపమని స్పష్టం చేశారు. బిల్లు చెల్లించినా, విద్యుత్‌ బిల్లు పెండింగ్‌ ఉందని ఎవరైనా వ్యక్తులు ఫోన్‌/మెసేజ్‌ చేస్తే.. బిల్లుల చెల్లింపు వివరాలను సంస్థ వెబ్‌ సైట్‌ www. tssouthernpower. com లేదా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌లో చెక్‌చేసుకోవచ్చని సూచించారు. ఏమైనా తేడాలుంటే ఆన్‌లైన్‌ ద్వారా సంస్థను లేదా సంబంధిత సెక్షన్‌ ఆఫీసర్‌(అఉ)ని సంప్రదించి సరిచూసుకోవాలని కోరారు.  

మరిన్ని వార్తలు