పసుపు ధర పైపైకి..

4 Sep, 2020 12:21 IST|Sakshi

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): సీజన్‌ కాని వేళలో పసుపు పంటకు ధర పెరుగుతోంది. పసుపు పంటను నిలువ ఉంచుకున్న వ్యాపారులు, స్టాకిస్టులకు ప్రయోజనం కలిగేలా ధర పెరుగుతూ పోతుంది. పసుపు పంటకు ఇప్పుడు ధర పెరగడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. వారం రో జుల కింద పసుపు పంటకు క్వింటాలుకు రూ. 5,500 ఉన్న ధర ఇప్పుడు రూ. 6,100కు చేరింది. వారం రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 600ల ధర పెరగడం విశేషం. కరోనా ప్రభావంతో నిజామాబాద్‌లోని వ్యవ సాయ మార్కెట్‌లో కొద్దిరోజులు వ్యాపార లావా దేవీలు స్తంభించిపోయాయి. ఇటీవలే పరిస్థితి మెరుగు అవుతుండగా పసుపు పంటకు కొంత ధర పెరిగింది. పసుపు పంటకు సీజన్‌లో క్వింటాలుకు రూ. 5 వేలకు మించి ధర లభించలేదు.

మహారాష్ట్ర నుంచి పసుపు నిజామాబాద్‌ మార్కెట్‌కు దిగుమతి కావడం, ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు ఆశించిన విధంగా ఎగుమతులు లేకపోవడంతో గడిచిన సీజన్‌లో రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లోనూ పసుపు పంటకు ధర లభించకపోవడం రైతులను కుంగదీసింది. గతంలో కూడా అన్‌సీజన్‌లో పసుపు ధర పెరగడాన్ని గమనించిన కొందరు రైతులు కోల్డ్‌స్టోరేజీలలో పసుపును నిలువ ఉంచారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మార్కెట్‌ మూతబడడంతో రైతులు తక్కువ ధరకే విక్రయించుకుని నష్టపోయారు. కాగా ఇప్పుడు ఉన్న స్థితిలో పసుపు పంటకు ధర పెరగగా ఇదే ధర కొనసాగుతుందా లేదా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ధర ఇలాగే ఉంటే రానున్న సీజన్‌లో పసుపు సాగు చేసిన వారికి కొంతైనా ఊరట లభించినట్లు అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలి 
పసుపు పంటకు మార్కెట్‌లో ఎప్పుడైనా డిమాండ్‌ ఒకేలా ఉంది. కానీ వ్యాపారులే ధరను తగ్గిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పసుపు పంటకు ధర క్షీణించకుండా చర్యలు తీసుకోవాలి. ధర నియంత్రణపై దృష్టి సారించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. 
– బూత్‌పురం మహిపాల్, రైతు, మోర్తాడ్‌ 

మరిన్ని వార్తలు