ఏడాదిలోగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు

8 Mar, 2021 02:37 IST|Sakshi
ఆదివారం జలవిహార్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో అల్లం నారాయణ 

టీయూడబ్ల్యూజే సమావేశంలో మంత్రి కేటీఆర్‌ హామీ 

రూ.100 కోట్ల కార్పస్‌ఫండ్‌తో జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం 

కేంద్రం అన్యాయం చేస్తుంటే నోరు మెదపరేమని బీజేపీ నేతలకు నిలదీత 

మాట్లాడటం మొదలుపెడితే కేసీఆర్‌ను తట్టుకోవడం కష్టమని హెచ్చరిక 

సాక్షి, హైదరాబాద్‌: ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల సమస్య తీరుస్తానని, ఇది తన హామీ అని మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఆదివారం తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (టీయూడబ్ల్యూజే (హెచ్‌–143)) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో జర్నలిస్టులకు రూ.54 కోట్ల కార్పస్‌ ఫండ్‌ కేటాయించిన ఘనత కేసీఆర్‌ సర్కారుదేనన్నారు. త్వరలోనే దీన్ని రూ.100 కోట్లకు చేర్చేలా కృషి చేస్తామన్నారు. ఉద్యమ సమయంలో మా వెంట నిలిచిన విద్యార్థులు, లాయర్లు, జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికే మీడియా అకాడమీకి రూ.15 కోట్ల వ్యయంతో ఐదంతస్తుల భవనం కూడా సిద్ధం చేస్తున్నామన్నారు.

విధి నిర్వహణలో మరణించిన 260 మంది విలేకరుల కుటుంబానికి రూ.లక్ష చొప్పున, అనారోగ్యంతో పనిచేయలేని విలేకరుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. మరణించిన విలేకరుల పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యనందిస్తామని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో 1,950 మందికి రూ.20 వేల చొప్పున ఇచ్చి ఆదుకున్నామని మంత్రి గుర్తుచేశారు. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాల్లోనూ అక్రెడిటేషన్లు 3,000 దాటలేదని, కేవలం తెలంగాణలోనే 19,150 మందికి ప్రభుత్వం అక్రెడిటేషన్‌, వైద్య సదుపాయాలు కల్పించి గుర్తించిందన్నారు. త్వరలోనే మీ అందరికీ యూనియన్‌  కార్యాలయం కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు.  

నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం... 
ఏడేళ్లలో తాము అన్ని ఎన్నికలు గెలిచామని, ఒక్క దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచి కొందరు విర్రవీగుతున్నారని బీజేపీని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఉద్దేశించి అన్నారు. తాము కూడా మోదీ, అమిత్‌షాలను విమర్శించగలమని.. కానీ, పదవులకు గౌరవమిస్తున్నామని పేర్కొన్నారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ అని, అది కాల్పులతో గర్జించడం మొదలుపెడితే ప్రత్యర్థులు తట్టుకోలేరన్నారు. తాను, ఈటల రాజేందర్, హరీశ్‌రావు ఎంతో మాట్లాడగలమని హెచ్చరించారు. ఉద్యమ సమయంలోని కేసీఆర్‌ వాగ్ధాటి మళ్లీ బయటికి వస్తే ఆయన్ను ఎదుర్కోవడం ఎవరితరం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా వివిధ శాఖల్లో ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలిచ్చామని, త్వరలోనే 55 వేల కొలువులకు నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు.

మోదీ ఒక్కో జన్‌ధన్‌ ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు, ఏడాదికి ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలెక్కడ అని నిలదీశారు. కేంద్రం తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయమే చేస్తోందన్నారు. ప్రశ్నించే గొంతులని చెప్పుకునే రాష్ట్ర బీజేపీ నేతలు దీనిపై నోరుమెదపడం లేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ప్రభుత్వాన్ని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో మరణించిన విలేకరుల కుటుంబాలకు కేటీఆర్‌ చెక్కులను అందజేశారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌  అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్‌ అకాడమీ, ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు.  

మరిన్ని వార్తలు