ప్రత్యామ్నాయ పంటలపై సర్టిఫికెట్‌ కోర్సులు

25 Dec, 2021 02:23 IST|Sakshi

ఉద్యాన వన వర్సిటీ నిర్ణయం

సాక్షి, సిద్దిపేట: యాసంగిలో వరి వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటలు వేయాలన్నదానిపై రైతులు ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో రైతులకు సాయపడేందుకు వ్యవసాయ శాఖ నడుంబిగించింది. ఇందులో భాగంగా రైతులకు కొత్త రకాల పంటలపై అవగాహన పెంచేందుకు తెలంగాణ ఉద్యాన వన విశ్వవిద్యాలయం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా వివిధ పంటల విధానంపై ముఖ్యంగా యువ రైతులకు సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది.

విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 పరిశోధన స్థానాలు, రెండు పాలిటెక్నిక్‌లు, రెండు బోధన కళాశాలలు, ఒక కృషి విజ్ఞాన కేంద్రం కొనసాగుతున్నాయి. తొలుత రెండు పరిశోధనా స్థానాల్లో మూడు సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. కూరగాయల సాగు, పూల మొక్కల పెంపకంపై రెండు కోర్సులను రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పరిశోధన స్థానంలో, అయిల్‌ పామ్‌ పెంపకం, నిర్వహణపై ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలోని పరిశోధన స్థానంలో శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రతి బ్యాచ్‌లో 20 మందికి శిక్షణ ఇస్తారు. ఈ కోర్సుల్లో థియరీతో పాటు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. అలాగే స్టడీ మెటీరియల్‌ సైతం అందించనున్నారు. ఒక్కో కోర్సులో 20 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ కోర్సులకు నామమాత్రపు ఫీజు వసూలు చేయనున్నారు. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించనున్నారు. జనవరి మొదటివారంలో ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరిస్తామని యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ బి.నీరజ ప్రభాకర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు