‘ఎన్డీయే.. నో డేటా అవైలబుల్‌’

2 Mar, 2021 03:44 IST|Sakshi

కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రం

మంత్రి కేటీఆర్, రామచంద్రరావు మధ్య ట్వీట్ల సవాళ్లు

లక్ష కొలువులపై చర్చకు రావాలని రామచంద్రరావు సవాల్‌

ఎన్డీఏ హామీ ఇచ్చిన 12 కోట్ల ఉద్యోగాల డేటా వెతుకుతున్నా అంటూ కేటీఆర్‌ ఘాటు రిప్లై

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటు విమర్శలు చేశారు. ‘ఎన్డీయే అంటే నో డేటా అవైలబుల్‌’ అని ఎద్దేవా చేశారు.తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న టీఆర్‌ఎస్‌ ప్రకటనపై.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉస్మానియా వర్సిటీకి వెళ్లిన బీజేపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌ రామచంద్రరావు గ్రాడ్యుయేట్లను ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ చేస్తూ ట్వీట్‌ పెట్టారు.

‘‘నేను ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ దగ్గర ఉన్నాను. కేటీఆర్‌ మీరు ఎక్కడున్నారు? రాష్ట్రంలో లక్ష కొలువుల కల్పనపై చర్చకు రండి’’ అని పోస్టు చేశారు. దీనికి మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘‘గౌరవనీయులు ప్రధాని మోదీ హామీ ఇచ్చిన 12 కోట్ల ఉద్యోగాలు (ఏడాదికి రెండు కోట్లు చొప్పున), పేదల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామన్న హామీలకు సంబంధించిన సమా చారాన్ని సేకరించడంలో బిజీగా ఉన్నా.. ఇప్పటి వరకు సమాధానం ‘ఎన్డీఏ’ అని వస్తోంది. ఎన్డీఏ అంటే ‘నో డేటా ఎవైలబుల్‌’ (ఎలాంటి సమా చారం అందుబాటులో లేదు). మీ దగ్గర సమాధా నాలు ఉంటే మాకు ఇవ్వండి’’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.ఈ ట్వీట్లు ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి.

మంత్రి కేటీఆర్‌తో ఫ్రెంచ్‌ రాయబారి భేటీ
ఫ్రెంచ్‌ రాయబారి ఎమాన్యు యేల్‌ లీనెయిన్‌ ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావుతో సోమవారం ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఫ్రెంచ్‌ కాన్సుల్‌ జనరల్‌ మార్జోరీ వంబేలింగమ్, ఐటీ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు