Basara IIIT: గంజాయి కలకలం.. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు

21 Aug, 2022 10:22 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: బాసర ట్రిపుల్‌ ఐటీలో గంజాయి తాగుతూ విద్యార్థులు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. కళాశాలలోని బాయ్స్‌ హాస్టల్‌–1లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా, శనివారం బాసర పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి, కరీంనగర్‌ జిల్లాకు చెందిన మరో విద్యార్థి తమ హాస్టల్‌ రూమ్‌లో శుక్రవారం గంజాయి తాగుతూ సిబ్బందికి పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు ముధోల్‌ సీఐ వినోద్‌రెడ్డి తెలిపారు. ఈ విద్యార్థుల నుంచి 100 గ్రాములకుపైగా గంజాయి లభ్యమైనట్లు సమాచారం.  

ఎలా వచ్చింది?  
స్థానికంగా కళాశాలలో డీఎస్పీ, సీఐతోపాటు 200 మందికిపైగా సెక్యూరిటీ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఇంత భద్రత నడుమ కళాశాలలోకి గంజాయి ఎలా వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సెలవులపై ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమతోపాటుగా గంజాయిని తెచ్చుకున్నారా? లేక స్థానికంగా పనిచేస్తున్న సిబ్బంది ఎవరైనా సరఫరా చేస్తున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.  

విషయం బయటకు పొక్కకుండా 
హాస్టల్‌ గదిలో విద్యార్థులు గంజాయి తాగుతున్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్న సిబ్బంది వారి రూమ్‌ను తనిఖీ చేశారు. గంజాయి తాగుతున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత విషయం బయటకు రాకుండా జాగ్రత్త వహించారు. తనిఖీ చేస్తున్న సమయంలో స్థానికంగా సిబ్బందికి సెల్‌ఫోన్‌ కూడా అనుమతించకుండా గోప్యత వహించారు. కానీ చివరకు విషయం బయటపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: Hyderabad: మట్టి  ప్రతిమలకే జై కొడుతున్న నగరవాసులు

 

మరిన్ని వార్తలు