‘ఆర్టీసీ’ రెఫరల్‌ బిల్లులు తడిసిమోపెడు

11 Oct, 2021 01:57 IST|Sakshi

సాలీనా రూ.30 కోట్ల వరకు ప్రైవేట్‌ ఆస్పత్రులకు చెల్లింపు 

ఆర్టీసీ ఆస్పత్రిలో వసతులు లేకనే ఈ దుస్థితి 

దాన్ని సమూలంగా మార్చే దిశలో ఎండీ సజ్జనార్‌ యోచన 

ఆస్పత్రి స్థాయి పెంచటం ద్వారా ఆ భారాన్ని వదిలించుకునేలా చర్యలు 

ఆ మిగిలే మొత్తంతో ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఆస్పత్రిలో సేవలు

సాక్షి, హైదరాబాద్‌: తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో కోవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.2 కోట్లు ఖర్చవుతాయని అధికారులు ఇటీవల అంచనా వేశారు. ఆక్సిజన్‌ పైపులైన్‌ ఏర్పాటు చేసి, ఆ తర్వాత చేతులెత్తేశారు. నిధుల సమస్యతో ఆ పని అప్పట్లో ఆగిపోయింది. ఈ ఆస్పత్రిలో వసతులు లేక ముఖ్య చికిత్సలను ఇతర ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేయిస్తున్నారు. దీనికి రెఫరల్‌ బిల్లులు సగటున నెలకు రూ.2.5 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది.

అంటే.. ఒక నెల రెఫరల్‌ బిల్లుతో కోవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు పనులు పూర్తయి ఉండేవి. ఈ రెఫరల్‌ బిల్లులే ఆర్టీసీని ఆస్పత్రిని నిలువునా ముంచుతున్నాయి. సగటున సాలీనా రూ.30 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుండటంతో ఆస్పత్రి అభివృద్ధికి విఘాతం ఏర్పడుతోంది. ఒక సంవత్సరం చెల్లించే రెఫరల్‌ బిల్లులతో ఆస్పత్రిని పూర్తిగా ఆధునికీకరించి అన్ని వసతులు సమకూర్చే అవకాశం ఉంది. వసతులు మెరుగుపరిచాక ఇక ప్రైవేటు ఆస్పత్రులకు రోగులను పంపాల్సిన అవసరం ఉండదు (అత్యవసరమైతే తప్ప).

కొత్త ఎండీ సజ్జనార్‌ ఇటీవల ఆస్పత్రి పరిస్థితిని సమీక్షించినప్పుడు ఈ అనవసర భారం ఆయన దృష్టికొచ్చింది. వెంటనే రెఫరల్‌ ఖర్చుల పీడ వదిలించాలని నిర్ణయించారు. అది జరిగాక మిగిలే మొత్తాన్ని, ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఈ ఆసుపత్రిలో చికిత్సలు చేయించే వెసులుబాటు కలిగించాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.  

ఇదీ సంగతి.. 
ఆర్టీసీలో పనిచేసే 49 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆస్పత్రే ఏకైక దిక్కు. జిల్లాల్లో డిస్పెన్సరీలున్నా.. వాటిల్లో పెద్దపెద్ద చికిత్సలకు వీలులేదు. ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య సమస్య వస్తే తార్నాకలోని ఆస్పత్రికి రావాల్సిందే. దీన్ని గతంలో అన్ని వసతులు ఉండేలా నిర్మించారు. ఇక్కడ మంచి చికిత్స అందుతుందన్న పేరు కూడా ఉంది. కానీ, కొన్నేళ్లుగా దీనిపై దృష్టి సారించకపోవడం, అవసరమైన మార్పులు చేయకపోవడం, చాలినన్ని నిధులు కేటాయించకపోవటంతో అది క్రమంగా కొరగాకుండా పోతూ వచ్చింది.

చివరకు మందుల కొనుగోలుకు కూడా కొరత ఏర్పడే దుస్థితిలోకి చేరింది. ఇక ఆస్పత్రి నిర్వహణ సాధ్యం కాదని ఆర్టీసీ చేతులెత్తేసి దాన్ని వదిలించుకునే ఆలోచనకు రావాల్సి వచ్చింది. ఇక్కడ గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స చేసే వీలు లేకుండా పోయింది. సంబంధిత వైద్యులు లేరు. దంత, కంటి, ఆర్థో, జనరల్‌ ఫిజీషియన్, సర్జరీ విభాగాల్లో కూడా వైద్యులు చాలినంత మంది లేరు. దీంతో రోగులను ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయించాల్సి వస్తోంది.

ఈ మేరకు గతంలో 20 ప్రైవేటు ఆస్పత్రులతో ఆర్టీసీ అవగాహన కుదుర్చుకుంది. ఇలా చూస్తుండగానే ఏడాదికి రూ.30 కోట్ల మేర రెఫరల్‌ బిల్లులు చెల్లించాల్సి రావటంతో అది ఆర్టీసీ సంస్థకు పెద్ద భారంగా మారి సకాలంలో చెల్లించకుండా బకాయి పెడుతూ వస్తోంది. ఇప్పటికీ దాదాపు రూ.50 కోట్ల వరకు బకాయిలున్నాయి. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి చూసి కొన్ని ఆస్పత్రులు ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నాయి. చివరకు ఇక్కడ కొన్ని రకాల వైద్య పరీక్షలకు కూడా వసతులు లేక ప్రముఖ ల్యాబ్‌లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. బిల్లు బకాయిలతో ఇటీవలే ఓ ప్రముఖ ల్యాబ్‌ తప్పుకుంది. 

ఉద్యోగుల తల్లిదండ్రులకూ... 
ఈ మొత్తం వ్యవహారంపై కొత్త ఎండీ సజ్జనార్‌ ఇటీవల వివరాలు తెప్పించుకుని అధికారులతో చర్చించారు. ఆస్పత్రిలో వసతులు మెరుగుపరిచేందుకు ఆయన తొలినుంచి దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే ఆయన ఆస్పత్రిని సందర్శించారు. ఆ తర్వాత పది రోజుల్లో మూడు పర్యాయాలు ఆస్పత్రికి వెళ్లారు. ఇప్పుడు రెఫరల్‌ బిల్లు బెడద వదిలించుకునే దిశలో చర్యలు ప్రారంభించారు.

ఆస్పత్రిలో వసతులు మెరుగుపరిస్తే వీటి అవసరం ఉండదని నిర్ధారణకు వచ్చి ఆయన అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. నిధులు సమకూర్చే విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ, త్వరలో కొలిక్కి రావటం ఖాయంగా కనిపిస్తోంది. రెఫరల్‌ బిల్లుల చెల్లింపు అవసరం లేకుంటే సాలీనా రూ.30 కోట్ల వరకు ఆదా అవుతుంది. అప్పుడు ఆ మొత్తంతో ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఆస్పత్రి సేవలు అందించేలా చేయాలని ఆయన యోచిస్తున్నారు. అది చికిత్సల వరకు ఉంటుందా, వైద్య పరీక్షలకు పరిమితమవుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.   

మరిన్ని వార్తలు