కుప్పకూలిన ట్రైనీ విమానం

27 Feb, 2022 02:13 IST|Sakshi

నల్లగొండ జిల్లా తుంగతుర్తి దగ్గర ప్రమాదం

మహిళా శిక్షణ పైలట్‌ దుర్మరణం

పెద్దవూర/విజయపురిసౌత్‌: నల్లగొండ జిల్లాలో ఓ శిక్షణ విమానం కుప్పకూలింది. పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. విమానంలోని మహిళా శిక్షణ పైలట్‌ సంఘటన స్థలంలోనే మృతి చెందారు.  

టూ సీటర్‌ సెస్నా 152 విమానంలో..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా రైట్‌ బ్యాంక్‌ సమీ పంలో ఫ్లైటైక్‌ ప్రైవేట్‌ ఏవియేషన్‌ అకాడమీలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహిమా గజరాజ్‌ (29) శిక్షణ పొందుతున్నారు. టూ సీటర్‌ సెస్నా–152 ట్రైనీ ఎయిర్‌ క్రాఫ్ట్‌తో శనివారం ఉదయం 10.30 గంటలకు శిక్షణ కేంద్రం నుంచి సింగిల్‌గా బయలుదేరారు. టేకాఫ్‌ అయిన 30 నిమిషాల్లోనే కూలిపోయింది. విమానం శకలాలు వంద మీటర్ల దూరంలో పడిపో యాయి. పైలట్‌ అక్కడికక్కడే మృతిచెందారు. 

చెట్లను తాకే ఎత్తులో చక్కర్లు కొట్టి..
రామన్నగూడెం, ముత్యాలమ్మగుడి స్టేజీ మీదుగా 10 నిమిషాలకు పైగా చెట్లను తాకే ఎత్తులో నాలుగైదు సార్లు విమానం చక్కర్లు కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత వ్యవసాయ బావి పక్కనున్న సుబాబుల్‌ చెట్టు పైభాగంలో ఉన్న ఆకులను తాకుతూ పైకి లేచిందని, తర్వాత 30 సెకన్లలోనే రెండు హై టెన్షన్‌ విద్యుత్‌ స్తంభాల మధ్య విద్యుత్‌ తీగల కిందుగా వెళ్లి కూలిపోయిందని వివరించారు.

దగ్గర్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న గ్రామ వీఆర్‌ఏ ప్రమాదం విషయాన్ని స్థానిక తహసీల్దార్, పోలీసులకు తెలిపారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఘటన స్థలాన్ని పరిశీలించారు. గాలిలో చక్కర్లు కొడుతూ భూమిని వేగంగా తాకి పెద్ద శబ్దంతో విమానం కూలిందని ఎస్పీ తెలిపారు. విమానం సాంకేతిక లోపంతో కూలిందా, మరేదైనా కారణమా డీజీసీఏ విచారణలో తేలుతుందన్నారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారని తెలిపారు. 

ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం: విమానం శిథిలాల కింద పైలట్‌ మృతదేహం మాంసం ముద్దగా మారింది. సాయంత్రం 4 గంటలకు ట్రాక్టర్‌తో శిథిలాలను పక్కకు తొలగించి మృతదేహాన్ని బయటికి తీశారు. సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం చేశారు. తర్వాత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలికి భర్త, తల్లి ఉన్నారు. వారితో కలిసి రైట్‌బ్యాంకులోనే ఉంటున్నారు. మహిమ మరణ వార్త తెలుసుకొని భర్త పరందామ కన్నీరుమున్నీరుగా విలపించారు. వీరికి 2017లో వివాహం అయినట్లు తెలిసింది.

డీజీసీఏ బృందం పరిశీలన: ఎయిర్‌ క్రాఫ్ట్‌ కూలిపోయిన ప్రదేశాన్ని హైదరాబాద్‌ నుంచి వచ్చిన డీజీసీఏ ప్రత్యేక బృందం అధికారులు పరిశీలించారు. కూలిపోయిన విధానాన్ని ప్రత్యక్ష సాక్షులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి డీజీసీఏ ప్రత్యేక బృందం రానున్నట్లు తెలిసింది. మరోవైపు విజయపురి సౌత్‌లోని ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ ఆకాడమీని గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్, ఆర్డీవో పార్థసారథి తనిఖీ చేశారు. ఫ్లైటెక్‌లోని రికార్డులు, విమానలకు సంబంధించి అనుమతి పత్రాలను పరిశీలించి విచారణ చేపట్టారు. 

విమానంతో సిగ్నల్స్‌ తెగిపోయాయి: ఫ్లైటెక్‌ సీఈవో   
ఫ్లైటెక్‌ శిక్షణ కేంద్రంలో 6 నెలల క్రితం ట్రైనీ మహిళా పైలట్‌గా మహిమా గజరాజ్‌ చేరారు. ఆమె ఇప్పటివరకు 85 గంటలు విమానంను నడిపారని, ఇందులో 25 గంటలు సింగిల్‌గా నడిపిన అనుభవం ఉందని సంస్థ సీఈవో మమత తెలిపారు. టేకాఫ్‌ అయిన 15 నిమిషాల తర్వాత ఎయిర్‌ క్రాఫ్ట్‌తో సిగ్నల్స్‌ తెగిపోయా యన్నారు.

ఫ్లైటెక్‌ 2009లో ప్రారంభం
నాగార్జునసాగర్‌లోని విజయపురి సౌత్‌లో 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పైలట్‌ శిక్షణ తరగతులను నిర్వహిం చేందుకు అనుమతిచ్చింది. దీంతో ఫ్లైటైక్‌ ఏవి యేషన్‌ అకాడమీకి సంబంధించిన ప్రహరీ, రన్‌వే, హ్యం గర్‌లు నిర్మించారు. 2010లో అధికారులు క్రాస్‌ కంట్రీకి అనుమతులు ఇవ్వటంతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

హైదరాబా ద్‌లోని నాదర్‌గుల్‌ ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి నాగార్జునసాగర్‌కు ట్రైనీ పైలట్‌ ఎయిర్‌క్రాప్ట్‌లో వచ్చి తిరిగి హైదరాబాద్‌కు చేరుకునేవారు. అలాగే ఉదయం నాగార్జునసాగర్‌ ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరుకు క్రాస్‌ కంట్రీ నిమిత్తం ఎయిర్‌క్రాఫ్ట్‌లో బయలుదేరిన మహిమ.. ప్రమాదానికి గురై మృతి చెందారు. సంస్థలో పైలట్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెన్స్‌ ఇంజనీరింగ్, బీఎస్సీ ఏవియేషన్‌కు సంబంధించి సుమారు 60 మందికి పైగా శిక్షణ పొందుతున్నారు.  

మరిన్ని వార్తలు