సరిలేరు మీకెవ్వరు!

26 Dec, 2020 07:55 IST|Sakshi
బైంసా.. ఉదయం పది కావస్తోంది, బైంసా మండంలోని వాలేగాం గ్రామం 

ఒకరిని చూసి నేర్చుకోవడానికి లేదా ఒకరిని చూసి స్ఫూర్తి పొందడానికి వాళ్లు గొప్పగొప్పోళ్లే కానక్కర్లేదు.. చరిత్రను తిరగరాసినోళ్లే అవ్వాల్సిన పనిలేదు.. ఒక దత్తాత్రి, ఒక మహేశ్‌ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు.. స్ఫూర్తినీ పొందవచ్చు.. ఇంతకీ ఎవరు వీరు.. ఈ సామాన్యులు మనకు నేరి్పస్తున్న జీవిత పాఠం ఏమిటి? తెలుసుకోవాలంటే.. చలో నిర్మల్‌ జిల్లా..  

అప్పటికే టీ దుకాణానికి చేరుకున్న  పాలావార్‌ దత్తాత్రికి ఫోన్ల మీద ఫోన్లు.. అవి కూడా వీడియో కాల్స్‌.. అందులోని ఒక వ్యక్తి చేతులతో సైగలు చేశాడు.. వెంటనే దత్తాత్రి వేడివేడి చాయ్, కప్పులు తీసుకుని బైక్‌ మీద బయల్దేరాడు.. ఆర్డర్‌ డెలివరీ చేసి వచ్చాడు.. వినడానికి, చూడటానికి ఏముంది విశేషం అని మనకు అనిపించొచ్చు.. ఉంది.. దత్తాత్రి పుట్టుకతోనే మూగ, చెవుడు. అన్నీ సరిగా ఉండీ.. అబ్బో మనకు కష్టం అనేస్తున్న రోజులివీ.. దత్తాత్రి అలా అనుకోలేదు. ఆరవ తరగతి వరకూ చదువుకున్న అతను ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలని.. సొంతంగా టీ దుకాణం పెట్టుకున్నాడు.. ఇదిగో ఇలా తన వినియోగదారులందరికీ సెల్‌ నంబర్‌ ఇచ్చాడు.. అతని పరిస్థితి తెలిసిన వారు కాబట్టి.. వీడియో కాల్‌ చేసి.. ఎన్ని టీలు కావాలన్నది ఆర్డర్‌ ఇస్తారు. మనోడు వెంటనే డెలివరీ ఇస్తాడు.. రోజుకు వెయ్యి వరకూ సంపాదిస్తానని చెప్పాడు. దత్తాత్రికి మరో ముగ్గురు సోదరులు ఉన్నారు. 2004లో అతడికి వివాహమైంది. తనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నట్లు చెప్పాడు. చదవండి: పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోయి.. ప్రియుడ్ని..

దివ్యాంగ శక్తి ఎంటర్‌ప్రైజెస్‌ షాపు.. పంచగుడి మహేశ్‌.. విస్తర్ల తయారీలో బిజీబిజీగా ఉన్నాడు.. అక్కడ ఉన్న మరికొందరు పర్యావరణహిత ఫినాయిల్, శానిటైజర్లు తయారుచేస్తున్నారు.. వాళ్ల పనిచూస్తే తెలియదు.. వాళ్లను దగ్గరగా చూస్తే తెలుస్తుంది.. దివ్యాంగులని.. ఈ దివ్యాంగ శక్తి ఎంటర్‌ప్రైజెస్‌ స్థాపించిన మహేశ్‌ అంధుడు(95%). మిగిలిన నలుగురూ దివ్యాంగులు! మహేశ్‌ ఒకరిపై ఆధారపడకుండా తాను స్వయం ఉపాధి పొందడమే కాకుండా.. తనలాంటి మరికొందరికి బతకడానికి దారి చూపాడు.. అంతేకాదు.. ముడిసరుకును కూడా దివ్యాంగులకు చెందిన యూనిట్ల నుంచే కొనుగోలు చేస్తాడట.. మహేశ్‌కి ఇద్దరు సోదరులు.. ఒక సోదరుడు శ్రీకాంత్‌ కూడా అంధుడే.. మహేశ్‌ డిగ్రీ  ఫైనలియర్‌ చదువుతున్నాడు.. మరేంటి మహేశ్‌.. చదువుకున్నావుగా.. బ్యాక్‌లాగ్‌ లేదా దివ్యాంగుల కేటగిరీలో ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేకపోయావా అని అడిగితే.. ఏమన్నాడో తెలుసా?   
‘నేను బాగుంటే.. నా కుటుంబం మాత్రమే బాగుంటుంది.. అదే నాతోపాటు నలుగురు బాగుంటే వారి కుటుంబాలు కూడా బాగుంటాయి’’ అని.. 
శెబ్బాష్‌ రా.. మహేశ్‌..
– భైంసా టౌన్‌ 

మరిన్ని వార్తలు