వైద్యుల వాగ్వాదం; ఎగ్జామినర్‌ నేనంటే.. నేను..

27 Apr, 2021 12:48 IST|Sakshi

ఇంటర్నల్‌ ఎగ్జామినర్‌గా ఇద్దరు వైద్యులు నియామకం

గాంధీ ఆర్ధోపెడిక్‌ వైద్యుల మధ్య ముదిరిన అంతర్గత విభేదాలు

ఇబ్బందుల్లో వైద్యవిద్యార్థులు

సాక్షి, గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీ ఆర్ధోపెడిక్‌ విభాగ వైద్యుల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇరువురు వైద్యులను ఇంటర్నల్‌ ఎగ్జామినర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ కావడంతో సోమవారం పరీక్ష కేంద్రంలోనే ఎగ్జామినర్‌ నేనంటే.. నేనని చెప్పడంతో వైద్యవిద్యార్థులు అవాక్కయ్యారు. రంగంలోకి దిగిన కాలేజీ అధికారులు ఆ ఇద్దరు వైద్యులను సముదాయించి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. వివరాలు... ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ పార్ట్‌–2 ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్స్‌ ఈనెల 26వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ నుంచి ఆదేశాలు అందాయి. ఆర్ధోపెడిక్‌ విభాగం పరీక్షల ఇంటర్నల్‌ ఎగ్జామినర్‌గా ప్రొఫెసర్‌ ఎన్‌.రవీందర్‌కుమార్‌ను నియమిస్తూ ఈనెల 24వ తేదీన కేఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌ ఎగ్జామినేషన్‌ డిప్యూటీ రిజిస్టార్‌ డాక్టర్‌ రామానుజరావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రొఫెసర్‌ బీ.వాల్యాను ఎగ్జామినర్‌గా నియమిస్తున్నట్టు  ఈనెల 26వ తేదీన మరో నియామక ఉత్తర్వులు జారీ చేశారు. గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలో  సోమవారం ఉదయం 9.30 గంటలకు వైద్యవిద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో ఎగ్జామినర్‌ నేనే అంటూ ఇద్దరు వైద్యులు వాగ్వాదానికి దిగారు. ఎవరు ఎగ్జామినరో తెలియక వైద్య విద్యార్థులు అయోమయంలో పడ్డారు. రాత్రంతా నిద్రలేకుండా పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యామని, పరీక్ష కేంద్రంలో ఈ రాద్ధాంతం ఏమింటని పలువురు వైద్య­విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 8 రోజులపాటు జరిగే పరీక్షల్లో నాలుగు రోజులకు ఒకరు, మిగిలిన నాలుగు రోజులు మరొకరు ఎగ్జామినర్‌గా వ్యవహరిస్తారని కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ప్రకాశరావు వివరణ ఇచ్చారు.

రెండేళ్ల నుంచి కొనసాగుతున్న విభేదాలు..
గాంధీ ఆర్ధోపెడిక్‌ విభాగంలో వైద్యుల మధ్య రెండేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఆర్ధోపెడిక్‌ హెచ్‌ఓడీగా బీ వాల్య ఉండగా, నిబంధనల ప్రకారం మరో ప్రొఫెసర్‌ సత్యనారాయణ హెచ్‌ఓడీగా నియమితులయ్యారు. గాంధీ ఆస్పత్రి ఆర్ధోపెడిక్‌ విభాగంలోని హెచ్‌ఓడీ రూం విషయమై వైద్యుల మధ్య విభేదాలు ప్రారంభమై తారస్థాయికి చేరుకుని రెండు వర్గాలుగా విడిపోయారు. ఇరువర్గాలు పలుమార్లు గొడవ పడ్డారు. గాంధీ ఆస్పత్రి, కాలేజీ అధికారులు కలుగజేసుకున్నా పరిష్కారం కాలేదు. దీంతో నిరుపేద రోగులతోపాటు వైద్యవిద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు