కుమ్మేసిన కుండపోత: వైరలవుతోన్న ఫోటోలు, వీడియోలు

3 Sep, 2021 09:15 IST|Sakshi

చెరువులను తలపించిన లోతట్టు ప్రాంతాలు

పొంగిపొర్లిన మ్యాన్‌హోళ్లు, డ్రైనేజీలు

వరదనీటిలో నిలిచిపోయిన వాహనాలు

రాత్రి 11 గంటల వరకూ కదలని ట్రాఫిక్‌

విద్యుత్‌ సరఫరాకు గంట సేపు అంతరాయం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో గురువారం రాత్రి పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. కూకట్‌పల్లి, బాలానగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి నగర్, షాపూర్‌నగర్, మూసాపేట, అమీర్‌పేట, మైత్రీవనం, ఎస్‌ఆర్‌ నగర్, మాదాపూర్, సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, పంజాగుట్ట మెట్రో, ఎర్రగడ్డ, శ్రీనగర్‌ కాలనీ, రాజ్‌భవన్‌ రోడ్‌ లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్, ఖైరతాబాద్, హబ్సిగూడ, టోలిచౌకి, సికింద్రాబాద్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ, హిమాయత్‌ నగర్‌ ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కొందరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అవి ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి.

రాత్రి 7.50 నుంచి 9 గంటల వరకు కుంభవృష్టి కుమ్మేసింది. వరదనీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాత్రి 11 గంటల వరకూ రహదారులపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను రోడ్డు క్లియర్‌ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నగరంలో సుమారు వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

రాత్రి 11 గంటల వరకు జూబ్లీహిల్స్‌లో 9.8, మూసాపేటలో 9.6, చందానగర్‌లో 8.8, సరూర్‌నగర్‌లో 8.3, మోతీనగర్‌లో 7.9, మాదాపూర్‌లో 7.7, యూసఫ్‌గూడలో 7.6, బాలానగర్‌లో 7.1, చాంద్రాయణగుట్టలో 6.9, శ్రీనగర్‌ కాలనీలో 6.8, ఫాతిమానగర్‌లో 6.5,  ఎల్బీనగర్‌లో 6.3, రంగారెడ్డి నగర్‌లో 5.9, జీడిమెట్లలో 5.8, ఆసిఫ్‌నగర్, కేపీహెచ్‌బీలలో 5.7,  గాజులరామారంలో 5.4,  అత్తాపూర్‌లో  4.5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది.

రంగంలోకి జీహెచ్‌ఎంసీ బృందాలు
జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచి నీటిని తోడివేశాయి. డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల కోసం 040 21111111 నంబర్‌కు ఫోన్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. ఇళ్లలోంచి బయటికి రావద్దని ప్రజలను అప్రమత్తం చేసింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు