ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం: ఇద్దరు సజీవ దహనం

16 Apr, 2021 14:45 IST|Sakshi

రాజేంద్రనగర్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్‌లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీ నుంచి రొయ్యల లోడ్‌తో మహారాష్ట్రకు వెళ్తున్న కంటైనర్‌ ముందు వెళ్తున్న గుర్తుతెలి యని వాహనాన్ని ఢీకొంది. ఈ తీవ్రతకు కంటైనర్‌ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. డోర్లు లాక్‌ కావడం, లోపల ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో క్షణాల్లో అగ్నికీలలు విస్తరించాయి. దీంతో అందులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అంతా నిమిషాల్లోనే...
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఉమామహేశ్వరరావు రొయ్యల వ్యాపారి. పాలకొల్లు నుంచి ముంబైకి రొయ్యలు ఎగుమతి చేస్తుంటారు. ఈయన వద్ద థానేకు చెందిన ముత్యంజయ యాదవ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సూర్యకుమార్‌ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. పాలకొల్లు నుంచి ఓ కంటైనర్‌ (ఏపీ 39 టీక్యూ 5734)లో ఇద్దరు డ్రైవర్లు బయలుదేరారు. వీరిలో ఒకరు వాహనం నడుపుతుండగా మరొకరు క్యాబిన్‌లో ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ వాహనం ఓఆర్‌ఆర్‌ మీదుగా ప్రయాణిస్తూ హిమాయత్‌సాగర్‌ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదం ధాటికి కంటైనర్‌ ముందు భాగం దెబ్బతినడంతో పాటు మంటలు అంటుకున్నాయి. క్యాబిన్‌ కూడా ధ్వంసం కావడంతో పాటు దాని డోర్స్‌ లాక్‌ అయ్యాయి. నిమిషాల వ్యవధిలోని మంటలు క్యాబిన్‌ మొత్తం ఆక్రమించాయి. వీటిలో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఇతర వాహన చోదకులు ఆగి వారిని కాపాడే ప్రయత్నాలు చేశారు. క్యాబిన్‌ ముందు అద్దాలు పగులకొట్టినా.. మంటల ఉధృతి కి వెనక్కు తగ్గారు. గ్యాస్‌సిలిండర్‌ పేలిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. కేబిన్‌లో చిక్కుకున్న ఇద్దరు డ్రైవర్లు పూర్తిగా కాలిపోయారు. రాజేంద్రనగర్‌ పోలీసులు అగ్నిమాపక శాఖకు సమాచారమివ్వడంతో ఫైరింజన్‌ మంటల్ని ఆర్పింది. మృతదేహాలకు పంచనామా నిర్వహించిన రాజేంద్రనగర్‌ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. ఈ ఉదం తంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కంటైనర్‌ ఢీకొట్టిన వాహనం వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

>
మరిన్ని వార్తలు