మధ్యవర్తిత్వంతోనే ఇరు పార్టీలు హ్యాపీ!

2 Mar, 2021 03:00 IST|Sakshi

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి

సాక్షి, హైదరాబాద్‌: ‘కోర్టుల్లో కేసు గెలిస్తే ఒక పార్టీ మాత్రమే ఆనందంగా ఉంటుంది. ఓడిన పార్టీ అప్పీల్‌కు వెళ్తుంది. అయితే మీడియేషన్‌తో వివాదం పరిష్కారమైతే ఇరు పార్టీల ముఖాల్లో చిరునవ్వు చూడొచ్చు’అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి వ్యాఖ్యానించారు. మీడియేషన్‌ ద్వారా కేసులను పరిష్కరించడంతో న్యాయస్థానాలపై కేసుల భారాన్ని తగ్గించడమే కాక అప్పీల్‌ రూపంలో కొత్త కేసులు నమోదు కావడం లేదని తెలిపారు. ఈ-మీడియేషన్‌ రైటింగ్స్‌ ఆధ్వర్యంలో ప్రచురించిన 10వ వార్షిక సంచికను జస్టిస్‌ హిమా కోహ్లి సోమవారం జూమ్‌ ఆన్‌లైన్‌ మీటింగ్‌ ద్వారా ప్రారంభించారు.

అనంతరం ‘పీస్‌ బిగిన్స్‌ ఫ్రం హోం’అనే అంశంపై జస్టిస్‌ హిమా కోహ్లి ప్రసంగించారు. ఇంట్లో శాంతి లేకపోతే శరీరం ఒకచోట, మనసు ఇంకో చోట ఉంటుందని, ఇంట్లో శాంతి ఉన్నప్పుడే.. సమాజం ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. వివాదాల పరిష్కారంలో మీడియేటర్లు కీలక భూమిక పోషిస్తున్నారని, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, అన్నాతమ్ముళ్ల మధ్య ఇలాంటి కుటుంబ వివాదాలు పరిష్కరించడం ద్వారా ఆ కుటుంబీకుల ముఖాల్లో చిరునవ్వు చూడటానికి మించిన సంతృప్తి లేదని వెల్లడించారు.

ఆ బాధ వర్ణించలేం..
ఇంట్లో ప్రశాంతత లేకపోతే ఆ కుటుంబంలో అశాంతి నెలకొంటుందని, ఆ బాధ వర్ణించలేమని జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ పేర్కొన్నారు. కుటుంబ వివాదాల పరిష్కారంలో మీడియేటర్లు క్రియాశీలంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియేటర్లు వివాదాలను పరిష్కరించడం అభినందనీయమని తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి అన్నారు.

ఓ కుటుంబ వివాదంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా.. కుటుంబ వివాదాల్లో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే భార్యాభర్తలకు ముందుగా కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా 40 శాతం వివాదాలను పరిష్కరించగలు గుతున్నామని నగర జాయింట్‌ కమిషనర్‌ అవినాశ్‌ మొహంతి పేర్కొన్నారు. మరో 25 శాతం వివాదాలు ఇరు పక్షాల విజ్ఞప్తి మేరకు కేసుల దాకా వెళ్లకుండా పెండింగ్‌లో ఉంటున్నాయని, 35 శాతం వివాదాలు  కేసుల వరకు వెళ్తున్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు