ఖాళీ డీజిల్‌ ట్యాంకర్‌ పేలి ఇద్దరు మృతి

8 Feb, 2022 02:50 IST|Sakshi
పేలిపోయిన ట్యాంకర్‌ను చూస్తున్న ప్రజలు

ట్యాంకర్‌ వాల్వ్‌లకు వెల్డింగ్‌ చేస్తుండగా ప్రమాదం 

కిలోమీటర్‌ దూరంలో ఎగిరిపడ్డ ట్యాంకర్‌ శకలాలు

భారీ శబ్దానికి ఉలిక్కిపడిన సూర్యాపేట 

సూర్యాపేట: ఖాళీ డీజిల్‌ ట్యాంకర్‌కు గ్యాస్‌ వెల్డింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్‌ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. సోమవారం సూర్యాపేట జిల్లా కేం ద్రంలోని కొత్త బస్టాండ్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. సూర్యాపేటలోని రాంకుమార్‌కు చెందిన డీజిల్‌ ట్యాంకర్‌ వాల్వ్‌లు లీకై డీజిల్‌ కారుతోంది. ట్యాంకర్‌కు వెల్డింగ్‌ చేయించేందుకు డ్రైవర్లు వెంకటనారాయణ, మల్లేష్‌ కొత్త బస్టాండ్‌ సమీపంలోని దుకాణం వద్దకు తెచ్చారు.

దుకాణ యజమాని మంత్రి అర్జున్‌ గ్యాస్‌ వెలిగించి వాల్వ్‌కు వెల్డింగ్‌ చేస్తుండగా.. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ట్యాంకర్‌ పేలింది. వెల్డింగ్‌ చేస్తున్న మంత్రి అర్జున్‌ (32)తోపాటు అక్కడే ఉన్న కుడకుడకు చెందిన గట్టు అర్జున్‌ (50) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. వెంకటనారాయ ణ, మల్లేష్‌కు తీవ్ర గాయాలుకాగా, మరో ట్యాంకర్‌ డ్రైవర్‌ రమణకు స్వల్పగాయాలయ్యాయి. మల్లేష్‌ పరిస్థితి విషమంగా ఉం డడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మంత్రి అర్జున్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గట్టు అర్జున్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. 

ఇళ్లపై పడిన ట్యాంకర్‌ శకలాలు 
డీజిల్‌ ట్యాంకర్‌ పేలిపోవడంతో ట్యాంకర్‌ శకలాలు సమీపంలోని మెకానిక్‌ దుకాణంతోపాటు కిలోమీటర్‌ దూరంలో ఉన్న బాలాజీనగర్, విద్యానగర్‌లోని ఇళ్లపై ఎగిరిపడ్డాయి. ఇళ్ల తలుపులు, కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఏం జరిగిందో తెలియక ఇళ్లలో ఉన్నవారంతా బయటికి పరుగులు తీశారు.  ట్యాంకర్‌లో నీటిని నింపి వెల్డింగ్‌ చేయిస్తే ప్రమాదం సంభవించేది కాదని పలువురు డ్రైవర్లు చెప్పారు. ఖాళీ ట్యాంకర్‌ అయినా అడుగున ఎంతో కొంత డీజిల్‌ ఉం టుందని, తద్వారా ప్రమాదం సంభవించి ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.   

మరిన్ని వార్తలు