మిడ్‌మానేరులో ఇద్దరు గల్లంతు.. ఆచూకీ లేదు

16 Mar, 2021 09:13 IST|Sakshi
సంఘటన స్థలం వద్ద జనం

సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక ఫోర్‌లేన్‌ వంతెనపై నుంచి మిడ్‌మానేరులో సోమవారం రాత్రి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ వ్యక్తి దూకగా.. సంఘటన స్థలంలో జనం గుమిగూడడంతో పరిశీలిస్తూ వంతెన దాటే ప్రయత్నంలో మరోవ్యక్తి ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడిపోయాడు. ఎస్సై శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌ గ్రామానికి చెందిన సాయికృష్ణ(26)కు జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన యువతితో ఆర్నెల్ల క్రితం వివాహం జరిగింది. వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సాయికృష్ణ మిడ్‌మానేరు వంతెన వద్ద బైక్‌ నిలిపి తన సోదరుడికి ఫోన్‌ చేశాడు. వంతెన వద్ద ఉన్న ‘ఐ మిస్‌యూ అన్న’ అంటూ చెప్పి మిడ్‌మానేరులో దూకాడు. అతడి సోదరుడు, సంబంధీకులు వచ్చి మిడ్‌మానేరు వద్ద చూడగా మోటారు సైకిల్‌ కనిపించింది. కానీ సాయికృష్ణ కనిపించలేదు. 

ప్రమాదవశాత్తు పడిపోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌
కరీంనగర్‌ పట్టణానికి చెందిన గడ్డం రాజశేఖర్‌రెడ్డి(30) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. లాక్‌డౌన్‌తో ఇంటివద్ద నుంచే పనిచేస్తున్నాడు. అతడి మిత్రుడు అజిజ్‌ కొరియర్‌లో పనిచేస్తాడు. అజిజ్‌తో కలిసి కొరియర్‌ డబ్బు ఇవ్వడానికి సిరిసిల్లకు వెళ్లి సోమవారం రాత్రి వంతెన పరిసరాల్లో నుంచి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జి వద్ద సాయికృష్ణ దూకడంతో అక్కడ జనం గుమిగూడి ఉండడం చూసి ఆగారు. ఇంకోవైపు బ్రిడ్జి వద్ద ఉన్న జనం వద్దకు వెళ్లేందుకు రెండు వంతెనల మధ్యలో నుంచి దారి ఉందనికుని దాటే ప్రయత్నం చేశాడు. దీంతో రెండు బ్రిడ్జిల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం మానేరు నీటిలో రాజశేఖర్‌రెడ్డి పడ్డాడు. కాగా, ఒకరి ప్రమాదం చూసేందుకు వస్తూ.. కళ్లముందే మరొకరు ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు పడడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా రాత్రి 11 గంటల వరకు ఇద్దరి ఆచూకీ లభించలేదు.

మరిన్ని వార్తలు