తెలంగాణకు 2 విశిష్ట సేవా పతకాలు  

26 Jan, 2021 02:10 IST|Sakshi

రిపబ్లిక్‌ డే సందర్భంగా శిఖా గోయల్, శివశంకర్‌రెడ్డికి ప్రకటించిన కేంద్రం

12 పోలీసు ప్రతిభా పతకాలు, 3 అత్యుత్తమ సేవా పురస్కారాలు కూడా..

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. తెలంగాణకు రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, 12 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. హైదరాబాద్‌ అదనపు సీపీ శిఖా గోయల్, నిజామాబాద్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలను దక్కించుకున్నారు.

ఇక ప్రతిభా పతకాలకు రాజేశ్‌ కుమార్‌ (ఐజీ ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్, హైదరాబాద్‌), షరీపుద్దీన్‌ సిద్దిఖీ (కమాండెంట్, టీఎస్‌ఎస్‌ఎస్పీ బెటాలియన్‌ హైదరాబాద్‌), కందుకూరి నర్సింగరావు (డీఎస్పీ, నిర్మల్‌), సూర్యనారాయణ సోమగాని (డీఎస్పీ, ఏసీబీ రంగారెడ్డి), గోవర్ధన్‌  తన్నీరు (ఏసీపీ, హైదరాబాద్‌), గుంజ రమేశ్‌(డిప్యూటీ అసల్ట్‌ కమాండర్, గ్రేహౌండ్స్‌), ఎం.ఉద్ధవ్‌ (కానిస్టేబుల్, టీఎస్‌ఎస్‌ఎస్పీ 13వ బెటాలియన్, మంచిర్యాల), బృంగి గోవర్దన్‌ (సబ్‌ఇన్‌స్పెక్టర్, ఇంటెలిజెన్స్‌ హైదరాబాద్‌), కొత్తపల్లి కరుణాకర్‌ రెడ్డి (అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, సీసీఎస్, షీ టీం), భట్టురాజు మోహన్‌రాజు (అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, టీఎస్‌ఎస్‌ఎస్పీ 13వ బెటాలియన్, మంచిర్యాల), దేవులపల్లి మోహన్‌రెడ్డి (కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్‌, మహమ్మద్‌ నయీముద్దీన్‌(కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్‌) కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. 

అత్యుత్తమ సేవా పురస్కారానికి..: ఇటు తెలంగాణలోని జైళ్ల శాఖలో పనిచేస్తున్న చీఫ్‌ హెడ్‌ వార్డర్లు అయిన వి.చంద్రయ్య, గడ్డం సోమశేఖరరెడ్డి, జి.దైనమ్మలు ఖైదీల్లో సత్ప్రవర్తనకు దోహదపడినందుకు గానూ అత్యుత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. 

ఇద్దరికి ఫైర్‌ సర్వీస్‌ ప్రతిభా పురస్కారాలు..: దేశవ్యాప్తంగా 73 మందికి ఫైర్‌ సర్వీస్‌ మెడల్స్‌ను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇందులో రాష్ట్రపతి ఫైర్‌ సర్వీస్‌ శౌర్య పతకాన్ని 8 మందికి, ఫైర్‌ సర్వీస్‌ శౌర్య పతకాన్ని ఇద్దరికి ప్రకటించింది. అలాగే రాష్ట్రపతి ఫైర్‌ సర్వీస్‌ విశిష్ట సేవా పురస్కారాన్ని 13 మందికి, ఫైర్‌ సర్వీస్‌ ప్రతిభా పురస్కరాన్ని 50 మందికి ప్రకటించింది. కాగా ఫైర్‌ సర్వీస్‌ ప్రతిభా పురస్కారాలకు రాష్ట్రంలోని యజ్ఞనారాయణ అన్నపురెడ్డి (డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌), కట్ట జగదీశ్వర్‌ (లీడింగ్‌ ఫైర్‌మ్యాన్‌ ) లు ఎంపికయ్యారు. 

రాష్ట్ర పరిధిలో ఇతర బలగాల్లో పనిచేస్తున్న అధికారులకు..: బి.వెంకట్‌రెడ్డి (డిప్యూటీ కమాండెంట్, సీఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఎస్‌ హెడ్‌క్వార్టర్స్, హైదరాబాద్‌), మొలుగు రాజా (సీఆర్‌పీఎఫ్, జీసీ రంగారెడ్డిలో ఇన్‌స్పెక్టర్‌), పుల్లల చెరువు నారాయణ (అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఎన్‌ఎఫ్‌సీ యూనిట్, సీఐఎస్‌ఎఫ్‌ హైదరాబాద్‌), జైపాల్‌రెడ్డి (జేఐఓ–1, ఎంహెచ్‌ఓ, హైదరాబాద్‌ యూనిట్‌), టీవీ రాజేశ్‌ (డీఎస్పీ, ఎన్‌ఐఎ హైదరాబాద్‌), సత్వీర్‌ సింగ్‌ (డిప్యూటీ కమాండెంట్, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీ), సెందమంగళం రామస్వామి గాంధీ (సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్, రైల్వే శాఖ), కరుణానిధి మధుసూధన్‌ (ఇన్‌స్పెక్టర్, ఆర్‌పీఎఫ్, ఖమ్మం), ఎస్‌.పవన్‌  సింగ్‌ (ఇన్‌స్పెక్టర్, రైల్‌ నిలయం, సికింద్రాబాద్‌)లకు పోలీస్‌ ప్రతిభా పురస్కారాలు వరించాయి. 

జమ్మికుంట సీఐకి ‘ఉత్తమ్‌ జీవన్‌ రక్ష’
జీవన్‌ రక్ష పతకాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం.. 
సాక్షి, న్యూఢిల్లీ: సాటి మనుషుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఇచ్చే జీవన్‌ రక్ష పతకాల ప్రదానానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఇందులో ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పతకానికి ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి కూడా ఉన్నారు.. సర్వోత్తమ్‌ జీవన్‌ రక్ష పతకం, ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పతకం, జీవన్‌ రక్ష పతకం విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రదానం చేస్తోంది. 2020 సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా మొత్తం 40 మందిని ఈ పతకాలకు ఎంపిక చేశారు. సర్వోత్తమ్‌ జీవన్‌ రక్ష పతకాన్ని ఒకరు, ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పతకాన్ని 8 మంది, జీవన్‌ రక్ష పతకాన్ని 31 మంది అందుకోనున్నారు. వీరిలో కేరళకు చెందిన ముహమ్మద్‌ హుష్రీన్‌ (మరణానంతర)కు సర్వోత్తమ్‌ జీవన్‌ రక్ష పతకాన్ని కేంద్రం ప్రకటించింది. 


సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి

ఇద్దరిని కాపాడినందుకు..: ఇక 2019 మే 28న కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లిలో చేద బావి పూడిక కోసం బావిలోకి దిగి స్పృహ కోల్పోయిన ఇద్దరు గ్రామస్తులను జమ్మికుంట టౌన్‌ సీఐ సృజన్‌రెడ్డి కాపాడారు. ఘటనపై సత్వరమే స్పందించిన ఆయన బావిలోకి దిగి అగ్నిమాపక సిబ్బంది సాయంతో వారిని రక్షించారు. దీనిని గుర్తించిన కేంద్రం సృజన్‌రెడ్డిని 2020 సంవత్సరానికి గాను ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పతకానికి ఎంపిక చేసింది.  

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు