Hyderabad: ఇద్దరు బాలికల అదృశ్యం

24 Mar, 2023 09:23 IST|Sakshi
శిరీష

సాక్షి, బంజారాహిల్స్‌: ఫిలింనగర్‌లోని రౌండ్‌ టేబుల్‌ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న  వి.శిరీష (12) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో  అదృశ్యమైంది. అయితే తమ కూతురిని డబ్బు కోసం కిడ్నాప్‌  చేశారంటూ తండ్రి వి.కృష్ణ ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని దుర్గా భవానీనగర్‌లో నివసించే వి.శిరీష స్థానికంగా ఏడో తరగతి చదువుతోంది. ఈ నెల 12న ఉదయం తల్లిదండ్రులు జీహెచ్‌ఎంసీలో పనులకు వెళ్లగా, ఇంట్లో ఉన్న సోదరి కనిపించడం లేదంటూ కొడుకు నరేష్‌ తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాడు.

హుటాహుటిన ఇంటికి చేరుకున్న కృష్ణ, సుజాత దంపతులు అన్ని ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. తనకు వరుసకు మేనల్లుడు వి.మల్లేష్‌ (22) కూడా కనిపించడం లేదని, అతడిపైనే తమకు అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణ పేర్కొన్నాడు. డబ్బుల కోసం తన కూతురిని కిడ్నాప్‌ చేశారని, సీసీ కెమెరా ఫుటేజీలో మల్లేష్‌ తల్లి సరోజమ్మ తన కూతురిని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించిందన్నారు.

మల్లేష్‌ ఇటీవల తనను రూ. 50 వేలు అడిగాడని, తాను లేవని చెప్పడంతో కక్ష పెంచుకొని తన కూతురికి మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. బంజారాహిల్స్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శిరీష ఆచూకీ తెలిసిన వారు 8712660458 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.   

బంజారాహిల్స్‌లో 9వ తరగతి విద్యార్థిని
బంజారాహిల్స్‌: అనుమానాస్పదస్థితిలో 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్‌ రోడ్‌ నం 10లోని నూర్‌నగర్‌లో నివసించే అమ్రీన్‌ బేగం(14) సెయింట్‌ నిజామియా హైస్కూల్‌లో చదువుతోంది. ఈ నెల 21న జహిరానగర్‌లోని షాహిన్‌ కన్వెన్షన్‌ హాల్‌లో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఫేర్‌వెల్‌ పార్టీకి హాజరైంది.

రాత్రి 11 గంటల ప్రాంతంలో సోదరుడు హనీఫ్‌ ఫోన్‌ చేయగా కార్యక్రమం ఇంకా జరుగుతున్నదని, కొద్దిసేపట్లో వస్తానని తెలిపింది. అయితే సోదరుడు కొంత సమయం తర్వాత హాల్‌ వద్దకు వచ్చి చూడగా కనిపించలేదు. రాత్రి ఒంటిగంట వరకు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో షాహిన్‌ కన్వెన్షన్‌ హాల్‌ నుంచి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన చెల్లెలు అదృశ్యమైందని పోలీసులకు హనీఫ్‌ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు